అనంతపురం : సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు కోసం అనంతపురం జిల్లాలోని కనగానపల్లి మండలం దాదులూరు సమీపంలో స్థలాలను అధికారులు పరిశీలించారు. ముగ్గురు అధికారులతో కూడిన కేంద్ర బృందం మంగళవారం ఉదయం పర్యటించారు. ఇక్కడ జాతీయ రహదారి పక్కన మొత్తం 720 ఎకరాలకు పైగా (589 ఎకరాలు ప్రభుత్వ, 130 ఎకరాలు పట్టాభూములు) అందుబాటులో ఉన్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్, రెవెన్యూ అధికారులు కేంద్ర బృందానికి నివేదించారు.
అనంతరం కేంద్ర బృందం పెనుగొండకు బయల్దేరి వెళ్లింది. ఈ బృందం వెంట రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా ఉన్నారు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు ఇప్పటికే జిల్లాలోని బుక్కరాయసముద్రం వద్ద స్థలాలను కేంద్ర బృందం పరిశీలించింది. అలాగే, పెనుగొండ, పుట్టపర్తి వద్ద భూములను కూడా పరిశీలించిన అనంతరం అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసి కేంద్రానికి నివేదిక అందించనున్నట్టు తెలుస్తోంది.
(కనగానపల్లి)