CBI court Verdict
-
జై శ్రీరాం నినాదంతో తీర్పును స్వాగతించా!
-
బాబ్రీ తీర్పుపై స్పందించిన బీజేపీ దిగ్గజ నేత
సాక్షి, న్యూఢిల్లీ : 1992 బాబ్రీ మసీదు విధ్వంసం కేసు నుంచి తనతో సహా నిందితులందరినీ నిర్ధోషులుగా ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం వెలువరించిన తీర్పుపై బీజేపీ దిగ్గజనేత ఎల్కే అద్వానీ స్పందించారు. ఈ తీర్పు రామమందిర ఉద్యమం పట్ల బీజేపీతో పాటు తనకున్న విశ్వాసం, చిత్తశుద్ధిని ప్రతిబింబించిందని చెప్పారు. తీర్పు వెలువడిన అనంతరం తాను జై శ్రీరాం అంటూ నినదించానని, ఇది తమందరికీ సంతోషకర క్షణమని అభివర్ణించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు వెల్లడించిన చారిత్రాత్మక తీర్పు అనంతరం తాజా తీర్పు వెలువడటం స్వాగతించదగిన పరిణామమని అద్వానీ చెప్పుకొచ్చారు. ఈ తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని 92 సంవత్సరాల అద్వానీ పేర్కొన్నారు. కాగా బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ దిగ్గజ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్‌లపై కుట్ర ఆరోపణలు సహా 32 మంది నిందితులపై అభియోగాల నుంచి లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విముక్తి కల్పించింది. 1992, డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరిగింది కాదని న్యాయస్ధానం స్పష్టం చేసింది. సంఘ విద్రోహ శక్తులు కట్టడాన్ని కూల్చాయని, నిందితులు మసీదు కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి ఎస్కే యాదవ్ పేర్కొన్నారు. సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియో ఆధారాలు నేతలపై ఆరోపణలను బలపరిచేలా లేవని తేల్చిచెప్పారు. ఇక గత ఏడాది నవంబర్‌లో వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ స్ధలంలోనే ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. చదవండి : న్యాయం గెలిచింది.. క్షమాపణ కోరండి: యోగి -
లాలూ ‘దాణా’ కేసులో తీర్పు నేడే!
రాంచీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా సహా 22 మందిపై నమోదైన దాణా కుంభకోణం కేసులో ఇక్కడ సీబీఐ కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. విచారణకు హాజరయ్యేందుకు లాలూ తన కుమారుడు తేజస్వీతో కలిసి శుక్రవారం రాంచీకి చేరుకున్నారు. 1991–94 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేసినట్లు లాలూ సహా 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్ 27న చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
శిక్షను సవాల్ చేయనున్న గుర్మీత్ సింగ్
రోహ్తక్: అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన 20 సంవత్సరాల జైలు శిక్ష తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నట్లు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తరఫు న్యాయవాదులు సూచన ప్రాయంగా తెలిపారు. కోర్టు తీర్పు పూర్తి కాపీ చదివిన తరువాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని రోహ్తక్ జైలు వెలుపల మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆశ్రమంలో సాధ్వీలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన గుర్మీత్‌ను కఠినంగా శిక్షించాలన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన జడ్జి జగ్దీప్ సింగ్.. దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2002నాటి అత్యాచారం కేసును సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేయలేదని, సరైన సాక్ష్యాధారాలు కూడా సమర్పించలేకపోయిందని గుర్మీత్ తరఫు న్యాయవాదులు ఆరోపించారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని పేర్కొన్నారు. గుర్మీత్ గొప్ప సంఘ సవకుడు: సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేయడానికి ముందు వాదనలు వినిపించిన గుర్మీత్ సింగ్ న్యాయవాదులు.. బాబాను గొప్ప సంఘ సేవకుడిగా పేర్కొన్నారు. పేదల కోసం ఆయన ఎన్నో సేవలు చేశారని, వాటిని దృష్టిలో ఉంచుకుని కఠినశిక్షలేవీ వేయవద్దని న్యాయమూర్తిని కోరారు. సీబీఐ మాత్రం గుర్మీత్‌ను కఠినంగా శిక్షించాలని కోరింది. అన్నీ విన్న జడ్జి చివరికి గుర్మీత్‌కు 10 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించారు. (చదవండి: అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష)