National land record
-
మిగులు స్థలాలు, భవంతులపై కేంద్రం కీలక నిర్ణయం..!
న్యూఢిల్లీ: ప్రైవేటీకరిస్తున్న లేదా మూసివేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించిన మిగులు స్థలాలు, భవంతులను మానిటైజ్ చేయడానికి కొత్త కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) పేరిట ఇది స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటవుతుంది. ఇందులో పూర్తి వాటాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. నిరుపయోగంగా ఉన్న, పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించుకోలేకపోతున్న ప్రధాన వ్యాపారయేతర అసెట్స్‌ను ఉపయోగంలోకి తెచ్చి, ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది మానిటైజేషన్ స్కీము లక్ష్యం. ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఇది ఊతం అందించగలదని కేంద్రం ఆశిస్తోంది. ప్రస్తుతం స్థలం, భవనాల రూపంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) దగ్గర మిగులు, నిరుపయోగంగా ఉన్న, అంతగా ఉపయోగంలో లేని కీలకయేతర అసెట్స్ గణనీయ స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మూసివేత బాటలో ఉన్న సీపీఎస్ఈలకు సంబంధించి .. ఈ తరహా అసెట్స్ నుంచి విలువను రాబట్టడం చాలా ముఖ్యమని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు ఎన్ఎల్ఎంసీ తగు తోడ్పాటు అందిస్తుందని వివరించింది. ఎన్ఎల్ఎంసీ విధి విధానాలు.. ► ఇది ఆర్థిక శాఖ పరిధిలో ఏర్పాటవుతుంది. వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మూసివేతలో ప్రక్రియలో ఉన్న సంస్థల అసెట్స్‌ను ఎన్ఎల్ఎంసీకి బదలాయిస్తారు. కీలకయేతర మిగులు అసెట్స్‌ను గుర్తించి, వాటి నుంచి విలువను రాబట్టడంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇది సలహాలు, మద్దతు అందిస్తుంది. ► నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా ఫండ్ (ఎన్ఐఐఎఫ్), ఇన్వెస్ట్ ఇండియా తరహాలోనే ఎన్ఎల్ఎంసీ కూడా ప్రైవేట్ రంగం నుంచి నిపుణులను రిక్రూట్ చేసుకోవచ్చు. డైరెక్టర్ల బోర్డులో కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, నిపుణులు .. సభ్యులుగా ఉంటారు. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ ద్వారా చైర్మన్, ప్రభుత్వయేతర డైరెక్టర్ల నియామకం జరుగుతుంది. ► పూర్తి స్థాయి సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉంటారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మార్కెట్ నుంచి వీరిని నేరుగా నియమించుకోవచ్చు. -
మండలానికో డిజిటల్ లైబ్రరీ
♦ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు సీసీఎల్ఏ ప్రణాళిక ♦ రూ.100 కోట్లు వెచ్చించనున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయి రెవెన్యూ రికార్డులను సక్రమంగా భద్రపరచాలని రాష్ట్ర భూపరిపాలన విభాగం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ మండలంలో ఒక డిజిటల్ లైబ్రరీ(మోడరన్ రికార్డ్ రూమ్)ని ఏర్పాటు చేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సెంట్రలైజ్డ్ మోడరన్ రికార్డ్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం(ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) కింద రూ.100 కోట్లకై పైగా వెచ్చించేందుకు సర్కారు సన్నద్ధమైంది. రికార్డులన్నింటినీ హార్డ్‌కాపీ, స్కాన్ చేసి కంప్యూటర్లో సాఫ్ట్ కాపీ రూపాల్లోనూ, ప్రజలకు అవసరమైన రికార్డులను ఎవరైనా ఇంటర్నెట్ ద్వారా వీక్షించేందుకు వీలుగా ఆన్లైన్లో పెట్టనున్నారు. మీసేవ, ఈ సేవల ద్వారా ప్రజలు కోరుకునే రికార్డులను సంబంధిత అధికారి డిజిటల్ సిగ్నేచర్‌తో అందజేయనున్నారు. రికార్డులు ఎట్టి పరిస్థితుల్లోనూ టాంపరింగ్‌కు అవకాశం లేకుండా బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని అవలంబించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. మండల స్థాయిని బట్టి ఒక్కో మండలంలో రికార్డుల నిర్వహణకై డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు వరకు ఖర్చు అవుతుందని సీసీఎల్ఏ అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. డిజటల్ లైబ్రరీల ఏర్పాటు నిమిత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థతో భూపరిపాలన విభాగం ఉన్నతాధికారులు సంప్రదించారు. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు ప్రక్రియపై ఈ నెల 29న అన్ని జిల్లా కలెక్టర్లతో జరగనున్న సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీసీఎల్ఏ రేమండ్ పీటర్ అన్నారు. మే నెల కల్లా విలేజ్ మ్యాప్‌లు సిద్ధం రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు భూపరిపాలన విభాగం ఇటీవల ప్రవేశపెట్టిన మా భూమి వెబ్‌పోర్టల్‌కు మంచి స్పందన వస్తోందని సీసీఎల్ఏ అధికారులు తెలిపారు. గ్రామ పటాల(విలేజ్మ్యాప్)ను మాభూమి వెబ్‌పోర్టల్‌లో పొందుపరిచేందుకై డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,829 రెవెన్యూ గ్రామాలుండగా, ఇందులో ఇప్పటివరకు 10,346 గ్రామాల పటాల(మ్యాప్)ను క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధం చేశారని తెలిపారు. మే నెలాఖరు కల్లా వెబ్‌పోర్టల్‌లో గ్రామపటాలను పొందుపరుస్తామన్నారు. వారానికి 5 రోజులు క్షేత్రాల్లోనే.. రెవెన్యూ రికార్డుల్లో భూముల వివరాల తప్పులను సరి చేసే నిమిత్తం సర్వేయర్లు వారానికి ఐదురోజులపాటు క్షేత్రస్థాయిలోనే పని చేయాలని ఆదేశాలిచ్చినట్లు రేమండ్ పీటర్ తెలిపారు. సర్వే కోసం వచ్చిన దరఖాస్తులను స్వీకరించి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని సర్వేయర్లకు సూచించామన్నారు. -
బుల్లి పెట్టెలోకి భూ వివరాలు
ఏలూరు :జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించే నిమిత్తం సమగ్ర సర్వే చేపట్టేం దుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. జాతీయ భూమి రికార్డుల నవీ కరణ కార్యక్రమం (నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రాజెక్ట్) కింద తక్షణమే భూముల సర్వే చేపట్టి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సర్కారు ఆదేశించింది. సర్వేలో వెలుగు చూసిన భూముల వాస్తవ పరిస్థితుల వివరాలను కంప్యూటరీకరించాలని స్పష్టం చేసింది. అనంతరం వివరాలను ఆన్‌లైన్‌తో అనుసంధానించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కార్యక్రమం అంతా శాటిలైట్ సర్వేకు అనుగుణంగా సాగించాలంటూ మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం భూమి రికార్డులతో కుస్తీ పడుతోంది. రికార్డులు సిద్ధమేనా? సమగ్ర భూ సర్వేను ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో చేయాల్సి ఉంది. 1954 నుంచి 2014 వరకు అడంగల్స్ మార్పు లు, చేర్పులను సైతం నమోదు చేయా ల్సి ఉంది. అయితే, 1954 నుంచి పూర్తిస్థాయిలో రికార్డులు లభ్యమవుతాయా.. లేదా అన్న ఆందోళనలో యంత్రాంగం ఉంది. దీనికి తోడు అన్ని మండలాల్లో సర్వేయర్ల పోస్టులు భర్తీ కాలేదు. దాదాపుగా 15 మండలాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సమగ్ర సర్వేకు ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. గుబులు రేపుతున్న అసైన్డ్ భూములు కుకునూరు, వేలేరుపాడు విలీనం కాకముందు జిల్లాలో ఉన్న 46 మండలాల్లో 61వేల 456 మందికి 92వేల 356 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. జిల్లా కేంద్రమైన ఏలూరు సమీపంలోనూ ఈ తరహా భూములను పంపిణీ చేశారు. వీటిని బడా బాబులు చేపల చెరువులుగా మార్చేశారు. మరికొన్ని భూములు కబ్జా కోరల్లో ఉన్నాయి. వీటిల్లో చాలా భూములను రెవెన్యూ వర్గాల కనుసన్నల్లోనే వివిధ అవసరాలకు మార్పిడి చేసుకున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో వారి నుంచి భూముల వాస్తవ సమాచారం, భూములు లెక్కలు బహిర్గతం అవుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పరిశీలన భూముల రికార్డులను నవీకరించిన అనంతరం ఏప్రిల్ 1నుంచి క్షేత్ర స్థాయిలో భూముల ప్రత్యక్ష పరిశీలన కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే భూమి లెక్కులు ఉన్నాయా లేదా అనే అంశాలపై బృందాల వారీగా ప్రత్యక్ష పరిశీలన జరపాల్సి ఉంటుంది. భూమి రికార్డుల నవీకరణ చేస్తున్న మాట వాస్తమేనని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు తెలిపారు. భూ వివాదాలను పరిష్కరించడానికి ఈ సర్వే ఉపకరిస్తుందన్నారు. అన్ని మండలాల్లోను భూమి రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేసి గ్రామాల వారీగా వాటిని నోటీస్ బోర్డుల్లో ఉంచుతామని, వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని ఆయన చెప్పారు.