మంగళసూత్రం మింగిన దొంగ
గొలుసు రికవరీకి దారేది?
బయటకి తీయలేమంటున్న వైద్యులు
తలబాదుకుంటున్న పోలీసులు
హైదరాబాద్: చోర కళలో ఆరితేరిన ఓ దొంగ.. పోలీసులకు పట్టుబడతాననే భయంతో తస్కరించిన బంగారు గొలుసును ఏకంగా మింగేశాడు. చివరికి అతడిని పోలీసులు పట్టుకొని గొలుసు తీసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ చిలకలగూడ మైలార్‌గడ్డకు చెందిన శంకరయ్య, ప్రమీల దంపతులు. శనివారం రాత్రి వారు సీతాఫల్మండి రైల్వేస్టేషన్ వైపునకు వాకింగ్ వచ్చారు. అక్కడే తచ్చాడుతున్న మాణికేశ్వరినగర్‌కు చెందిన వికాస్ (22) అనే దొంగ.. ప్రమీల మెడలోని నాలుగు తులాల మంగళసూత్రం తెంపుకొని పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి చిలకలగూడలో వికాస్‌ను గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా జేబులోంచి గొలుసు తీసి అమాంతం మింగేశాడు. దీంతో పోలీసులు అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించారు.
కడుపు కింది భాగంలో గొలుసు ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసి గొలుసు తీయాలని పోలీసులు అక్కడి వైద్యులను కోరారు. అయితే, ఆపరేషన్ చేస్తే ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా గొలుసు బయటకు వస్తుందని వైద్యులు చెప్పారు. దీంతో నిందితుడిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోవాలని పోలీసులు కోరగా అందుకు మొదట వైద్యులు నిరాకరించారు. గొలుసు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదని, నిందితుడు మలవిసర్జనకు వెళ్ల్లిన ప్రతిసారీ ఎవరు చెక్ చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లో ఉంటే తాము కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు కూడా సమాధానమిచ్చారు. చివరికి నిందితుడిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు అంగీకరించారు. అయితే, దొంగ మింగిన బంగారం ఎప్పుడు బయటకు వస్తుందో... ఎలా రికవరీ చేయాలో తెలియక పోలీసులు తెగ హైరానా పడుతున్నారు.