బాలల హక్కులను హరిస్తే కఠిన చర్యలు
ఘనంగా బాలల దినోత్సవం
కర్నూలు(విద్య) : బాలల హక్కులను హరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. శుక్రవారం సునయన ఆడిటోరియంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ రవికృష్ణ, ఏజేసీ రామస్వామి, డీఈఓ కె.నాగేశ్వరరావు, ఎస్ఎస్ఎస్ పీఓ మురళీధర్ రావులు పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ పలు కారణాలతో బడికి రాకుండా బడిబయట ఉన్న వారిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తిరిగి పాఠశాలలో చేరించాలన్నారు.ఎస్పీ మాట్లాడుతూ బాలల హక్కులను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పిల్లల సంరక్షణ విషయంలో ఎలాంటి సహాయమైనా అందించేందుకు పోలీసుల సహకారం ఉంటుందన్నారు.
బాలల దినోత్సవాన్ని పరుస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ, డీఎంహెచ్ఓ నరసింహులు పాల్గొన్నారు.