Chain Snatching cases
-
మరోసారి తెరపైకి సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ పేరు
సాక్షి, హైదరాబాద్: సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ పేరు మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో అయిదు స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేశాడు. ఇది జరిగిన రెండు రోజులకే అహ్మదాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. అనారోగ్యమంటూ ఆస్పత్రిలో చేరి కస్టడీ నుంచి పరారయ్యాడు. ఉమేష్ కోసం ముమ్మరంగా గాలించిన అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ గత నెల ఆఖరి వారంలో అరెస్టు చేసింది. ఈ నెల 5న బెంగళూరు పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లారు. సిటీలో నమోదైన నేరాలకు సంబంధించిన ఇక్కడకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో మొత్తం ఏడు నేరాలు... ఉమేష్ స్వస్థలం రాజస్థాన్‌లోని పాలి జిల్లా ఛనోడ్. జనవరి 18న నగరానికి వచ్చి నాంపల్లిలోని హోటల్ ది మెజిస్టిక్‌లో బస చేశాడు. ఆ రోజే మెహదీపట్నం వెళ్లి జిర్రా రోడ్డులో యాక్టివా వాహనం చోరీ చేసుకువచ్చాడు. మరుసటి రోజు ఉదయం ఆల్వాల్ నుంచి మేడిపల్లి వరకు నేరాలు చేశాడు. అయిదు స్నాచింగులకు పాల్పడి.. మరో రెండు చోట్ల యత్నించాడు. మొత్తమ్మీద 18.5 తులాల బంగారం కొట్టేసి పరారయ్యాడు. సంబంధిత వార్త: సీరియల్ స్నాచర్ ఖతిక్ కేసులో మరో ట్విస్ట్ ఇతడిని హైదరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే గుర్తించారు. అహ్మదాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు ఉమేష్‌ను అరెస్టు చేయడంతో పాటు 18.5 తులాలను రికవరీ చేసి తమ కేసుల ఖాతాలో వేసేసుకున్నారు. హైదరాబాద్‌లో నేరాలు చేస్తున్నట్లు చూపిస్తూనే.. ఒక నేరంలో తస్కరించిన గోలుసు మరో స్నాచింగ్ చేస్తున్నప్పుడు పడిపోయినట్లు రికార్డు చేశారు. ఆస్పత్రి నుంచి పరారీ అంటూ... ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో అహ్మదాబాద్ పోలీసులతో మాట్లాడారు. ఇది జరిగిన కొన్ని రోజులకు మరో ఉమేష్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వచ్చింది. గతంలోనే ఉమేష్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఇతడికి అరెస్టు ప్రకటించిన వడాజ్ పోలీసులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారిస్తున్నప్పుడు ఫిట్స్ వచ్చిపడిపోయాడని, అందుకే అహ్మదాబాద్‌లో శారదబెన్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఉమేష్ కథకు తాత్కాలిక విరామం వచ్చింది. బంగారం అప్పగించారు.. ఉమేష్ ఖతిక్ నగరంలో కొట్టేసిన బంగారాన్ని కాజేసిన గుజరాత్ పోలీసులు ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికే ఎస్కేప్ ఎపిసోడ్ ప్లాన్ చేశారని విమర్శలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెల ఆఖరి వారంలో అతడిని రాజస్థాన్‌లో పట్టుకున్నట్లు ప్రకటిస్తూ అక్కడి నరోల్ పోలీసులకు అప్పగించారు. ఉమేష్ అరెస్టుపై ఇక్కడి పోలీసులకు కాకుండా బెంగళూరు అధికారులకు సమాచారం ఇచ్చారు. చదవండి: Chain Snatcher: ఉమేష్ ఖతిక్‌ను ఇచ్చేదేలే గతేడాది డిసెంబర్ 26న జరిగిన ఈ స్నాచింగ్స్‌కు సంబంధించి రూ.4 లక్షల విలువైన బంగారాన్నీ రికవరీ చేసినట్లు అహ్మదాబాద్ పోలీసులకు చెప్పారు. దీంతో పీటీ వారెంట్ తీసుకువెళ్లిన బెంగళూరు పోలీసులు ఈ నెల 5న తీసుకువెళ్లారు. డిసెంబర్ నాటి కేసుల్లో ఆ పోలీసులకు రూ.4 లక్షల బంగారం అప్పగించిన అహ్మదాబాద్ పోలీసులు జనవరిలో నగరంలో జరిగిన నేరాలకు సంబంధించిన సొత్తుపై మాత్రం నోరు విప్పట్లేదు. -
నయా నేరగాళ్లు!
మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆగస్టు 28న స్నాచింగ్ కేసుల్లో అక్షయ్ శర్మ, సుమిత్ కుమార్, సయ్యద్ అబ్దుల్ మెహిద్లను అరెస్టు చేశారు. బేగంబజార్‌కు చెందిన అక్షయ్, సుమిత్‌లు బాగా స్థిరపడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు. కేవలం జల్సాల కోసం నేరబాటపట్టి పోలీసులకు చిక్కారు. - సాక్షి, సిటీబ్యూరో అక్షయ్, సుమిత్‌ల ఉదంతమే కాదు. ఇటీవల కాలంలో జల్సాల కోసం నేరాల బాటపడుతున్న యువత, విద్యాధికుల ఉదంతాలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. వీరు చేస్తున్న నేరాల్లో స్నాచింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. 2013-2015 అక్టోబర్ మధ్య నమోదైన స్నాచింగ్ కేసుల గణాంకాలను పరిశీలిస్తే పోలీసులకు చిక్కిన నేరగాళ్ళలో 40.87 శాతం కొత్త వారే. మారిన జీవన విధానం, పరిస్థితుల కారణంగా ఇలాంటి నేరగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిని పట్టుకోవడం సైతం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. స్నాచింగ్సే ఎందుకంటే..? ‘నయా’ నేరగాళ్ళు చేస్తున్న నేరాల్లో చైన్ స్నాచింగ్సే ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణంగా ఈజీ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. ఓ ఇంట్లోనో, దుకాణంలోనూ దొంగతనం చేయాలంటే దానికి భారీ తతంగం తప్పదు. రెక్కీ, చుట్టు పక్కల పరిస్థితుల అధ్యయనం తదితరాల తరవాతే ఇంట్లోకో/దుకాణంలోకో ప్రవేశించాల్సి ఉంటుంది. అంత ‘కష్టపడినా’ ఎంత వరకు ‘గిట్టుబాటు’ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అదే స్నాచింగ్ చేయడానికి నేరగాళ్ళు పెద్ద కసరత్తులు చేయాల్సిన అవసరం ఉండదు. ఓ అనుచరుడిని తీసుకుని, ద్విచక్ర వాహనంపై రోడ్డమీదికి వస్తే సరిపోతుంది. మార్కెట్లో పెరిగిన బంగారం రేట్ల కారణంగా ఒక్క గొలుసు చోరీ చేసినా కనీసం రూ.10 వేలు ఎక్కడికీ పోవు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కొత్త నేరగాళ్ళు స్నాచింగ్స్ వైపు మళ్ళుతున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. బెరుగ్గా మొదలెట్టి భేషుగ్గా... కొత్త నేరగాళ్లు తొలినాళ్లలో కొంత బెరుగ్గానే నేరాలు చేస్తున్నారు. ఒక నేరం చేసిన తరవాత ఈజీ మనీకి అలవాటు పడిపోయి పట్టుబడే వరకు వరుసగా చేసుకుపోతున్నారు. పోలీసులకు చిక్కి, జైలుకు వెళ్తున్న తరవాత చట్టాల్లో ఉన్న లోపాలు, తేలిగ్గా బెయిల్స్ దొరుకుతున్న విధానం, తీర్పులు వెలువడటంలో ఉన్న జాప్యం...ఇవన్నీ వీరిని అదే బాటలో కొనసాగేలా పురిగొల్పుతున్నాయి. నివాస ప్రాంతాలు, పేర్లను తరచుగా మార్చుకుంటూ భేషుగ్గా నేరాలు కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా నడిచి వెళ్తున్న వారినే టార్గెట్‌గా చేసుకుని స్నాచర్లు రెచ్చిపోయే వారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇళ్ళల్లోకి వచ్చి, ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వెళ్తున్న వారినీ టార్గెట్‌గా చేసుకుని పంజా విసురుతున్నారు. కారణాలనేకం... యువతలో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడానికి సామాజిక, ఆర్థిక, కుటుంబ పరంగా అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సమాజంలో విలాసాలు అనేవి ఒకప్పుడు ఉన్నత కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాహనం, సెల్ఫోన్లు, పార్టీలు కాలక్రమంలో నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. గ్రామాల నుంచి నగరాలకు వస్తున్న వారు, నగరాల్లో నివసిస్తున్న మధ్యతరగతి వారు వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒకసారి విలాసాలకు అలవాటుపడి పదే పదే అలాంటి జీవితం కోసం ఈజీమనీ వైపు మొగ్గి స్నాచింగ్ తరహా నేరాల బాటపడుతున్నారు. నగర యువత కూడా గర్ల్‌ఫ్రెండ్స్, స్నేహితురాళ్లతో షికార్ల కోసం, వారిని మెప్పించేలా ఖర్చులు చేయడం కోసం నేరగాళ్లుగా మారిన ఉదంతాలూ అనేకం ఉన్నాయి. తల్లిదండ్రుల అజమాయిషీ లేక... నగరంలో ఒంటరి జీవులు పెరిగిపోతున్నారు. చదువులు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు అనేక మంది వలస వస్తున్నారు. ఇటీవల ఈ ధోరణి పెరిగింది. ఇలా వస్తున్న యువత తల్లిదండ్రులు, కుటుంబాలకు దూరంగా సహోద్యోగులు, మిత్రులతో కలిసో, ఒంటరిగానో జీవిస్తున్నారు. దీంతో ఏం చేసినా పట్టించుకునేవారు లేకుండా పోతున్నారు. నగరంలోనూ మారిన జీవన విధానం, చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషీ తక్కువగా ఉంటోంది. వీరి బాగోగులు పట్టించుకోవడం, కదలికల్ని కనిపెట్టడంలో వారు విఫలం కావడంతో పెడదారి పడుతున్న యువకుల సంఖ్య ఎక్కువ అవుతోందన్నది పోలీసుల మాట. విలాసాల కోసమే అధికంగా... సిటీలో పెరిగిన పార్టీ కల్చర్, అందుబాటులోకి వచ్చిన పబ్స్ తదితరాలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. విలాసాలకు బానిసలుగా మారుతున్న ఉన్నత విద్యావంతులు, పెద్ద కుటుంబాలకు చెందిన వారు కూడా స్నాచింగ్స్ వంటి నేరాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఈ పరిణామం పోలీసులకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పేరుమోసిన దొంగలు, ముఠాలకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరిపై కన్నేసి ఉంచుతారు. అయితే కొత్తగా పుట్టుకు వస్తున్న ఈ కొత్త దొంగల కారణంగా కేసుల దర్యాప్తు కూడా మందకొడిగా సాగి, కొలిక్కితేవడం కష్టసాధ్యంగా మారుతోందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. స్నాచింగ్ వంటి నేరాల్లో వేలిముద్రలు వంటి ఆధారాలు సైతం ఉండవు. దీంతో పక్కా సమాచారంతో నేరగాళ్ళను పట్టుకునే వరకు ఆ కేసులు కొలిక్కి రావట్లేదు. అర్బనైజ్డ్ క్రైమ్‌గా స్నాచింగ్స్... అర్బనైజ్డ్ క్రైమ్‌గా మారిన చైన్‌స్నాచింగ్స్ బెడద కేవలం జంట కమిషనరేట్లకే కాదు... దేశ వ్యాప్తంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా వెయ్యికి తగ్గకుండా స్నాచింగ్స్ చోటు చేసుకుంటున్నాయి. 2013లో మూడు వేలు, 2014లో ఏకంగా ఏడువేలు దాటాయి. ముంబైలోనూ పరిస్థితి ఇలానే ఉంది. అక్కడి పోలీసు చరిత్రలో తొలిసారిగా గత ఏడాది 2834 ఉదంతాలు జరిగాయి. దీంతో ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్) సైతం స్నాచర్ల కోసం వేట ప్రారంభించింది. అగ్రరాజ్యంగా భావించే అమెరికాలోనూ అర్బనైజ్డ్ క్రైమ్ ఉందని పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడ ‘గొలుసులు’ లేకపోవడంతో వాహనాల చోరీలు జరుగుతాయని వివరిస్తున్నారు. సింగిల్ హ్యాండ్ స్నాచర్... స్నాచింగ్... ఈ పేరు చెప్పగానే ఓ ద్విచక్ర వాహనం, హెల్మెట్టు, మాస్క్‌తో దూసుకువచ్చి పంజా విసిరే ఇద్దరు వ్యక్తులు గుర్తుకువస్తారు. అయితే నగరంలో ఇటీవల ఓ ‘సింగిల్ స్నాచింగ్’ సైతం జరిగింది. గత నెల 29 అబిడ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటోను వెంబడిస్తూ వచ్చిన స్నాచర్ ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసు తెంచుకుపోయాడు. -
పెద్ద చదువులు.. చిల్లర బుద్ధులు
- చైన్‌స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు - జల్సాల కు అలవాటుపడి నేరాలు - ఏటా పెరుగుతున్న కేసులు - మూడు గ్యాంగ్‌లను పట్టుకున్న పోలీసులు నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో చైన్‌స్నాచింగ్ ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క సెప్టెంబర్ నెలలో 12 రోజుల వ్యవధిలో పది చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. పెరుగుతున్న చైన్‌స్నాచింగ్ కేసులు పోలీసులకు సవాలుగా మారాయి. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కనీసం మహిళలు ఇళ్ల ముందర ధైర్యంగా కల్లాపి చల్లాలంటే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మెడలో బంగారు ఆభరణాలు ధరించాలని మహిళలు భయపడుతున్నారు. నిందితుల్లో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఉండడం విస్మయం గొలుపుతోంది. జల్సాలకు అల వాటు పడి వారు ఇలాంటి నేరాలకు పాల్పడుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు... జిల్లాలో ఐదేళ్లలో 413 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. 2009లో 30 , 2010లో 75, 2011లో 81, 2012లో 89 , 2013లో 121 , 2014 ఇప్పటి వరకు 48 కేసులు నమోదయ్యాయి. *1.18 కోట్ల సొత్తు అపహరణకు గురైంది. ఒక్క ఆగస్టు నెలలోనే 2,4,6,8,11,30 తేదీల్లో వేరువేరు చోట్ల రెండు నుంచి మూడు చైన్‌స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల తీరు ఇటీవల విపరీతంగా పెరగడం పోలీసులకు ఆందోళన కలిగించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చైన్‌స్నాచర్ల ఆటను కట్టించడానికి పూనుకున్నారు. దీంతో దొరికిన ఒకరిని విచారించి మూడు గ్యాంగ్‌లను పట్టుకుని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి *12 లక్షల విలువగల బంగారం, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి చైన్‌స్నాచర్ల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జల్సాలకు అలవాటుపడి... ఇంజినీరింగ్, డిగ్రీ విద్యనభ్యసిస్తున్న పలువురు విద్యార్థులు జల్సాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణ తెలిసింది. ఖరీదైన ఫోన్లు, బైకులు, దుస్తులు కొనుగోలు చేయడం, అమ్మాయిలకు వలవేయడం వంటి కార్యక్రమాలకు డబ్బులు ఎక్కువ మొత్తంలో అవసరం పడడంతో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. తేలికగా డబ్బులు రావడం, జల్సాలు చేయడం అలవాటుగా మారి ఈ నేరాలను కొనసాగిస్తున్నారు. చదువులకు పంపిస్తే... నిజామాబాద్ మండలం కాలేపల్లి క్యాంపునకు చెందిన గణేష్ జిల్లాకేంద్రంలోని ఓ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మహేశ్‌రెడ్డి జిల్లాకేంద్రంలోని ఖలీల్వాడీలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అలాగే కాలేపల్లి క్యాంపునకు చెందిన లక్కు నవీన్‌రెడ్డి డిగ్రీ విద్యను అసభ్యసిస్తున్నారు. వీరు చోరీ చేసిన బంగారు మంగళసూత్రాలు, చైన్లను ఇతర ప్రాంతాల్లో అమ్మేవారు. వచ్చిన డబ్బు ద్వారా ఖరీదైన ఫోన్లు, దుస్తులు కొనుగోలు చేయడం , అమ్మాయిల వెంట పడడం, ఖరీదైన గిఫ్టులతో వారిని ఆకర్షింపజేసుకోవడం పనిగా పెట్టుకునేవారు. ఇలా చేతిలో డబ్బులు ఉన్నన్ని రోజులు జల్సాలు చేసేవారు. డబ్బులు అయిపోగానే మళ్లీ చైన్‌స్నాచింగ్ చేసేవారు. జిల్లాకేంద్రంలోని పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఈ చైన్‌స్నాచింగ్‌లో ముఖ్యులుగా ఉన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులతో, ఇందులో ప్రముఖ నాయకుల కుమారులు ఉండడం గమనార్హం. ఒక ప్రముఖ పార్టీ నాయకుడి కుమారుడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడడం పోలీసులనే విస్మయానికి గురిచేసింది. తనిఖీల్లో పట్టుబడి... చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న మూడు గ్యాంగులు పోలీసులకు చిక్కాయి. వీరిని ఆరా తీసిన పోలీసులు వివరాలు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈనెల 8న కమ్మర్పల్లి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మెట్పల్లి వైపు నుంచి నలుగురు యువకులు నెంబర్ప్లేటు లేని బైకులపై వస్తున్నారు. వీరిని పోలీసులు తనిఖీలు చేయగా వారి వద్ద నుంచి మంగళసూత్రాలు, చైన్లు లభించాయి. ఇందులో మోర్తాడ్ మండలం తొర్తి గ్రామానికి చెందిన గజానంద్, పెర్కిట్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇలియాస్, కాలేపల్లి క్యాంపునకు చెందిన గణేష్ , లక్క నవీన్‌రెడ్డి ఉన్నారు. వీరిని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే నిజామాబాద్ ప్రాంతంలో చైన్‌స్నాచింగ్ పాల్పడుతున్న మరో గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. వీరు చేసిన చైన్‌స్నాచింగ్ వివరాలను గుర్తించి కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. చైన్‌స్నాచింగ్‌లను ఊపేక్షించమని, కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘గతనెల 6వ తేదీ జిల్లాకేంద్రంలోని వినాయక్‌నగర్‌లో ఏఆర్ ఎస్సై ప్రతాప్ భార్య లక్ష్మి ఉదయం ఇంటి ముందు వాకిలి ఊడుస్తుంది. అటుగా ఇద్దరు యువకులు పల్సర్‌బైక్‌పై వచ్చి ఓ ఇంటి అడ్రస్ అడిగారు. ఆమె వారి మాటలు వినేలోపు మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యారు. జరిగిన సంఘటనతో హతాశులవడం ఆమె వంతైంది. జిల్లాలో ఇటీవలి కాలంలో చైన్‌స్నాచింగ్ కేసులు పెరిగాయి. మహిళలు బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం వాకిలీ ఊడవడం, ఇళ్ల ముందర కల్లాపి చల్లుదామన్న భద్రతా లేకుండా పోయింది. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తారో.. ఎలా వస్తారో తెలియదు చైన్‌స్నాచర్లు. కళ్లు తెరచి చూసేలోపు పనికానిచ్చేస్తున్నారు. నిందితుల్లో ఎక్కువగా ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశకు పోయి వారు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.