మార్క్-3 ప్రయోగంలో ‘కృష్ణా’ ఇంజనీర్లు
విజయవాడ: కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు యువ ఇంజనీర్లు అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో సత్తా చాటారు. ఇటీవల గగనతలంలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ మార్క్-3 తయారీలో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. దాదాపు ఐదేళ్ల క్రితం మార్క్-3 తయారీలో భాగస్వాములైన ఆ ఇద్దరు ఇంజనీర్లలో ఒకరు ప్రస్తుతం దేశంలోనే స్థిరపడగా మరొకరు విదేశాల్లో ఉన్నారు.
మార్క్-3 నింగిలోకి దూసుకెళ్లిన క్రమంలో ఆ ఇద్దరూ ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన లోహిత్ నాగవెంకట భానుతీర్థ్ శర్మ, విజయవాడకు చెందిన చామర్తి దీపక్ స్నేహితులు. వారు 2005 నుంచి 2009 వరకు బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కోర్సును సన్‌ఫ్లవర్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తిచేశారు.
రోబోటిక్స్‌లో ఏదైనా చేయాలని భావించిన వీరికి ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనుమతితో నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో మూడు నెలల ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం దక్కింది. ఇస్రో శాస్త్రవేత్త ఒకరు వారికి మార్గదర్శకం చేసి.. రాకెట్ తయారీలో భాగస్వాముల్ని చేశారు. నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో 2009 జనవరి నుంచి ఏప్రిల్ వరకు పనిచేశారు.