
సాక్షి, హైదరాబాద్: బెంబేలెత్తిస్తున్న డీజిల్ ధరలు, కోవిడ్‌తో పెరిగిపోయిన నష్టాలు.. వెరసి బస్సు టికెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని వీలైనంత మేర పెంచుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవలే సేఫ్టీ సెస్ పేరుతో టికెట్‌పై రూపాయి చొప్పున భారం వేసింది. ఆ రూపంలో చిల్లర సమస్య రాకుండా రౌండ్ ఆఫ్ చేయడంతో టికెట్ గరిష్ట ధరలో రూ.5వరకు పెరిగింది. ఇప్పుడు ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సెస్ పేరుతో మరో రుసుమును టికెట్ ఛార్జీలో కలపాలని నిర్ణయించింది. దీంతోపాటు, నాలుగు నెలల క్రితం ఓ ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు, రూ.10 గుణిజానికి రౌండ్ ఆఫ్ చేసిన ధరలను సవరించి తగ్గించింది. ఈ మొత్తాన్నీ తిరిగి రౌండ్ ఆఫ్‌తో పెంచాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో సాలీనా రూ.50కోట్ల నుంచి రూ.60కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా.
అప్పుడు కోల్పోయిన ఆదాయం రూ.75 కోట్లు
దాదాపు నాలుగు నెలల క్రితం ఆర్టీసీ టికెట్‌పై ఉన్న ఛార్జీల్లో నెలకొన్న గందరగోళంపై ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. తాను తీసుకున్న టికెట్‌పై.. టికెట్ ఫేర్ రూ.91గా, టోటల్ అమౌంట్ రూ.100గా ఉం డటాన్ని ట్విటర్ ద్వారా ప్రశ్నించాడు. చిల్లర సమ స్య రాకుండా, టికెట్ ధరలను అప్పట్లో తదుపరి రూ.10 గుణిజానికి రౌండ్ ఆఫ్ చేయటంతో ఈ వివాదం తలెత్తింది. టికెట్ ఆసలు ధర రూ.91 కాగా దాన్ని రౌండ్ ఆఫ్ చేయటంతో రూ.100గా మారింది. దీంతో ఆప్పట్లో ఆర్టీసీ.. ఆ మొత్తాన్ని రూ.100కు బదులు రూ.90కి రౌండ్ ఆఫ్ చేసింది. ఇలా అన్ని టికెట్ల ధరలను సవరించటంతో సాలీనా రూ.75 కోట్ల మేర ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు ఏకంగా రూ.2వేల కోట్లను దాటాయి. డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో పునరాలోచనలో పడ్డ ఆర్టీసీ.. ఆ ధరలను మళ్లీ రౌండ్ ఆఫ్‌తో సవరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. పల్లెవెలుగులో కొద్ది రోజుల క్రితమే రౌండ్ ఆఫ్ చేయగా, తాజాగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌లలో టికెట్ ధరలో చిల్లర సమస్య రాకుండా తదుపరి రూ.5కు, సూపర్ లగ్జరీ నుంచి ఆపై కేటగిరీ బస్సుల్లో తదుపరి రూ.10కి మారుస్తారు. ఉదా.. టికెట్ వాస్తవ ధర రూ.91 ఉంటే, అది ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌లలో రూ.95 గా, సూపర్ లగ్జరీ, ఆ పై కేటగిరీల్లో రూ.100గా మారుతుందన్నమాట.(గతంలో ఇది అన్ని కేటగిరీల్లో రూ.100గా ఉండేది) దీంతో సాలీనా రూ.50 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని అంచనా.
ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సెస్ అంటే..
బస్సు ఎక్కడుందో ట్రాక్ చేయటం, దానికి సంబంధించిన సమాచారం అందించటం, దీనికోసం యాప్ రూపొందించి ఇన్ఫరేషన్‌ను ప్రయాణికులకు అందిస్తున్నందుకు గాను టికెట్‌పై రూపాయి చొప్పున సెస్ విధించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆ మేరకు బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, దాన్ని యాప్‌కి అనుసంధానించిన తరువాతే ఈ సెస్ విధించాలని భావిస్తోంది. ఈ రూపంలో సాలీనా రూ.10కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. ఇక ఇప్పటికే అమలులో ఉన్న ప్యాసింజర్ ఎమినిటీస్ సెస్‌ను కూడా సవరిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని కేటగిరీల్లో ఆ సెస్.. టికెట్‌పై రూపాయిగా ఉంది. దాన్ని ఎక్స్‌ప్రెస్ డీలక్స్‌లలో రూ.2కు, సూపర్‌లగ్జరీ నుంచి ఆపై కేటగిరీల్లో రూ.3కు పెంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment