కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కేసు షీట్లు మారిన ఘటనపై సూపరింటిండెంట్ డాక్టర్ బుద్ద స్పందించారు.
కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కేసు షీట్లు మారిన ఘటనపై సూపరింటిండెంట్ డాక్టర్ బుద్ద స్పందించారు. కేస్ షీట్లు మారిడం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. సత్యవతికి సరైన వైద్యమే అందించామని.... అనుమానాలు ఉంటే పోస్ట్మార్టం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని సూపరింటిండెంట్ అన్నారు.
కాగా వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళా రోగుల కేస్‌షీట్లు మారిపోయాయి. గోకవరానికి చెందిన మాదిరెడ్డి సత్యవతి అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. వేట్లపాలేనికి చెందిన మాదాసు సత్యవతి మూడురోజుల కిందట జ్వరంతో బాధపడుతూ చేరింది. వైద్య పరీక్షల సమయంలో సిబ్బంది మాదిరెడ్డి సత్యవతి కేస్‌షీట్... మాదాసు సత్యవతికి ఇచ్చారు.
ఈ విషయాన్ని గుర్తించక పోవడంతో... రాత్రి డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ ఒకరికి చేయాల్సిన ఇంజెక్షన్ మరొకరికి చేశారని... ఫలితంగా వైద్యం వికటించి మాదాసు సత్యవతి మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని... తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.