హుద్‌హుద్ తుపాన్ నష్టాలు పరిశీలన
ఎచ్చెర్ల రూరల్ : గత నెల 12 వ తేదీన సంభవించిన హుద్‌హుద్ తుపాన్ నష్టాలను అంచనాలు వేయడానికి ఎం. రమేష్‌కుమార్, రజీబ్‌కుమార్‌సేన్, పీఎస్ చక్రవర్తి, కె.రామ్‌వర్మలతో కూడిన కేంద్ర బృంద గురువారం జిల్లాలో పర్యటించింది. రణస్థలం మండలంలోని పర్యటించారు. అనంతరం వారు ఎచ్చెర్ల టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో తుపాన్‌కు జిల్లాలో శాఖల వారీగా నష్టాల వివరాలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృందానికి వివరించారు. జిల్లాలో మొత్తంగా రూ. 1,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో హుద్‌హుద్ తుపాన్ ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన రైతులు, మత్స్యకారులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీ, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కేంద్ర బృందానికి వినతిపత్రం అందజేశారు. బోట్లు, వలలకు ప్రభుత్వం రూ.5 వేలు ప్రకటించిందన్నారు. మత్స్యకారులకు రూ. 25 వేలు సాయం అందించాలని వారు కోరారు.
తమ్మినాయుడుపేట గ్రామానికి చేరుకున్న బృంద సభ్యులు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. స్థానికులు పలు సమస్యలపై వినతులు అందించారు. మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ సాంప్రదాయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూరాడ రాజారావు, ప్రతినిధులు ధనరాజ్, గణపతి బృందానికి వినతిపత్రం అందజేశారు. ఏజేసీ రజనీకాంతరావు, డుమాపీడీ కళ్యాణచక్రవర్తి, వివిదశాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బృందం సాయం అందించేందుకు సానుకూలంగా స్పందించారని కలెక్టర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇక్కడ పర్యటన అనంతరం విశాఖలో సమావేశం నిర్వహించనున్నారన్నారు. ఆ సమావేశంలో జిల్లా మంత్రి కూడా హజరవ్వనున్నారని తెలిపారు.