'సెన్సార్ వివాదంతో సంబంధం లేదు'
న్యూఢిల్లీ: 'ఉడ్తా పంజాబ్' సినిమా సెన్సార్ వివాదంతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా సెన్సార్ బోర్డు వ్యవహరించిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. 'ఉడ్తా పంజాబ్' సినిమా విడుదల కాకుండా బీజేపీ అడ్డుకుంటుందన్న ఆప్ ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు.
వివాదాలతోనే ఆప్ మనుగడ సాగిస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. 'ఉడ్తా పంజాబ్' సినిమాలో చూపించినట్టుగా పంజాబ్ లో మాదకద్రవ్యాల సమస్యలేదని అన్నారు. సినిమాలో కొన్ని సీన్లు కట్ చేయమని సెన్సార్ బోర్డు చెప్పిందని, నియమనిబంధనలకు అనుగుణంగానే అది వ్యవహరించిందని తెలిపారు. సెన్సార్ బోర్డు మార్గదర్శకాలు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉందన్నారు.