సాక్షి, అమరావతి: అర్ధసత్యాలు, అవాస్తవాలతో ఈనాడు, ఎల్లో మీడియా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కింది. ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపును వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడింది. రోజుకోరీతిలో వైఎస్సార్‌సీపీ సర్కారుపై దుష్ప్రచారమే అజెండాగా వ్యవహరిస్తున్న ఈనాడు పత్రిక ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు విషయంలోనూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. చంద్రబాబు హయాం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే ఆర్టీసీ చార్జీలు పెరిగాయని చెప్పుకొచ్చిన ఈనాడు పత్రిక ఆ కథనంలో ఎక్కడా కూడా దేశంలో డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయని ఒక్క వాక్యం కూడా రాయలేదు.
ఇక చంద్రబాబు ప్రభుత్వంలో డీజిల్ ధర ఎంత.. ప్రస్తుతం రెండేళ్లుగా పెరిగిన డీజిల్ ధరలు ఎంత అన్న లెక్కలు కూడా దాచిపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో పొరుగునున్న తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు విధిలేని పరిస్థితుల్లో డీజిల్ సెస్ విధించాయి. తెలంగాణ కంటే ఏపీఎస్ ఆర్టీసీ తక్కువగానే విధించింది. ఈ వాస్తవాలను ప్రస్తావించకుండా చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా తప్పుడు కథనాన్ని ప్రచురించడం ఎల్లో మీడియా కుతంత్రాన్ని మరోసారి బయటపెట్టింది.
డీజిల్ ధర పెరుగుదల 104 శాతం.. సెస్ విధింపు 45 శాతం
ఇక డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నా సరే వీలైనంత వరకు ప్రయాణికులపై తక్కువ భారం పడేలా ఆర్టీసీ విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మూడేళ్లలో డీజిల్ ధరలు ఏకంగా 104 శాతం పెరిగాయి. కానీ, ఆర్టీసీ మూడు విడతల్లో కలిపి కేవలం 45 శాతమే డీజిల్ సెస్ విధించింది. ఈ మూడేళ్లలో డీజిల్ ధరల పెరుగుదలను ప్రధానంగా మూడు భాగాలుగా పరిగణిస్తే.. డీజిల్ ధరలు పెరిగిన నిష్పత్తిలో ఆర్టీసీ డీజిల్ సెస్‌ను పెంచలేదు. పెరుగుతున్న ధరల్లో రెండొంతుల భారాన్ని ఆర్టీసీనే భరిస్తోంది. ఆర్టీసీ డీజిల్ సెస్ పెంచిన మూడు సందర్భాల్లోనూ ఇలానే వ్యవహరించింది. అందుకు నిదర్శనం ఈ గణాంకాలే..
భారీగా పెరిగిన డీజిల్ ధరలు
టీడీపీ హయాంలో కంటే ఇప్పుడే ఆర్టీసీ చార్జీలు పెరిగాయని చెబుతున్న ఎల్లో మీడియా.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెరిగిన తీరు.. ఇప్పుడు పెరిగిన తీరును వివరించలేదు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా పెరిగాయన్న వాస్తవాన్ని అంగీకరించాల్సి వస్తుంది కాబట్టి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మార్కెట్ ధరలను బట్టి ఆర్టీసీ లీటరు డీజిల్‌ను రూ.48.46 చొప్పున కొనుగోలు చేస్తే.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ.99.06, బల్క్ డీజిల్ అయితే లీటరుకు రూ.134.79 ఉంది. దాంతో ఎప్పుడూ కొనుగోలు చేసే బల్క్ డీజిల్ కాకుండా ఆర్టీసీ ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో డీజిల్ కొనుగోలు చేస్తోంది.
అంత హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నా ఆర్టీసీపై రోజుకు అదనంగా రూ.2.50 కోట్ల ఆర్థికభారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల పెరుగుదల, కరోనా పరిస్థితులు, రష్యా–ఉక్రేయిన్ యుద్ధ పరిణామాలతో దేశంలో డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాగే, చంద్రబాబు అధికారంలో ఉన్న 2015లో కంటే ఇప్పటికి బహిరంగ మార్కెట్‌లో డీజిల్ ధర వంద శాతం పెరగగా.. ఆర్టీసీ సాధారణంగా కొనుగోలు చేసే బల్క్ డీజిల్ ధర దాదాపు 150 శాతం పెరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రయాణికులపై నామమాత్రపు భారమే...
మరోవైపు.. డీజిల్ సెస్ పెంపుతో ప్రయాణికులపై ఏడాదికి రూ.2వేల కోట్ల అదనపు భారం పడుతుందన్న ఈనాడు పత్రిక వాదన పూర్తిగా అవాస్తవం. గతంలో రెండుసార్లు డీజిల్ ధరలు అమాంతంగా పెరిగినప్పుడు ఆర్టీసీ అనివార్యంగా పెంచిన డీజిల్ సెస్‌తో ఆదాయం నామమాత్రంగానే పెరిగింది. 2019 డిసెంబరులో చార్జీల పెంపుతో ఏడాదికి రూ.844 కోట్ల రాబడి వస్తుందని ఆర్టీసీ అంచనా వేసింది. కానీ, కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ సర్వీసులను సరిగా నిర్వహించలేకపోయింది.
ఇక ఏప్రిల్ 2022లో డీజిల్ సెస్ పెంపుతో ఏడాదికి రూ.712 కోట్ల రాబడి వస్తుందని.. రోజుకు రూ.2కోట్ల వరకు రాబడి వస్తుందని భావించారు. కానీ, రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయమే వస్తోంది. ఇక తాజాగా నామమాత్రంగా పెంచిన డీజిల్ సెస్‌తో కూడా ఆర్టీసీకి అదే రీతిలో నామమాత్రంగానే రాబడి పెరుగుతుందన్నది తెలుస్తూనే ఉంది. అంటే ప్రయాణికులపై పెద్దగా భారం పడబోదన్నది స్పష్టమవుతోంది.
తెలంగాణ కంటే తక్కువగా సెస్
ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే ఏపీఎస్‌ఆర్టీసీ డీజిల్ సెస్ తక్కువగానే విధిస్తోంది. తద్వారా ప్రయాణికులపై ఎక్కువ భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపులో ఉన్న వ్యత్యాసమే ఇందుకు నిదర్శనం. ఆ వివరాలు ఇవిగో..
Comments
Please login to add a commentAdd a comment