నయా నేరగాళ్లు!
మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆగస్టు 28న స్నాచింగ్ కేసుల్లో అక్షయ్ శర్మ,
సుమిత్ కుమార్, సయ్యద్ అబ్దుల్ మెహిద్‌లను అరెస్టు చేశారు.
బేగంబజార్‌కు చెందిన అక్షయ్, సుమిత్‌లు బాగా స్థిరపడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు.
కేవలం జల్సాల కోసం నేరబాటపట్టి పోలీసులకు చిక్కారు.
- సాక్షి, సిటీబ్యూరో
అక్షయ్, సుమిత్‌ల ఉదంతమే కాదు. ఇటీవల కాలంలో జల్సాల కోసం నేరాల బాటపడుతున్న యువత, విద్యాధికుల ఉదంతాలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. వీరు చేస్తున్న నేరాల్లో స్నాచింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. 2013-2015 అక్టోబర్ మధ్య నమోదైన స్నాచింగ్ కేసుల గణాంకాలను పరిశీలిస్తే పోలీసులకు చిక్కిన నేరగాళ్ళలో 40.87 శాతం కొత్త వారే.
మారిన జీవన విధానం, పరిస్థితుల కారణంగా ఇలాంటి నేరగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిని పట్టుకోవడం సైతం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది.
స్నాచింగ్సే ఎందుకంటే..?
‘నయా’ నేరగాళ్ళు చేస్తున్న నేరాల్లో చైన్ స్నాచింగ్సే ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణంగా ఈజీ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. ఓ ఇంట్లోనో, దుకాణంలోనూ దొంగతనం చేయాలంటే దానికి భారీ తతంగం తప్పదు. రెక్కీ, చుట్టు పక్కల పరిస్థితుల అధ్యయనం తదితరాల తరవాతే ఇంట్లోకో/దుకాణంలోకో ప్రవేశించాల్సి ఉంటుంది.
అంత ‘కష్టపడినా’ ఎంత వరకు ‘గిట్టుబాటు’ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అదే స్నాచింగ్ చేయడానికి నేరగాళ్ళు పెద్ద కసరత్తులు చేయాల్సిన అవసరం ఉండదు. ఓ అనుచరుడిని తీసుకుని, ద్విచక్ర వాహనంపై రోడ్డమీదికి వస్తే సరిపోతుంది. మార్కెట్‌లో పెరిగిన బంగారం రేట్ల కారణంగా ఒక్క గొలుసు చోరీ చేసినా కనీసం రూ.10 వేలు ఎక్కడికీ పోవు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కొత్త నేరగాళ్ళు స్నాచింగ్స్ వైపు మళ్ళుతున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
బెరుగ్గా మొదలెట్టి భేషుగ్గా...
కొత్త నేరగాళ్లు తొలినాళ్లలో కొంత బెరుగ్గానే నేరాలు చేస్తున్నారు. ఒక నేరం చేసిన తరవాత ఈజీ మనీకి అలవాటు పడిపోయి పట్టుబడే వరకు వరుసగా చేసుకుపోతున్నారు. పోలీసులకు చిక్కి, జైలుకు వెళ్తున్న తరవాత చట్టాల్లో ఉన్న లోపాలు, తేలిగ్గా బెయిల్స్ దొరుకుతున్న విధానం, తీర్పులు వెలువడటంలో ఉన్న జాప్యం...ఇవన్నీ వీరిని అదే బాటలో కొనసాగేలా పురిగొల్పుతున్నాయి.
నివాస ప్రాంతాలు, పేర్లను తరచుగా మార్చుకుంటూ భేషుగ్గా నేరాలు కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా నడిచి వెళ్తున్న వారినే టార్గెట్‌గా చేసుకుని స్నాచర్లు రెచ్చిపోయే వారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇళ్ళల్లోకి వచ్చి, ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వెళ్తున్న వారినీ టార్గెట్‌గా చేసుకుని పంజా విసురుతున్నారు.
కారణాలనేకం...
యువతలో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడానికి సామాజిక, ఆర్థిక, కుటుంబ పరంగా అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సమాజంలో విలాసాలు అనేవి ఒకప్పుడు ఉన్నత కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాహనం, సెల్‌ఫోన్లు, పార్టీలు కాలక్రమంలో నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి.
గ్రామాల నుంచి నగరాలకు వస్తున్న వారు, నగరాల్లో నివసిస్తున్న మధ్యతరగతి వారు వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒకసారి విలాసాలకు అలవాటుపడి పదే పదే అలాంటి జీవితం కోసం ఈజీమనీ వైపు మొగ్గి స్నాచింగ్ తరహా నేరాల బాటపడుతున్నారు. నగర యువత కూడా గర్ల్‌ఫ్రెండ్స్, స్నేహితురాళ్లతో షికార్ల కోసం, వారిని మెప్పించేలా ఖర్చులు చేయడం కోసం నేరగాళ్లుగా మారిన ఉదంతాలూ అనేకం ఉన్నాయి.
తల్లిదండ్రుల అజమాయిషీ లేక...
నగరంలో ఒంటరి జీవులు పెరిగిపోతున్నారు. చదువులు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు అనేక మంది వలస వస్తున్నారు. ఇటీవల ఈ ధోరణి పెరిగింది. ఇలా వస్తున్న యువత తల్లిదండ్రులు, కుటుంబాలకు దూరంగా సహోద్యోగులు, మిత్రులతో కలిసో, ఒంటరిగానో జీవిస్తున్నారు. దీంతో ఏం చేసినా పట్టించుకునేవారు లేకుండా పోతున్నారు.
నగరంలోనూ మారిన జీవన విధానం, చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషీ తక్కువగా ఉంటోంది. వీరి బాగోగులు పట్టించుకోవడం, కదలికల్ని కనిపెట్టడంలో వారు విఫలం కావడంతో పెడదారి పడుతున్న యువకుల సంఖ్య ఎక్కువ అవుతోందన్నది పోలీసుల మాట.
విలాసాల కోసమే అధికంగా...
సిటీలో పెరిగిన పార్టీ కల్చర్, అందుబాటులోకి వచ్చిన పబ్స్ తదితరాలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. విలాసాలకు బానిసలుగా మారుతున్న ఉన్నత విద్యావంతులు, పెద్ద కుటుంబాలకు చెందిన వారు కూడా స్నాచింగ్స్ వంటి నేరాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు.
ఈ పరిణామం పోలీసులకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పేరుమోసిన దొంగలు, ముఠాలకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరిపై కన్నేసి ఉంచుతారు. అయితే కొత్తగా పుట్టుకు వస్తున్న ఈ కొత్త దొంగల కారణంగా కేసుల దర్యాప్తు కూడా మందకొడిగా సాగి, కొలిక్కితేవడం కష్టసాధ్యంగా మారుతోందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. స్నాచింగ్ వంటి నేరాల్లో వేలిముద్రలు వంటి ఆధారాలు సైతం ఉండవు. దీంతో పక్కా సమాచారంతో నేరగాళ్ళను పట్టుకునే వరకు ఆ కేసులు కొలిక్కి రావట్లేదు.
అర్బనైజ్డ్ క్రైమ్‌గా స్నాచింగ్స్...
అర్బనైజ్డ్ క్రైమ్‌గా మారిన చైన్‌స్నాచింగ్స్ బెడద కేవలం జంట కమిషనరేట్లకే కాదు... దేశ వ్యాప్తంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా వెయ్యికి తగ్గకుండా స్నాచింగ్స్ చోటు చేసుకుంటున్నాయి. 2013లో మూడు వేలు, 2014లో ఏకంగా ఏడువేలు దాటాయి. ముంబైలోనూ పరిస్థితి ఇలానే ఉంది.
అక్కడి పోలీసు చరిత్రలో తొలిసారిగా గత ఏడాది 2834 ఉదంతాలు జరిగాయి. దీంతో ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్) సైతం స్నాచర్ల కోసం వేట ప్రారంభించింది. అగ్రరాజ్యంగా భావించే అమెరికాలోనూ అర్బనైజ్డ్ క్రైమ్ ఉందని పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడ ‘గొలుసులు’ లేకపోవడంతో వాహనాల చోరీలు జరుగుతాయని వివరిస్తున్నారు.
సింగిల్ హ్యాండ్ స్నాచర్...
స్నాచింగ్... ఈ పేరు చెప్పగానే ఓ ద్విచక్ర వాహనం, హెల్మెట్టు, మాస్క్‌తో దూసుకువచ్చి పంజా విసిరే ఇద్దరు వ్యక్తులు గుర్తుకువస్తారు. అయితే నగరంలో ఇటీవల ఓ ‘సింగిల్ స్నాచింగ్’ సైతం జరిగింది. గత నెల 29 అబిడ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటోను వెంబడిస్తూ వచ్చిన స్నాచర్ ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసు తెంచుకుపోయాడు.