cess tax
-
Budget 2023: సెస్సులు, సర్‌చార్జీలు ఎత్తివేయాలి
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు అదనపు భారంగా ఉంటున్న సెస్సు, సర్‌చార్జీలను ఎత్తివేయాలని, ట్యాక్స్ పరిధిలోకి మరింత మందిని చేర్చాలని బడ్జెట్‌కు సంబంధించి థింక్ చేంజ్ ఫోరం (టీసీఎఫ్) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. అలాగే, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రంగాలకు పన్నుల భారాన్ని తగ్గించాలని, ట్యాక్స్‌పేయర్లు నిబంధనలను పాటించేలా పర్యవేక్షణను మరింత మెరుగుపర్చాలని పేర్కొంది. ఆర్థిక వృద్ధి సాధనకు, అభివృద్ధి పనులపై ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం పన్ను ఆదాయాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని టీసీఎఫ్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. అధిక పన్నుల భారం, సంక్లిష్టమైన ట్యాక్స్ విధానాలు మొదలైనవి వివాదాలకు దారి తీస్తున్నాయని, నిబంధనల అమలు సరిగ్గా లేకపోవడం వల్ల వసూళ్లపై ప్రభావం పడుతోందని వారు తెలిపారు. అక్రమ వ్యాపారాలను అరికట్టడానికి ప్రభుత్వ ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా పన్ను ఎగవేతదారులు మరింత వినూత్న వ్యూహాలతో స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు మాజీ చైర్మన్ పీసీ ఝా చెప్పారు. అత్యధిక నియంత్రణలు, పన్నులు ఉండే పరిశ్రమలైన పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాలిక్ పానీయాల రంగాల నుంచి ఖజానాకు రావాల్సిన రూ. 28,500 కోట్ల మేర ఆదాయానికి గండి పడుతోందని పేర్కొన్నారు. ఇలాంటివి అరికట్టేందుకు మరింత అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలని, పోర్టుల్లో మరిన్ని స్కానర్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. -
మార్కెట్ కమిటీలకు లక్ష్మీకళ
కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా మార్కెట్ కమిటీలు సెస్సు వసూళ్లతో కళకళ లాడుతున్నాయి. ఈ ఏడాది రూ. 11.72 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా అక్టోబర్ చివరి నాటికి రూ. 601.52 లక్షలు వసులయ్యాయి. గతేడాది ఇదే అక్టోబర్ చివరి నాటికి రూ. 496.95 లక్షలు వసూలయ్యాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం రూ. 104.57 లక్షలు అధికంగా సెస్సు వసూలు కావడం గమనార్హం. జిల్లాలో పది మార్కెట్ కమిటీలు ఉన్నాయి. జమ్మలమడుగు, కమలాపురం మార్కెట్ కమిటిలీలు తప్ప మిగిలినవి గతేడాది కంటే ఈ సంవత్సరం అక్టోబర్ చివరినాటికి లక్ష్యానికంటే అధికంగా సెస్స్ వసూలు చేశాయి. కడప మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 200 లక్షలకుగాను గతేడాది అక్టోబర్ చివరి నాటికి రూ.91.99 లక్షలు వసులు చేయగా ఈ సంవత్సరం రూ.98.45 లక్షలు వసూలు చేసింది పొద్దుటూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 205 లక్షలుకాగా గతేడాది అక్టోబర్ చివరి నాటికి రూ.73.83 లక్షలు, ఈ ఏడాది రూ. 79.92 లక్షలు వసులయ్యాయి. బద్వేల్ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 145 లక్షలు కాగా గతేడాది అక్టోబర్ చివరినాటికి రూ. 78.49లక్షలు, ఈ ఏడాది రూ. 113.09 లక్షలు, పులివెందుల మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 92 లక్షలు కాగా గతేడాది అక్టోబర్ చివరినాటికి రూ.39.42 లక్షలు, ఈ ఏడాది రూ. 47.80 లక్షలు, మైదుకూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 165 లక్షలు కాగా గతేడాది అక్టోబర్ చివరినాటికి రూ. 85.98 లక్షలు, ఈ ఏడాది రూ.119.67 లక్షలు, సిద్దవటం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 30 లక్షలు కాగా గతేడాది అక్టోబర్ చివరినాటికి రూ. 10.09 లక్షలు, ఈ ఏడాది రూ.10.66 లక్షలు, ఎర్రగుంట్ల మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 70 లక్షలుకాగా ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి రూ. 27.30 లక్షలు, ఈ ఏడాది రూ. 31.91 లక్షలు, నూతనంగా ఏర్పాటు చేసిన సింహాద్రిపురం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 30 లక్షలు కాగా ఇప్పటి వరకు రూ. 17.18 లక్షలు వసూలు చేసింది. జిల్లాలో మార్కెట్ కమిటీ వివరాలు.... జిల్లాలో కడప, పొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల,మైదుకూరు, కమలాపురం, ఎల్‌ఆర్‌పల్లె, సిద్దవటం, ఎర్రగుంట్లలో మార్కెటింగ్ కమిటిలు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్ కమిటీలో పసుపు, వేరుశనగకు సంబంధించిన క్రయవిక్రయాలు జరగ్గా మిగతా మార్కెట్ కమిటీల్లో పండ్లు, ఇతర ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతాయి. జిల్లాలో పది మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 21 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్ కమిటీలో పసుపు, వేరుశనగ వంటివి క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. జిల్లాలో కడప మార్కెట్ కమిటీ నుంచే ఎక్కువగా చెస్ వసూలు అవుతుంది. మిగతా 9 మార్కెట్ కమిటీల్లో పలు రకాల ఉత్పత్తుల విక్రయాలు జరుగుతుంటాయి. పులివెందుల మార్కెట్ కమిటీ నుంచి బత్తాయి, అరటి, నిమ్మ వంటివి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి.వీటి పరిధిలో ఎక్కువ మంది ట్రేడర్లు ముందు సెస్సు చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. మరి కొంతమంది చిన్న స్థాయి వ్యాపారులు చెక్ పోస్టుల వద్ద చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఈ ఉత్పత్తుల ధరతో ఒక శాతం సెస్సుగా వసూలు చేసేవారు. ఈ ఏడాది ధాన్యంపై సెస్సును 2 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు జిల్లాలో 2022–23 ఏడాదికి 10 మార్కెట్ కమిటీల పరిధిలో 21 చెక్ పోస్టులు ఉన్నాయి. అయా చెక్ పోస్టుల ద్వారా వార్షికాదాయం ఏడాదికి రూ. 11.72 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెస్సు వసూలు అశాజనకంగా ఉంది. ఇచ్చిన టార్గెట్‌లో ఇప్పటి వరకు రూ. 601.52 లక్షలు వసూలు చేసి 51.38 శాతం సాధించాం. మార్చి చివరి నాటికి లక్ష్యాన్ని అధిగమిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –హిమశైల, మార్కెటింగ్‌శాఖ ఏడీ, వైస్సార్‌జిల్లా -
డీజిల్ ధరల పెరుగుదల కొండంత.. సెస్ పెంపు గోరంతే
సాక్షి, అమరావతి: అర్ధసత్యాలు, అవాస్తవాలతో ఈనాడు, ఎల్లో మీడియా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కింది. ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపును వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడింది. రోజుకోరీతిలో వైఎస్సార్సీపీ సర్కారుపై దుష్ప్రచారమే అజెండాగా వ్యవహరిస్తున్న ఈనాడు పత్రిక ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు విషయంలోనూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. చంద్రబాబు హయాం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే ఆర్టీసీ చార్జీలు పెరిగాయని చెప్పుకొచ్చిన ఈనాడు పత్రిక ఆ కథనంలో ఎక్కడా కూడా దేశంలో డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయని ఒక్క వాక్యం కూడా రాయలేదు. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో డీజిల్ ధర ఎంత.. ప్రస్తుతం రెండేళ్లుగా పెరిగిన డీజిల్ ధరలు ఎంత అన్న లెక్కలు కూడా దాచిపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో పొరుగునున్న తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు విధిలేని పరిస్థితుల్లో డీజిల్ సెస్ విధించాయి. తెలంగాణ కంటే ఏపీఎస్ ఆర్టీసీ తక్కువగానే విధించింది. ఈ వాస్తవాలను ప్రస్తావించకుండా చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా తప్పుడు కథనాన్ని ప్రచురించడం ఎల్లో మీడియా కుతంత్రాన్ని మరోసారి బయటపెట్టింది. డీజిల్ ధర పెరుగుదల 104 శాతం.. సెస్ విధింపు 45 శాతం ఇక డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నా సరే వీలైనంత వరకు ప్రయాణికులపై తక్కువ భారం పడేలా ఆర్టీసీ విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మూడేళ్లలో డీజిల్ ధరలు ఏకంగా 104 శాతం పెరిగాయి. కానీ, ఆర్టీసీ మూడు విడతల్లో కలిపి కేవలం 45 శాతమే డీజిల్ సెస్ విధించింది. ఈ మూడేళ్లలో డీజిల్ ధరల పెరుగుదలను ప్రధానంగా మూడు భాగాలుగా పరిగణిస్తే.. డీజిల్ ధరలు పెరిగిన నిష్పత్తిలో ఆర్టీసీ డీజిల్ సెస్‌ను పెంచలేదు. పెరుగుతున్న ధరల్లో రెండొంతుల భారాన్ని ఆర్టీసీనే భరిస్తోంది. ఆర్టీసీ డీజిల్ సెస్ పెంచిన మూడు సందర్భాల్లోనూ ఇలానే వ్యవహరించింది. అందుకు నిదర్శనం ఈ గణాంకాలే.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు టీడీపీ హయాంలో కంటే ఇప్పుడే ఆర్టీసీ చార్జీలు పెరిగాయని చెబుతున్న ఎల్లో మీడియా.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెరిగిన తీరు.. ఇప్పుడు పెరిగిన తీరును వివరించలేదు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా పెరిగాయన్న వాస్తవాన్ని అంగీకరించాల్సి వస్తుంది కాబట్టి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మార్కెట్ ధరలను బట్టి ఆర్టీసీ లీటరు డీజిల్‌ను రూ.48.46 చొప్పున కొనుగోలు చేస్తే.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.99.06, బల్క్ డీజిల్ అయితే లీటరుకు రూ.134.79 ఉంది. దాంతో ఎప్పుడూ కొనుగోలు చేసే బల్క్ డీజిల్ కాకుండా ఆర్టీసీ ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో డీజిల్ కొనుగోలు చేస్తోంది. అంత హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నా ఆర్టీసీపై రోజుకు అదనంగా రూ.2.50 కోట్ల ఆర్థికభారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల, కరోనా పరిస్థితులు, రష్యా–ఉక్రేయిన్ యుద్ధ పరిణామాలతో దేశంలో డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాగే, చంద్రబాబు అధికారంలో ఉన్న 2015లో కంటే ఇప్పటికి బహిరంగ మార్కెట్లో డీజిల్ ధర వంద శాతం పెరగగా.. ఆర్టీసీ సాధారణంగా కొనుగోలు చేసే బల్క్ డీజిల్ ధర దాదాపు 150 శాతం పెరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రయాణికులపై నామమాత్రపు భారమే... మరోవైపు.. డీజిల్ సెస్ పెంపుతో ప్రయాణికులపై ఏడాదికి రూ.2వేల కోట్ల అదనపు భారం పడుతుందన్న ఈనాడు పత్రిక వాదన పూర్తిగా అవాస్తవం. గతంలో రెండుసార్లు డీజిల్ ధరలు అమాంతంగా పెరిగినప్పుడు ఆర్టీసీ అనివార్యంగా పెంచిన డీజిల్ సెస్‌తో ఆదాయం నామమాత్రంగానే పెరిగింది. 2019 డిసెంబరులో చార్జీల పెంపుతో ఏడాదికి రూ.844 కోట్ల రాబడి వస్తుందని ఆర్టీసీ అంచనా వేసింది. కానీ, కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ సర్వీసులను సరిగా నిర్వహించలేకపోయింది. ఇక ఏప్రిల్ 2022లో డీజిల్ సెస్ పెంపుతో ఏడాదికి రూ.712 కోట్ల రాబడి వస్తుందని.. రోజుకు రూ.2కోట్ల వరకు రాబడి వస్తుందని భావించారు. కానీ, రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయమే వస్తోంది. ఇక తాజాగా నామమాత్రంగా పెంచిన డీజిల్ సెస్‌తో కూడా ఆర్టీసీకి అదే రీతిలో నామమాత్రంగానే రాబడి పెరుగుతుందన్నది తెలుస్తూనే ఉంది. అంటే ప్రయాణికులపై పెద్దగా భారం పడబోదన్నది స్పష్టమవుతోంది. తెలంగాణ కంటే తక్కువగా సెస్ ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే ఏపీఎస్ఆర్టీసీ డీజిల్ సెస్ తక్కువగానే విధిస్తోంది. తద్వారా ప్రయాణికులపై ఎక్కువ భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపులో ఉన్న వ్యత్యాసమే ఇందుకు నిదర్శనం. ఆ వివరాలు ఇవిగో.. -
ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.. టికెట్‌పై సెస్
సాక్షి, హైదరాబాద్: బెంబేలెత్తిస్తున్న డీజిల్ ధరలు, కోవిడ్‌తో పెరిగిపోయిన నష్టాలు.. వెరసి బస్సు టికెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని వీలైనంత మేర పెంచుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవలే సేఫ్టీ సెస్ పేరుతో టికెట్‌పై రూపాయి చొప్పున భారం వేసింది. ఆ రూపంలో చిల్లర సమస్య రాకుండా రౌండ్ ఆఫ్ చేయడంతో టికెట్ గరిష్ట ధరలో రూ.5వరకు పెరిగింది. ఇప్పుడు ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సెస్ పేరుతో మరో రుసుమును టికెట్ ఛార్జీలో కలపాలని నిర్ణయించింది. దీంతోపాటు, నాలుగు నెలల క్రితం ఓ ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు, రూ.10 గుణిజానికి రౌండ్ ఆఫ్ చేసిన ధరలను సవరించి తగ్గించింది. ఈ మొత్తాన్నీ తిరిగి రౌండ్ ఆఫ్‌తో పెంచాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో సాలీనా రూ.50కోట్ల నుంచి రూ.60కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. అప్పుడు కోల్పోయిన ఆదాయం రూ.75 కోట్లు దాదాపు నాలుగు నెలల క్రితం ఆర్టీసీ టికెట్‌పై ఉన్న ఛార్జీల్లో నెలకొన్న గందరగోళంపై ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. తాను తీసుకున్న టికెట్‌పై.. టికెట్ ఫేర్ రూ.91గా, టోటల్ అమౌంట్ రూ.100గా ఉం డటాన్ని ట్విటర్ ద్వారా ప్రశ్నించాడు. చిల్లర సమ స్య రాకుండా, టికెట్ ధరలను అప్పట్లో తదుపరి రూ.10 గుణిజానికి రౌండ్ ఆఫ్ చేయటంతో ఈ వివాదం తలెత్తింది. టికెట్ ఆసలు ధర రూ.91 కాగా దాన్ని రౌండ్ ఆఫ్ చేయటంతో రూ.100గా మారింది. దీంతో ఆప్పట్లో ఆర్టీసీ.. ఆ మొత్తాన్ని రూ.100కు బదులు రూ.90కి రౌండ్ ఆఫ్ చేసింది. ఇలా అన్ని టికెట్ల ధరలను సవరించటంతో సాలీనా రూ.75 కోట్ల మేర ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు ఏకంగా రూ.2వేల కోట్లను దాటాయి. డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో పునరాలోచనలో పడ్డ ఆర్టీసీ.. ఆ ధరలను మళ్లీ రౌండ్ ఆఫ్‌తో సవరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. పల్లెవెలుగులో కొద్ది రోజుల క్రితమే రౌండ్ ఆఫ్ చేయగా, తాజాగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్లలో టికెట్ ధరలో చిల్లర సమస్య రాకుండా తదుపరి రూ.5కు, సూపర్ లగ్జరీ నుంచి ఆపై కేటగిరీ బస్సుల్లో తదుపరి రూ.10కి మారుస్తారు. ఉదా.. టికెట్ వాస్తవ ధర రూ.91 ఉంటే, అది ఎక్స్‌ప్రెస్, డీలక్స్లలో రూ.95 గా, సూపర్ లగ్జరీ, ఆ పై కేటగిరీల్లో రూ.100గా మారుతుందన్నమాట.(గతంలో ఇది అన్ని కేటగిరీల్లో రూ.100గా ఉండేది) దీంతో సాలీనా రూ.50 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని అంచనా. ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సెస్ అంటే.. బస్సు ఎక్కడుందో ట్రాక్ చేయటం, దానికి సంబంధించిన సమాచారం అందించటం, దీనికోసం యాప్ రూపొందించి ఇన్ఫరేషన్‌ను ప్రయాణికులకు అందిస్తున్నందుకు గాను టికెట్‌పై రూపాయి చొప్పున సెస్ విధించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆ మేరకు బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, దాన్ని యాప్‌కి అనుసంధానించిన తరువాతే ఈ సెస్ విధించాలని భావిస్తోంది. ఈ రూపంలో సాలీనా రూ.10కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. ఇక ఇప్పటికే అమలులో ఉన్న ప్యాసింజర్ ఎమినిటీస్ సెస్‌ను కూడా సవరిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని కేటగిరీల్లో ఆ సెస్.. టికెట్‌పై రూపాయిగా ఉంది. దాన్ని ఎక్స్‌ప్రెస్ డీలక్స్లలో రూ.2కు, సూపర్‌లగ్జరీ నుంచి ఆపై కేటగిరీల్లో రూ.3కు పెంచుతున్నారు. -
బడ్జెట్ 2021: కోవిడ్ సెస్ పడనుందా?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మలా సీతారామన్ గాడిలో పెట్టనున్నారా.. లేదా అనే విషయం మరికొద్దిసేపట్లో తేటతెల్లం కానుంది. 2020 ఆర్థిక సంవత్సరాన్ని కరోనా కకావికలం చేసింది. ఆదాయం తక్కువ.. వ్యయం ఎక్కువయ్యింది. ఇక ఈ ఏడాది ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు వ్యాక్సినేషన్. దాదాపు 130 కోట్ల మంది జనాభాకు ఉచితంగా.. లేదా నామ మత్రపు ఖర్చుతో టీకా అందించడం అంటే మాటలు కాదు. మాస్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా సెస్ విధించాలని భావిస్తోన్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదనను కోవిడ్-19 సెస్, సర్చార్జ్గా అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో దీని గురించి ప్రకటన వెలువడనుందని సమాచారం. చాలా తక్కువ మొత్తంలో ఉండనున్న ఈ సెస్.. కేవలం టాక్స్ పేయర్స్‌కు మాత్రమే వర్తించబోతుందని తెలుస్తోంది. ప్రభుత్వం కోవిడ్-19 సెస్‌తో పాటు పెట్రోలియం, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ సెస్‌ను కూడా చేర్చాలని యోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక దీని గురించి మరి కాసేపట్లో తెలుస్తుంది. (చదవండి: బడ్జెట్ బ్రదరూ.. జర భద్రం..!) దేశ జనాభాలో ఎక్కువ భాగం టీకాలు వేయడానికి భారీ వ్యయాన్ని కేంద్రం భరించాల్సి వస్తోంది కాబట్టి.. కోవిడ్-19 సెస్‌ని ప్రవేశపెట్టవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 30 కోట్ల మందికి టీకా ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు, జాతీయ కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ వినోద్ పాల్ ఇంతకు ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మిగతా వారికి కూడా తక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌ని అందివ్వాలని భావిస్తున్నారు. కోవిడ్ టీకా పంపిణీ, శిక్షణ, లాజిస్టిక్స్ కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎదుర్కొనే అధిక ఖర్చులు చూస్తే, అధిక ఆదాయ వ్యక్తుల కోసం కోవిడ్ -19 సెస్ అవకాశం ఉండవచ్చు. -
త్వరలో స్వచ్ఛ భారత్ సేవా పన్ను
-
త్వరలో స్వచ్ఛ భారత్ సేవా పన్ను
నూఢిల్లీ: ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఇటీవలే ఏడాది పూర్తయ్యింది. దీనిపై తాజాగా కేంద్రప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. అన్ని రకాల సేవలపై 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్‌ను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి ఈ పన్ను అమలులోకి రానుంది.