న్యూఢిల్లీ: ప్రైవేటీకరిస్తున్న లేదా మూసివేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించిన మిగులు స్థలాలు, భవంతులను మానిటైజ్ చేయడానికి కొత్త కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ) పేరిట ఇది స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)గా ఏర్పాటవుతుంది. ఇందులో పూర్తి వాటాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి.
నిరుపయోగంగా ఉన్న, పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించుకోలేకపోతున్న ప్రధాన వ్యాపారయేతర అసెట్స్‌ను ఉపయోగంలోకి తెచ్చి, ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది మానిటైజేషన్ స్కీము లక్ష్యం. ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఇది ఊతం అందించగలదని కేంద్రం ఆశిస్తోంది. ప్రస్తుతం స్థలం, భవనాల రూపంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) దగ్గర మిగులు, నిరుపయోగంగా ఉన్న, అంతగా ఉపయోగంలో లేని కీలకయేతర అసెట్స్ గణనీయ స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మూసివేత బాటలో ఉన్న సీపీఎస్‌ఈలకు సంబంధించి .. ఈ తరహా అసెట్స్ నుంచి విలువను రాబట్టడం చాలా ముఖ్యమని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు ఎన్‌ఎల్‌ఎంసీ తగు తోడ్పాటు అందిస్తుందని వివరించింది.
ఎన్‌ఎల్‌ఎంసీ విధి విధానాలు..
► ఇది ఆర్థిక శాఖ పరిధిలో ఏర్పాటవుతుంది. వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మూసివేతలో ప్రక్రియలో ఉన్న సంస్థల అసెట్స్‌ను ఎన్‌ఎల్‌ఎంసీకి బదలాయిస్తారు. కీలకయేతర మిగులు అసెట్స్‌ను గుర్తించి, వాటి నుంచి విలువను రాబట్టడంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇది సలహాలు, మద్దతు అందిస్తుంది.
► నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రా ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్), ఇన్వెస్ట్ ఇండియా తరహాలోనే ఎన్‌ఎల్‌ఎంసీ కూడా ప్రైవేట్ రంగం నుంచి నిపుణులను రిక్రూట్ చేసుకోవచ్చు. డైరెక్టర్ల బోర్డులో కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, నిపుణులు .. సభ్యులుగా ఉంటారు. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ ద్వారా చైర్మన్, ప్రభుత్వయేతర డైరెక్టర్ల నియామకం జరుగుతుంది.
► పూర్తి స్థాయి సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉంటారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మార్కెట్ నుంచి వీరిని నేరుగా నియమించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment