ఏ క్షణంలోనైనా దావూద్ ఫినిష్
- భారత్ తన శత్రువుల పట్ల నిర్లక్ష్యంగా ఉండదు
- కోవర్ట్ కాదు.. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా మాఫియా డాన్‌ను పనిపడతాం
- కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మాఫియా డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను నిర్వీర్యం చేసేందుకు కోవర్ట్ ఆపరేషన్ లేదా స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. కోవర్ట్ ఆపరేషన్ నిర్వహిస్తే దానికి సంబంధించిన వివరాలను ప్రజలకు వెల్లడించడం కుదరదని, అందుకే ప్రత్యేక ఆపరేషన్ ద్వారా భారత ప్రభుత్వం దావూద్ పనిపడుతుందని , ఆ పని ఏ క్షణమైన జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 'సామ, దాన, బేధ, దండోపాయాల సంగతి తెలుసుకదా.. దావూద్ విషయంలో వాటిలో కొన్నింటిని ఇప్పటికే ప్రయోగించాం. మిగిలినవాటిని త్వరలోనే ప్రయోగిస్తాం. ఆ వార్త మీకూ అందుతుంది' అని రాథోడ్ అన్నారు.
ఒక జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నప్పటికీ దావూద్‌ను పట్టుకునే విషయంలో ముందడుగు వేయకపోవడమేమిటన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'భారత్ తన శత్రువుల విషయంలో ఎన్నడూ నిర్లక్ష్యం వహించదు. ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ అతని కదలికలపై మాకు పూర్తి సమాచారం ఉంది. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి ఏదో ఒక సందర్భంలో డీ పని ముగించేస్తాం' అని సమాధానమిచ్చారు.
కాగా, గతంలోనూ ఇదే మాదిరిగా దావూద్‌ను అంతం చేసేందుకు ఆపరేషన్లు నిర్వహించామని వెల్లడించిన పలువురు విశ్రాంత అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ తరహా వ్యాఖ్యలు.. ఎలాంటి విచారణ చేపట్టకుండా భారత్ తన పౌరులను తానే చంపుకొంటుందనే పాక్ విమర్శలకు బలం చేకూర్చుతాయని దౌత్యవర్గాలు సైతం అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యవర్ధన్ తాజా వ్యాఖ్యలపై ఎలాంటి దుమారం చెలరేగుతుందో చూడాలి!