CCLA officials
-
రెవెన్యూలో గాడి తప్పిన పాలన
⇒ భూపరిపాలన ప్రధాన కమిషనర్ పోస్టు ఆర్నెల్లుగా ఖాళీ ⇒ ప్రభుత్వ పథకాల అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం కరువు ⇒ ఏళ్లు గడుస్తున్నా ముగియని క్రమబద్ధీకరణ ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో పాలన గాడి తప్పింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాల్సిన పెద్దదిక్కు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రెవెన్యూ విభాగంలోనే ఎంతో కీలకమైన భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టు గత ఆరు నెలలుగా ఖాళీగానే దర్శనమిస్తోంది. ప్రభుత్వం.. గత రెండున్నరేళ్లుగా ఈ పోస్టు భర్తీ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా తయారైంది. దీంతో రెండేళ్ల కిత్రం ప్రభుత్వం ప్రారంభించిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ (జీవో 59) కథ నేటికీ కంచికి చేరలేదు. మరోవైపు లక్షల సంఖ్యలో వచ్చిన సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు.కంచికి చేరని క్రమబద్ధీకరణ కథ అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి ఆయా భూములను క్రమబద్ధీకరిచేందుకు 2014 డిసెంబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్పాదాయ వర్గాలకు 125 గజాలలోపు స్థలాలను ఉచిత కేటగిరీలో, ఉన్నత వర్గాలకు చెల్లింపు కేటగిరీలో ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ ప్రక్రియ అంతటినీ మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉండగా, రెండేళ్లు దాటినా చెల్లింపు కేటగిరీ దరఖాస్తులకు పూర్తిగా మోక్షం కలగలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలుమార్లు గడువును పొడిగించినా, క్రమబద్ధీకరణ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్యవస్థ సరిగా పనిచేయక క్షేత్రస్థాయి సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దరఖాస్తు దారులు సకాలంలో సొమ్ము చెల్లించలేకపోయారని పలు జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. మరో ఆరు నెలల పాటు గడువు పెంచాలని కొందరు జిల్లా కలెక్టర్లు నెలరోజుల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాసినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. మరోవైపు తాము పూర్తిస్థాయిలో సొమ్ము చెల్లించినప్పటికీ, తమ స్థలాలను క్రమబద్ధీకరణ చేయకపోవడం పట్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. సాదాబైనామాలకూ కలగని మోక్షం గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు తెల్లకాగితాలపై రాసుకున్న భూముల క్రయ విక్రయాలను (సాదా బైనామా) కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం 2016 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 11.16 లక్షల దరఖాస్తులు అందగా.. ఇప్పటివరకు క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చింది మాత్రం 34 వేల మంది రైతులకే కావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 2.93 లక్షల దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించినప్పటికీ, ఇంకా ఆరున్నర లక్షలమంది దరఖాస్తు దారులకు సాదా బైనామాలను ప్రభుత్వం ఎప్పుడు క్రమబద్ధీకరిస్తుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు హైదరాబాద్, వరంగల్ నగరాల పరిధిలోని కొన్ని మండలాలలో సాదా బైనామాల క్రమబద్ధీకరణను తొలుత నిషేధించిన ప్రభుత్వం, ఆపై నిషేధాన్ని సడలిస్తూ గత డిసెంబరులో జీవో నెంబరు 294 జారీచేసింది. అయితే కొన్ని మండలాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణపై నిషేధాన్ని ప్రభుత్వం సడలించినా, ఆయా మండలాలలో క్రమబద్ధీకరణకు కొత్తగా దరఖాస్తులను స్వీకరించేందుకు సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో దరఖాస్తు చేసుకుందామనుకున్న రైతులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. కొత్త జిల్లాల్లో భర్తీ కాని పోస్టులు మరోవైపు కొత్త జిల్లాలతో కొత్తగా 125 మండలాలు, 25 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా పోస్టులలో పూర్తిస్థాయి తహసీల్దార్లను, ఆర్డీవోలను నియమించలేదు. మరోవైపు భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే నిమిత్తం క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం కోసం సీసీఎల్ఏ అధికారులు రూ. 5 కోట్లతో కొనుగోలు చేసిన టాబ్లెట్ పీసీలు, గత రెండు నెలలుగా మూలనపడి పాడవుతున్నాయి. -
మండలానికో డిజిటల్ లైబ్రరీ
♦ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు సీసీఎల్ఏ ప్రణాళిక ♦ రూ.100 కోట్లు వెచ్చించనున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయి రెవెన్యూ రికార్డులను సక్రమంగా భద్రపరచాలని రాష్ట్ర భూపరిపాలన విభాగం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ మండలంలో ఒక డిజిటల్ లైబ్రరీ(మోడరన్ రికార్డ్ రూమ్)ని ఏర్పాటు చేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సెంట్రలైజ్డ్ మోడరన్ రికార్డ్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం(ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) కింద రూ.100 కోట్లకై పైగా వెచ్చించేందుకు సర్కారు సన్నద్ధమైంది. రికార్డులన్నింటినీ హార్డ్‌కాపీ, స్కాన్ చేసి కంప్యూటర్లో సాఫ్ట్ కాపీ రూపాల్లోనూ, ప్రజలకు అవసరమైన రికార్డులను ఎవరైనా ఇంటర్నెట్ ద్వారా వీక్షించేందుకు వీలుగా ఆన్లైన్లో పెట్టనున్నారు. మీసేవ, ఈ సేవల ద్వారా ప్రజలు కోరుకునే రికార్డులను సంబంధిత అధికారి డిజిటల్ సిగ్నేచర్‌తో అందజేయనున్నారు. రికార్డులు ఎట్టి పరిస్థితుల్లోనూ టాంపరింగ్‌కు అవకాశం లేకుండా బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని అవలంబించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. మండల స్థాయిని బట్టి ఒక్కో మండలంలో రికార్డుల నిర్వహణకై డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు వరకు ఖర్చు అవుతుందని సీసీఎల్ఏ అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. డిజటల్ లైబ్రరీల ఏర్పాటు నిమిత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థతో భూపరిపాలన విభాగం ఉన్నతాధికారులు సంప్రదించారు. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు ప్రక్రియపై ఈ నెల 29న అన్ని జిల్లా కలెక్టర్లతో జరగనున్న సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీసీఎల్ఏ రేమండ్ పీటర్ అన్నారు. మే నెల కల్లా విలేజ్ మ్యాప్‌లు సిద్ధం రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు భూపరిపాలన విభాగం ఇటీవల ప్రవేశపెట్టిన మా భూమి వెబ్‌పోర్టల్‌కు మంచి స్పందన వస్తోందని సీసీఎల్ఏ అధికారులు తెలిపారు. గ్రామ పటాల(విలేజ్మ్యాప్)ను మాభూమి వెబ్‌పోర్టల్‌లో పొందుపరిచేందుకై డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,829 రెవెన్యూ గ్రామాలుండగా, ఇందులో ఇప్పటివరకు 10,346 గ్రామాల పటాల(మ్యాప్)ను క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధం చేశారని తెలిపారు. మే నెలాఖరు కల్లా వెబ్‌పోర్టల్‌లో గ్రామపటాలను పొందుపరుస్తామన్నారు. వారానికి 5 రోజులు క్షేత్రాల్లోనే.. రెవెన్యూ రికార్డుల్లో భూముల వివరాల తప్పులను సరి చేసే నిమిత్తం సర్వేయర్లు వారానికి ఐదురోజులపాటు క్షేత్రస్థాయిలోనే పని చేయాలని ఆదేశాలిచ్చినట్లు రేమండ్ పీటర్ తెలిపారు. సర్వే కోసం వచ్చిన దరఖాస్తులను స్వీకరించి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని సర్వేయర్లకు సూచించామన్నారు. -
పట్టా పాస్‌పుస్తకాలతో ఆధార్ సీడింగ్!
రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సీసీఎల్ఏ అధికారుల కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలకు కళ్లెం వేయాలని సర్కారు నిర్ణయించింది. వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ పట్టాదారుకు తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ మేరకు అన్ని జిల్లాల్లోనూ భూములు కలిగిన యజమానుల వద్ద ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలకు ఆధార్ నంబరును అనుసంధానం చేసేందుకు సీసీఎల్ఏ అధికారులు సన్నద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు కోసం జాతీయ సమాచార కేంద్రం(ఎన్ఐసీ) అధికారులతో కలసి కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా.. పట్టాదార్ పాస్‌పుస్తకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఏ రైతుకు ఏ ప్రాంతంలో ఎంత భూమి ఉందన్న మొత్తం సమాచారాన్ని ఇట్టే తెలుసుకునేందుకు వీలు కలుగనుంది. అలాగే.. రైతులు కూడా సర్కారు రికార్డుల్లో తమ భూముల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకునేందుకు వెసులుబాటు కలగనుంది. వారి భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఇతరులెవరైనా అక్రమంగా పేర్లు మార్చడం, ఒకరి భూములను వేరొకరి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయడం.. వంటి అవకతవకలను నివారించేందుకు ఆధార్ అనుసంధానం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే వివిధ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు కూడా ఈ విధానం ఉపకరిస్తుందని, తరచుగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు, సిబ్బంది పెద్దగా హైరానా పడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. -
ఆ దరఖాస్తులను ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్ : క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఉచిత పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న రెవెన్యూ యంత్రాంగం.. తాజాగా చెల్లింపు కేటగిరీ దరఖాస్తులపై దృష్టి సారించింది. ఇప్పటికే చెల్లింపు కేటగిరీకి సంబంధించి 29,281దరఖాస్తులు సర్కారు వద్ద ఉండగా, తాజాగా మరిన్ని దరఖాస్తులు జతయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కేటగిరీలో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న 3,36,869 మందిలో 16,915 మంది చెల్లింపు కేటగిరీ పరిధిలోకి వస్తారని అధికారులు తాజాగా నిర్థారించారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. తమ ద రఖాస్తులను చెల్లింపు కేట గిరీలోకి మార్చడం పట్ల దరఖాస్తుదారులు రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీలోకి మారిన దరఖాస్తుదారులకు నోటీసులు ఇచ్చేందుకు సర్కారు సన్నద్ధమైంది. జీవో నెంబరు 59 ప్రకారం నిర్ధేశితం సొమ్మును వెంటనే చెల్లించకుంటే.. ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు పంపాలని భావిస్తోంది. చెల్లింపు కేటగిరీలో స్థలం రిజిస్ట్రేషన్ ధరను చెల్లించేందుకు ప్రభుత్వం ఐదు సులభ వాయిదాల పద్ధతిని, ఒకేసారి చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ సదుపాయాన్ని కూడా కల్పించింది. అయితే.. చెల్లింపు కేటగిరీలో రెండు వాయిదాలను చెల్లించాల్సిన గడువు ఇప్పటికే పూర్తయింది. మూడో వాయిదా చెల్లించే సమయం (జూన్30) కూడా ఆసన్నమవుతున్న తరుణంలో.. ఉచితం నుంచి చెల్లింపు కేటగిరీలోకి మారిన దరఖాస్తుదారులు మూడు వాయిదాల సొమ్మును ఒకేసారి చెలించాల్సి వస్తోంది. ఇప్పటికిప్పుడు రూ.ల క్షలు చెల్లించమనడం ఎంతవరకు సబబని దరఖాస్తుదారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉచితంగా పట్టాలిస్తామంటే.. దరఖాస్తు చేసుకున్నాం గానీ, ఇప్పటికిప్పుడు సొమ్ములు చెల్లించమంటే ఎలాగని ఆగ్రహిస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలు ఇస్తేమేలని అధికారులంటున్నారు. క్షేత్రస్థాయిలో వస్తున్న ఒత్తిడి మేరకు సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని సీసీఎల్ఏ అధికారులు ప్రభుత్వానికి తాజాగా లేఖ రాశారు.