Cement sector
-
అదానీ చేతికి హోల్సిమ్ ఇండియా
న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు, దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా సిమెంట్ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్‌కు దేశీ అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేయనుంది. ఇందుకు ప్రత్యేక ఒప్పందం కుదిరినట్లు రెండు గ్రూప్‌లు ప్రకటించాయి. వెరసి సిమెంట్ దిగ్గజాలు అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లతో కలిపి రూ. 80,000 కోట్లు(10.5 బిలియన్ డాలర్లు) వరకూ వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రూప్ వెల్లడించింది. కీలకమైన పోర్టులు, పవర్ ప్లాంట్లు, కోల్ మైన్స్ నిర్వహించే అదానీ గ్రూప్ గత కొన్నేళ్లుగా విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీవైపు దృష్టిసారించింది. ఈ బాటలో సిమెంట్ రంగంలోనూ గతేడాది ప్రవేశించింది. అదానీ సిమెంటేషన్ పేరుతో రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా అదానీ గ్రూప్ దేశీయంగా సిమెంట్ రంగంలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించనుంది. కాగా.. సిమెంట్ తయారీకి ప్రపంచ దిగ్గజంగా నిలుస్తున్న హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్నుంచి వైదొలగనున్నట్లు గత నెలలో ప్రకటించింది. తదుపరి ఆదిత్య బిర్లా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లతోపాటు.. అల్ట్రాటెక్ తదితర దిగ్గజాలతో చర్చలు నిర్వహిస్తూ వచ్చింది. డీల్ వివరాలివీ.. ► 17 ఏళ్ల క్రితం దేశీ కార్యకలాపాలు ప్రారంభించిన హోల్సిమ్ ఇండియా అంబుజా సిమెంట్స్‌లో 63.19% వాటా ఉంది. అంబుజాకు మరో లిస్టెడ్ దిగ్గజం ఏసీసీలో మెజారిటీ(50.05%) వాటా ఉంది. ఏసీసీలో హోల్సిమ్ మరో 4.48% వాటాను కలిగి ఉంది. ఈ వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ► అంబుజా సిమెంట్‌కు ఒక్కో షేరుకి రూ. 385, ఏసీసీ లిమిటెడ్‌కు రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్ చెల్లించనుంది. ► సెబీ నిబంధనల ప్రకారం రెండు సంస్థల సాధారణ వాటాదారులకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. ► అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌ల ప్రస్తుత సంయుక్త సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 70 మిలియన్ టన్నులు. ప్రత్యర్ధి సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ వార్షికంగా 119.95 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్ సామర్థ్యంతో టాప్ ర్యాంకులో నిలుస్తోంది. దిగ్గజాల తీరిదీ ► ఏసీసీ 17 తయారీ యూనిట్లు, 9 సొంత అవసరాల( క్యాప్టివ్) విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 56,000 మంది డీలర్లు, రిటైలర్లతో నెట్‌వర్క్‌ను విస్తరించింది. ► అంబుజా సిమెంట్స్ మొత్తం 31 మిలియన్ టన్నుల సామర్థ్యంగల 6 సమీకృత తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 8 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు సైతం ఏర్పాటు చేసింది. ► 2015లో ఫ్రాన్స్ దిగ్గజం లఫార్జ్తో హోల్సిమ్ విలీనమైంది. లఫార్జ్హోల్సిమ్గా ఆవిర్భవిం చింది. ఏసీసీలో హోల్సిమ్ ఇండియాకుగల 24 శాతం వాటాను అంబుజా 2016 జూన్‌లో కొనుగోలు చేసింది. దీంతో ఏసీసీలో అంబుజా వాటా 50.05 శాతానికి చేరింది. క్వింటిలియన్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా 49 శాతం వాటా కొనుగోలు డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్(క్యూబీఎంఎల్)లో 49 శాతం వాటా ను సొంతం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. ఇందుకు గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా క్యూబీఎంఎల్, క్వింటిలియన్ మీడియా లిమిటెడ్(క్యూఎంఎల్)తో వాటాదారులు, వాటా కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వాటా కొనుగోలుకి క్వింట్ డిజిటల్ మీడియా(క్యూడీఎంఎల్)తో సైతం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రాఘవ్ బల్ కంపెనీ క్యూబీఎంఎల్‌లో మైనారిటీ వాటా కొనుగోలు ద్వారా మీడియా బిజినెస్‌లోకి ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది మార్చిలోనే అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. క్యూబీఎంఎల్.. బ్లూమ్బెర్గ్క్వింట్ పేరుతో బిజినెస్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తోంది. డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ కోసమే అదానీ గ్రూప్‌తో డీల్‌ను కుదుర్చుకున్నట్లు క్యూడీఎంఎల్ తెలిపింది. కాగా, డీల్ విలువ తెలియలేదు., మార్గదర్శనం దేశీయంగా మా బిజినెస్‌లను అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. తద్వారా దేశీయంగా తదుపరి దశ వృద్ధికి గ్రూప్ నాయకత్వం వహించగలదు. – జాన్ జెనిష్, సీఈవో, హోల్సిమ్ లిమిటెడ్ వృద్ధిపై విశ్వాసం సిమెంట్ రంగంలో విస్తరించే ప్రణాళికలు దేశ వృద్ధి అవకాశాలపట్ల మాకున్న విశ్వాసానికి నిదర్శనం. ప్రపంచంలోనే భారత్ డిమాండు ఆధారిత ప్రధాన ఆర్థిక వ్యవస్థకాగా.. పలు దశాబ్దాలుగా సిమెంట్ తయారీలో రెండో ర్యాంకులో నిలుస్తోంది. – గౌతమ్ అదానీ, చైర్మన్, అదానీ గ్రూప్. -
నిర్మా గ్రూప్ నువోకో ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: నిర్మా గ్రూప్‌నకు చెందిన సిమెంట్ రంగ కంపెనీ నువోకో విస్టాస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 9న ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 560–570గా కంపెనీ ప్రకటించింది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్ సంస్థ నియోగీ ఎంటర్ప్రైజెస్ రూ. 3,500 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. అంతేకాకుండా మరో రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో కంపెనీ ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 26 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. నువోకో విస్టాస్ ఐదు సమీకృత, ఐదు గ్రైండింగ్, ఒక బ్లెండింగ్ యూనిట్‌తోపాటు 11 సిమెంట్ ప్లాంట్లను కలిగి ఉంది. ప్రస్తుతం వార్షికంగా 22.32 ఎంఎంటీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, హర్యానాలలో సిమెంట్ తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. గతంలో లఫార్జ్ ఇండియాగా కార్యకలాపాలు సాగించిన కంపెనీ 2020 ఫిబ్రవరిలో ఇమామీ గ్రూప్ సిమెంట్ బిజినెస్‌ను కొనుగోలు చేసింది. -
సిమెంటు కంపెనీల పల్లెబాట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 దేశవ్యాప్తంగా అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. ఇందులో సిమెంటు రంగం కూడా ఒకటి. కార్మికులు లేక నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో సిమెంటుకు డిమాండ్ లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతుండడం కంపెనీలకు కాస్త ఊరటనిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు రవాణా ఆగిపోవడంతో ఇప్పుడు కంపెనీలు గ్రామాలపై దృష్టిపెట్టాయి. అయితే కార్మికులు తిరిగి వస్తేనే నిర్మాణ రంగం గాడిన పడుతుందన్నది కంపెనీల మాట. జనవరి–మార్చి నాటికి మార్కెట్ సాధారణ స్థితికి వస్తుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది. గ్రామీణ ప్రాంతాలే ఆధారం... ప్రస్తుతం జరుగుతున్న సిమెంటు వినియోగంలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల నుంచే జరుగుతోందని భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పట్టణాల్లో నిర్మాణాలు చాలా మందకొడిగా సాగుతున్నాయని చెప్పారు. ఊహించినదానికంటే అధికంగా పట్టణేతర ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు. నిర్మాణ రంగంలో ఇప్పుడు 30% మాత్రమే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కార్మికులు తిరిగి వస్తేనే సిమెంటుకు మంచి రోజులని వ్యాఖ్యానించారు. ప్లాంట్లలో తయారీ 25–30 శాతానికి పడిపోయిందన్నారు. ఇది జూలై–సెప్టెంబరులో 40–50%కి చేరుతుందన్న విశ్వాసం ఉందని చెప్పారు. కార్మికుల ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక రంగ ప్రాజెక్టులపై పెట్టుబడులు చేస్తుందని తాము భావిస్తున్నామని సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి–మార్చికల్లా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. పదేళ్లుగా ధర అక్కడే..: తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా సిమెంటు బస్తా ధర రూ.350 చుట్టూ తిరుగుతోందని రవీందర్ రెడ్డి అన్నారు. ‘ద్రవ్యోల్బణం ప్రకారం చూసుకున్నా ఆ స్థాయిలో ధర పెరగలేదు. ప్లాంట్లలో ఉత్పత్తి 60–65 శాతమైతే బస్తా ధర రూ.350 ఉన్నా సరిపోతుంది. తయారీ 10% తగ్గితే బస్తాపైన వ్యయం రూ.25–30 అధికం అవుతుంది. ఇప్పుడు ప్లాంట్ల సామర్థ్యం 25–30%కి పరిమితమైంది. ఉత్పత్తి లేకున్నా సిబ్బంది వేతనాలు పూర్తిగా చెల్లించాం. ఇవన్నీ కంపెనీలకు భారమే. గతేడాది సగటుతో పోలిస్తే ధర 1% మాత్రమే పెరిగింది. జీఎస్టీ 28 శాతం ఉంది. దీనిని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం’ అని వివరించారు. ఇక రవాణా సమస్యలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు సరఫరాపై కంపెనీలు దృష్టిపెట్టాయి. కరోనా నియంత్రణలోకి వస్తేనే రవాణా సమస్యల నుంచి గట్టెక్కుతామనేది కంపెనీల మాట. సిమెంటు అమ్మకాలు ఇలా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జనవరిలో 23 లక్షల టన్నులు, ఫిబ్రవరిలో 17, మార్చిలో 14 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. కోవిడ్–లాక్డౌన్ ప్రభావంతో ఏప్రిల్‌లో ఇది 3.65 లక్షల టన్నులకు దిగొచ్చింది. అమ్మకాల పరంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఇదే తక్కువ పరిమాణం. మే నెలలో ఇరు రాష్ట్రాలు చెరి 7 లక్షల టన్నుల విక్రయాలు సాధించాయి. ఇందులో ఒక లక్ష టన్నుల మేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్డర్లే ఉంటాయి. ఇక 2019 మే నెలలో 22 లక్షల టన్నులు కాగా, అదే ఏడాది జనవరిలో అత్యధికంగా 31 లక్షల టన్నుల సిమెంటు విక్రయాలు నమోదయ్యాయి. గత నెలతో పోలిస్తే జూన్ అమ్మకాల్లో 10 శాతం వృద్ధి ఉంటుందని పరిశ్రమ భావిస్తోంది. -
హైదరాబాద్‌లో బస్సు తయారీ ప్లాంట్
♦ రూ.250 కోట్లతో ఆరంభించనున్న డెక్కన్ ఆటో ♦ ఏటా 3,000 బస్‌ల తయారీ సామర్థ్యం ♦ రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ♦ కంపెనీ చైర్మన్ ఎంఎస్ఆర్వీ ప్రసాద్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆటోమొబైల్ రంగంలో ఉన్న డెక్కన్ ఆటో హైదరాబాద్ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో బస్‌ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. ఏటా 3,000 బస్‌ల తయారీ సామర్థ్యంతో రూ.250 కోట్లతో మెదక్ జిల్లా పటాన్చెరు దగ్గర ఇది ఏర్పాటయింది. ఏఆర్ఏఐ ధ్రువీకరణ ఉన్న ఈ ప్లాంటు వార్షిక సామర్థ్యం... వచ్చే ఆరేళ్లలో 6,000 యూనిట్లకు పెంచుతారు. 8 నుంచి 18 మీటర్ల పొడవున్న బస్‌లను ఈ ప్లాంటులో రూపొందిస్తారు. ఈ బస్సుల్ని ఆఫ్రికా, ఆసియా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని డెక్కన్ ఆటో చైర్మన్ ఎం.శివరామ వరప్రసాద్ తెలిపారు. చైనా ప్రభుత్వ కంపెనీ అయిన జోంగ్టాంగ్ సాంకేతిక సహకారంతో లగ్జరీ కోచ్‌లను తయారు చేస్తామన్నారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు చేతుల మీదుగా శనివారం ప్లాంటును ప్రారంభిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలియజేశారు. కరోనా బస్‌లు సైతం...డెక్కన్ ఆటో ఈ ప్లాంటు ద్వారా బస్‌ల తయారీలోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే గ్రూప్ కంపెనీ అయిన కరోనా బస్ మాన్యుఫ్యాక్చరర్స్ ఈ విభాగంలో సేవలందిస్తోంది. కొత్త ప్లాంటులో కరోనా, డెక్కన్ బ్రాండ్ల బస్‌లను తయారు చేస్తామని కరోనా డెరైక్టర్ ఎం.బాలాజీ రావు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు.. డెక్కన్ బ్రాండ్ బస్ రూ.1 కోటి వరకు, కరోనా బస్ రూ.70 లక్షల వరకు ధర ఉంది. సిమెంటు రంగంలోనూ... శివరామ వరప్రసాద్‌కు కరోనాలో 51 శాతం, డెక్కన్ ఆటోలో 70 శాతంపైగా వాటా ఉంది. ఈయన ప్రమోటర్‌గా ఉన్న గ్రూప్ కంపెనీకి ఆఫ్రికాలో డైమండ్ బ్రాండ్‌తో 15 సిమెంటు ప్లాంట్లు ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో అత్యధిక వాటా ఈ బ్రాండ్‌దే. స్టీల్ ప్లాంటులతో పాటు టోగో దేశంలో రైల్వేలను నిర్వహిస్తోంది. ఆఫ్రికాలోనే 2,000 ఎకరాల్లో ఉప్పు పండిస్తోంది. హైదరాబాద్‌లో తొలి స్టూడియో అయిన సారధి స్టూడియోస్ కూడా ఈ గ్రూప్‌నకు చెందినదే. ఒరిస్సాలో తోషాలి బ్రాండ్‌తో సిమెంటు ప్లాంటు ఉంది. వైజాగ్ వద్ద వోల్టా ఫ్యాషన్స్ పేరుతో గార్మెంట్స్ తయారీ యూనిట్ ఉంది. పెపే జీన్స్, ఓనీల్, కిలివాచ్, ఏసాస్, సియా హెరింగ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు దుస్తులను సరఫరా చేస్తోం ది. గ్రూప్ టర్నోవర్ రూ.10,700 కోట్లపైమాటే.