ఏసీసీ నికర లాభం 9% డౌన్
న్యూఢిల్లీ: సిమెంట్ దిగ్గజం ఏసీసీ జనవరి-మార్చి(క్యూ1) కాలానికి రూ. 400 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 438 కోట్లతో పోలిస్తే ఇది 9% క్షీణత. బొగ్గు, ఫ్లైయాష్, జిప్సమ్ వంటి ముడిసరుకుల వ్యయాలు పెరగడం, సిమెంట్ ధరలు తగ్గడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది.
జనవరి-డిసెంబర్ కాలాన్ని కంపెనీ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ కాలంలో సిమెంట్ విక్రయాలు 6.48 మిలియన్ టన్నులకు చేరగా, టర్నోవర్ రూ. 2,967 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలంలో రూ. 2,906 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ మూడు నెలల కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాధారణ నిర్మాణ కార్యకలాపాలు వంటివి పెద్దగా ఊపందుకోలేదని కంపెనీ వ్యాఖ్యానించింది. వెరసి సిమెంట్ విక్రయాల్లో పురోగతి సాధ్యపడలేదని తెలిపింది. సమీపకాలంలో సైతం సిమెంట్‌కు డిమాండ్ పుంజుకునే సంకేతాలు కనిపించడంలేదని అభిప్రాయపడింది.