మండలానికో డిజిటల్ లైబ్రరీ
♦ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు సీసీఎల్‌ఏ ప్రణాళిక
♦ రూ.100 కోట్లు వెచ్చించనున్న సర్కారు
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయి రెవెన్యూ రికార్డులను సక్రమంగా భద్రపరచాలని రాష్ట్ర భూపరిపాలన విభాగం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ మండలంలో ఒక డిజిటల్ లైబ్రరీ(మోడరన్ రికార్డ్ రూమ్)ని ఏర్పాటు చేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సెంట్రలైజ్డ్ మోడరన్ రికార్డ్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం(ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) కింద రూ.100 కోట్లకై పైగా వెచ్చించేందుకు సర్కారు సన్నద్ధమైంది.
రికార్డులన్నింటినీ హార్డ్‌కాపీ, స్కాన్ చేసి కంప్యూటర్‌లో సాఫ్ట్ కాపీ రూపాల్లోనూ, ప్రజలకు అవసరమైన రికార్డులను ఎవరైనా ఇంటర్నెట్ ద్వారా వీక్షించేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. మీసేవ, ఈ సేవల ద్వారా ప్రజలు కోరుకునే రికార్డులను సంబంధిత అధికారి డిజిటల్ సిగ్నేచర్‌తో అందజేయనున్నారు. రికార్డులు ఎట్టి పరిస్థితుల్లోనూ టాంపరింగ్‌కు అవకాశం లేకుండా బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని అవలంబించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
మండల స్థాయిని బట్టి ఒక్కో మండలంలో రికార్డుల నిర్వహణకై డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు వరకు ఖర్చు అవుతుందని సీసీఎల్‌ఏ అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. డిజటల్ లైబ్రరీల ఏర్పాటు నిమిత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థతో భూపరిపాలన విభాగం ఉన్నతాధికారులు సంప్రదించారు. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు ప్రక్రియపై ఈ నెల 29న అన్ని జిల్లా కలెక్టర్లతో జరగనున్న సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ అన్నారు.
మే నెల కల్లా విలేజ్ మ్యాప్‌లు సిద్ధం
రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు భూపరిపాలన విభాగం ఇటీవల ప్రవేశపెట్టిన మా భూమి వెబ్‌పోర్టల్‌కు మంచి స్పందన వస్తోందని సీసీఎల్‌ఏ అధికారులు తెలిపారు. గ్రామ పటాల(విలేజ్‌మ్యాప్)ను మాభూమి వెబ్‌పోర్టల్‌లో పొందుపరిచేందుకై డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,829 రెవెన్యూ గ్రామాలుండగా, ఇందులో ఇప్పటివరకు 10,346 గ్రామాల పటాల(మ్యాప్)ను క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధం చేశారని తెలిపారు. మే నెలాఖరు కల్లా వెబ్‌పోర్టల్‌లో గ్రామపటాలను పొందుపరుస్తామన్నారు.
వారానికి 5 రోజులు క్షేత్రాల్లోనే..
రెవెన్యూ రికార్డుల్లో భూముల వివరాల తప్పులను సరి చేసే నిమిత్తం సర్వేయర్లు వారానికి ఐదురోజులపాటు క్షేత్రస్థాయిలోనే పని చేయాలని ఆదేశాలిచ్చినట్లు రేమండ్ పీటర్ తెలిపారు. సర్వే కోసం వచ్చిన దరఖాస్తులను స్వీకరించి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని సర్వేయర్లకు సూచించామన్నారు.