
ముంబై: మహారాష్ట్రలో ఆగస్ట్‌లో సంచలనం సృష్టించిన ‘బద్లాçపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. నవీ ముంబైలోని తలోజా జైలు నుంచి థానె జిల్లాలోని బద్లాçపూర్ పట్టణానికి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులకు తెగబడిన అతడిని పోలీసులు క్షణాల్లో మట్టుబెట్టారు.
సోమవారం సాయంత్రం 6.15గంటలకు ముంబ్రా బైపాస్ రోడ్డు వద్ద ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. బద్లాçపూర్‌లోని ఓ స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల అక్షయ్ అక్కడి నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై లైంగికంగా దాడిచేశాడని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. విషయం తెల్సిన మరుక్షణం స్కూలు పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు, నిరసనకారులు వేలాదిగా ఆందోళన చేపట్టడం తెల్సిందే.
ఎదురుకాల్పుల ఉదంతంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విలేకరులతో మాట్లాడారు. ‘‘ అక్షయ్‌పై అతని మాజీ భార్య లైంగిక హింస కేసు పెట్టింది. ఈ కేసులో విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి ఇతడిని బద్లాçపూర్‌కు ఒక పోలీస్ ఎస్కార్ట్ బృందం తీసుకొస్తోంది.
మార్గమధ్యంలో పోలీసు వాహనం ముంబ్రా బైపాస్ చేరుకోగానే పోలీస్ నుంచి పిస్టల్‌ను లాక్కొని నిందితుడు ఒక అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ నీలేశ్ మోరెపైకి 2–3 రౌండ్ల కాల్పులు జరిపాడు. హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న మరో పోలీసు అధికారి వెంటనే తన తుపాకీతో అక్షయ్‌ను కాల్చాడు. రక్తమోడుతున్న ఇతడిని దగ్గర్లోని కల్వా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆత్మరక్షణ కోసం మాత్రమే పోలీసు ఇతనిపై కాల్పులు జరిపాడు’’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment