ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే దాడులు
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే ఏబీవీపీ నేతలు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో దాడులకు పాల్పడుతున్నారని సామాజిక న్యాయపోరాట ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 16న అమోల్ సింగ్ అనే పరిశోధక విద్యార్థిపై ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ దాడి చేయడం దారుణమన్నారు. రోహిత్ వేముల ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులపై పదే పదే దాడులు చేస్తూ క్యాంపస్‌లో ప్రజాస్వామ్య వాతావరణాన్ని హరిస్తున్నారన్నారు.
రోహిత్ ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితులైన వీసీ అప్పారావు, ఏబీవీపీ నేత సుశీల్ కుమార్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న రాత్రి షాప్‌కామ్ వద్ద కశ్మీర్ పరిణామాలపై చర్చిస్తుండగా బైక్‌లపై ర్యాలీగా వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు ప్జాబ్కు చెందిన అమోల్ సింగ్ అనే విద్యార్థిపై దాడిచేసి కొట్టారని వారు ఆరోపించారు. బాధితుడిని సహ విద్యార్థులు చందానగర్‌లోని ప్రణమ్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ సుశీల్ కుమార్ సోదరుడు విష్ణు మరోసారి చేయిచేసుకోవడమేగాక చంపుతామని బెదిరించినట్లు తెలిపారు.
విద్యార్థులపై దాడులు జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయకుండా, రోహిత్ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీసీ తోడ్పాటుతోనే ఏబీవీపీ కార్యకర్తలు పెట్రేగిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.