CEO David Richardson
-
నియమావళిని సవరిస్తాం
న్యూఢిల్లీ: ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలో సవరణలు చేపడతామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్ వెల్లడించారు. బాల్ ట్యాంపరింగ్, శ్రుతిమించిన స్లెడ్జింగ్‌లాంటి వ్యవహారాలను సీరియస్‌గా తీసుకుంటామని, కఠిన చర్యలకు ఊతమిచ్చేలా నియమావళిని మారుస్తామని ఆయన చెప్పారు. ‘త్వరలోనే మార్పులకు శ్రీకారం చుడతాం. నియమావళికి చెప్పుకోదగ్గ సవరణలు తీసుకొస్తాం. దీని వల్ల జరిగిన తప్పిదాలకు తగిన శిక్షలు వేసే ఆస్కారం ఉంటుంది. దీంతో తీవ్రమైన తప్పులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’ అని అన్నారు. ఫుట్‌బాల్‌లో ఉన్నట్లు ఎల్లో, రెడ్ కార్డులను క్రికెట్లోనూ ప్రవేశపెడితే వచ్చే ప్రయోజనమేమీ తనకు కనబడటం లేదన్నారు. ‘ఇదివరకే దీనిపై ఐసీసీ చర్చించింది కూడా! మళ్లీ మరోసారి చర్చించాల్సిన అవసరముంది. అయితే ఈ కార్డులతో పరిస్థితిలో మార్పుంటుందని నేననుకోవడం లేదు’ అని రిచర్డ్సన్ తెలిపారు. -
చాంపియన్స్ ట్రోఫీ ఇక అనుమానమే!
నాలుగేళ్ల వ్యవధిలో రెండు టి20 ప్రపంచకప్‌లు లండన్: ఇటీవల ముగిసిన చాంపియన్స్ ట్రోఫీనే ఇక ఆఖరిది కానుందా..? షెడ్యూల్ ప్రకారం 2021లో భారత్‌లో జరగాల్సిన ట్రోఫీ ఇక ఉండదా? ఐసీసీ ఆలోచనలు చూస్తుంటే ఇదంతా వాస్తవంగానే కనిపిస్తోంది. నాలుగేళ్లకోసారి అభిమానులను అలరిస్తున్న చాంపియన్స్ ట్రోఫీకి శాశ్వతంగా గుడ్‌బై పలకాలని ఐసీసీ యోచిస్తోంది. టి20 ఫార్మాట్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని నాలుగేళ్ల వ్యవధిలో రెండు టి20 ప్రపంచకప్‌లను జరపాలని భావిస్తున్నట్టు ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్సన్ తెలిపారు. అయితే ఇప్పటికీ చాంపియన్స్ ట్రోఫీకి అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ ఉండటం ఆసక్తికరం. తాజా టోర్నమెంట్‌ను కూడా విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో తిలకించారు. ఇదంతా ఎలా ఉన్నా వచ్చే ట్రోఫీ జరిగేది మాత్రం గ్యారంటీ లేదని, ఈ అంశంపై ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చిస్తామని రిచర్డ్సన్ తెలిపారు. ‘ప్రస్తుతానికైతే షెడ్యూల్ ప్రకారం తర్వాతి చాంపియన్స్ ట్రోఫీ 2021లో భారత్‌లో జరుగుతుంది. మార్పులు జరిగితే మాత్రం ఈ మధ్య కాలంలో రెండు టి20 ప్రపంచకప్‌లు జరిగే అవకాశం ఉంది. 50 ఓవర్లలో రెండు ప్రపంచకప్‌లు జరపడం అవసరం లేదనిపిస్తోంది. వాస్తవంగా పొట్టి ఫార్మాట్లో జరిగే ప్రపంచకప్ అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తోంది. టీవీ కంపెనీలకు కూడా అధిక ఆదాయాన్ని అందిస్తోంది. అలాగే భవిష్యత్‌లో 16 లేదా 20 జట్లను ఆడించాలనే ఆలోచన కూడా ఉంది’ అని డేవిడ్ రిచర్డ్సన్ వివరించారు.