chaithanya yatra
-
ఇప్పుడు కూడా అడుక్కోవాలా..!
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ సిట్టింగులకే సీట్లు ఇస్తామని చెప్పి మరోసారి బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం విచారకరం అన్నారు. బీసీ రాజకీయ చైతన్య బస్సు యాత్రలో భాగంగా బోధన్ చేరుకున్న శ్రీనివాస్ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా ఇవ్వాలని టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలను ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలోని 112 బీసీ కులాలు జేఏసీగా ఏకమై ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా రాజకీయ వాటా కోసం యాచించాల్సిన పరిస్థితులు ఉండటం బాధాకరమన్నారు. శాసించే స్థాయి కోసమే బీసీ రాజకీయ చైతన్య యాత్ర చేస్తున్నామని తెలిపారు. బీసీలను అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో అన్ని పార్టీ కార్యాలయాలు టులెట్ బోర్డులు పెట్టుకోవాల్సి వస్తుందని ఉద్ఘాటించారు. -
7 నుంచి బీసీల రాజకీయ చైతన్య యాత్ర
హైదరాబాద్: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలన్న నినాదంతో బీసీల రాజకీయ చైతన్య యాత్రను చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ‘పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు’అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 7నుంచి సెప్టెంబర్ 7వరకు చేపట్టనున్న ఈ యాత్ర 80 నియోజకవర్గాల గుండా సాగుతుందన్నారు. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు జరిగిన రోజు నుంచే యాత్ర ప్రారంభమవుతుందని, పార్టీలకు అతీతంగా బీసీలందరూ పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను కార్యకర్తలుగానే చూస్తున్నారు తప్ప రాజ్యాధికారంలో బీసీల వాటా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అగ్రకుల నాయకులు హైకోర్టులో కేసు లు వేసి బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బీసీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు శ్రీనివాసరావు, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు. -
సీమ అభివృద్ధి కోసం చైతన్యయాత్ర
పుట్టపర్తి టౌన్ : రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలంటూ చైతన్యయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్సీ గేయానంద అన్నారు. ఆదివారం పర్తిసాయి ధర్మశాలలో ఏపీ రైతు సంఘం 11వ జిల్లా మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేస్తూ కర్నూలు జిల్లా నుంచి యాత్ర ప్రారంభించామన్నారు. ఈ నెల 25 నుంచి ఎడారి ఛాయలు నెలకొన్న కణేకల్లు మండం నుంచి యాత్ర ప్రారంభిస్తామన్నారు. యాత్రలో ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ, రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మానవహక్కుల వేదికనాయకులు బాషా, చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, ఆదిశేషు పాల్గొంటారన్నారు.