దేశాభివృద్ధిలో స్టాటిస్టిక్స్ పాత్ర కీలకం
సెంట్రల్ యూనివర్సిటీ: దేశాభివృద్ధిలో గ ణాంకాల (స్టాటిస్టిక్స్) పాత్ర కీలకమని ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీలోని సీఆర్. రావు స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఆదివారం 8వ స్టాటిస్టిక్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా సి.రంగరాజన్ మాట్లాడుతూ సాంకేతిక శాస్త్రాన్ని, ఆధునిక టెక్నాలజీలో విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు.
దేశానికి సాంకేతిక శాస్త్రవేత్తల అవసరం ఉందన్నారు. స్టాటిస్టిక్స్‌కు భారత్ మూలమని, సిఆర్. రావు లాంటి వ్యక్తులు ఈ రంగంలో ఖ్యాతి గడించారని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జగన్నాథరావు మాట్లాడుతూ న్యాయ సమస్యలను పరిష్కరించడంలో గణాంకాలు కీలకంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
దేశంలోని పలు పెండింగ్ వివాదాలను గణాంకాల ఆధారంగా పరిష్కరించిన ఘటనలను గుర్తుచేశారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాభివృద్ధి జరగాలని సూచించారు. అప్పుడే దేశాభివృద్ది సాధ్యమన్నారు. స్టాటిస్టికల్ ఒలింపియాడ్‌లో విజేతలైన పలు పాఠశాలల విద్యార్థులకు రంగరాజన్ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ అరుణాచలం, హెచ్‌సీయూ వైస్‌ఛాన్సలర్ హరిబాబు, సీఆర్ రావు ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ అల్లం అప్పారావు, ప్రొఫెసర్ యుగేందర్, ఎస్‌బీరావు, తదితరులు పాల్గొన్నారు.