chandana deepthi
-
Lockdown: కాలక్షేపం పేరిట కాయ్ రాజా కాయ్..
కాలక్షేపమే కొంపముంచుతోంది. సరదాగా మొదలుపెట్టిన పేకాట వ్యసనంగా మారుతోంది. మూడుముక్కలాట సామాన్యుల జేబులను గుల్ల చేస్తోంది. కష్ట పడకుండా సంపాదించాలనే తాపత్రయంతో ఎంతో మంది ఆటకు బానిసలవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కరోనా వేళ అందరూ ఇంటిపట్టునే ఉండటంతో ఈ ఆట మరింత ఎక్కువైంది. అద్దె ఇళ్లు, నిర్మానుష్య ప్రదేశాలు పేకాట స్థావరాలకు వేదికలవుతుండగా, లక్షల్లో నగదు చేతులు మారుతోంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట పేకాటరాయుళ్లు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. - మెదక్ రూరల్ జిల్లాలో మూడు రాజాలు, ఆరు రాణులుగా పేకాట కొనసాగుతుంది. మూడేళ్ల పోలీస్ రికార్డులతో పోలిస్తే జిల్లాలో పేకాట కేసుల సంఖ్య, పట్టుబడిన వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2019లో 36 పేకాట కేసులు నమోదవగా, 191 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించగా, రూ.4,46,722 జరిమానా విధించారు. అదే విధంగా 2020లో మొత్తం 90 కేసులు నమోదవగా, 552 మందిని కోర్టులో హాజరుపరచగా, రూ.13,52,789 జరిమానా విధించారు. అలాగే 2021లో ఇప్పటి వరకు మొత్తం 9 కేసులు నమోదు కాగా, 57 మందిని కోర్టుకు తరలించగా రూ. 97,700లను జరిమానా విధించారు. కొంపముంచుతున్న కాలక్షేపం.. జిల్లాలో లాడ్జీలు, అద్దె ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు, అటవీ, నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా ఏర్పరుచుకొని యథేచ్ఛగా పేకాటను కొనసాగిస్తున్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రహస్యంగా పేకాట ఆడుతుండటం వల్ల లక్షల్లో నగదు చేతులు మారుతున్నాయి. మెదక్ పట్టణంతో పాటు నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, అల్లాదుర్గ్, టేక్మాల్, రేగోడ్, కౌడిపల్లి, కొల్చారం, శంకరంపేట, చేగుంట, హవేళిఘణాపూర్ తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నారు. కాలక్షపం పేరిట మొదలైన పేకాట ఎంతో మంది సామాన్యుల జీవితాలను రోడ్డుపాలు చేస్తుంది. తనఖా పెట్టి మరీ.. పేకాటరాయుళ్లు తమ స్థోమతను బట్టి రౌండ్ రౌండ్‌కు డబ్బులను పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇలా సుమారు రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఆటను కొనసాగిస్తుంటారు. పేకాటలో డబ్బులను పోగొట్టుకున్న కొందరు తిరిగి ఆట ఆడి సంపాదించాలనే కోరికతో తమ వద్ద ఉన్న సెల్ఫోన్లను, వాహనాలతో పాటు ప్రాపర్టీ డాక్యుమెంట్లను సైతం వడ్డీ వ్యాపారుల వద్ద తనఖా పెట్టి ఆటను కొనసాగిస్తూ సర్వం కోల్పోతున్నారు. ఇంకొందరు ఆటకు అవసరమైన డబ్బుల కోసం ఇంట్లో తల్లిదండ్రులు, భార్య పై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు పేకాటకు బానిసలుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కరోనా వేళ పెరిగిన ఆట.. కరోనా పేకాటరాయుళ్లకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వ్యాపారాలు అంతంత మాత్రంగానే జరగడం, స్కూళ్లు, కాలేజీలు మూతపడగా, ఆయా శాఖల కార్యాలయాలు అడపాదడపా కొనసాగుతున్నాయి. కర్ఫ్యూలు, లాక్డౌన్లతో పేకాటరాయుళ్లకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. దీంతో కొందరు గుంపులుగా ఒక చోటకు చేరి అడ్డూఅదుపు లేకుండా పేకాటను కొనసాగిస్తున్నారు. పోలీసుల కళ్లు కప్పి తమ స్థావరాలను మార్చుకుంటూ రహస్యంగా పేకాటను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి పేకాటను నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చట్టరీత్యా చర్యలు తప్పవు.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పోలీసు ప్రత్యేక బృందాలు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల పేకాట స్థావరాలను గుర్తించడంతో పాటు పేకాట, బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వ్యక్తుల పై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలాంటివి ఏమైనా ప్రజల దృష్టికొస్తే 100 డయల్ చేయాలి లేదా దగ్గరలోని పోలీసులకు తెలియజేయాలి. సమాచారం ఇచి్చన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. - చందనాదీప్తి, ఎస్పీ -
అది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన..
‘మా అమ్మ నాతో అన్ని వేళలా ఫ్రెండ్‌లా ఉంటుంది. నాకు ఎల్లప్పుడూ కొండంత ధైర్యం ఆమే’ అని అంటున్నారు మెదక్ ఎస్పీ చందనా దీప్తి. ప్రజలే ఫ్యామిలీ.. వారికి సేవలందించడంలోనే నాకు సంతృప్తి అని చెబుతున్నారు. వరుస ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న ఆమె శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. సంగీతం, కవిత్వంతోపాటు పెయింటింగ్స్ వేయడం చాలా ఇష్టమని.. లాంగ్ టెన్నిస్, స్విమ్మింగ్‌లో ఎన్నో మెడల్స్ వచ్చాయని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించి జీవితంలో రాణించిన ప్రతి ఒక్కరూ తనకు స్ఫూర్తి అంటూ ఐపీఎస్ ఆఫీసర్లలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న చందనా దీప్తితో పర్సనల్ టైం ఆమె మాటల్లోనే.. సాక్షి, మెదక్ : సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మల్కాపూర్‌కు వచ్చిన సందర్భంలో మహిళలు, విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఈ అమ్మాయిని చూడండి.. యంగ్ డైనమిక్ ఎస్పీ.. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ రాణించాలి.’ అని పిలుపునిచ్చారు. ఇది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. ప్రతి రోజూ ఏదో ఒక సమస్యతో పలువురు మా దగ్గరకు వస్తుంటారు. పిల్లల మిస్సింగ్, ఇతరత్రా ఫిర్యాదులు అంటూ మా గడప తొక్కుతారు. వారి బాధలు విన్నా.. చూసినా.. మా కడుపు తరుక్కుపోతుంటుంది. వారి సమస్యలు పరిష్కారానికి నోచుకున్నప్పుడు బాధితుల కంటే మాకే ఎక్కువ సంతోషం ఉంటుంది. మనసుకు హాయిగా అనిపిస్తుంది. మా అమ్మానాన్నది లవ్ మ్యారేజీ. అమ్మ విజయలక్ష్మి ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశారు. నాన్న జకర్యా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజిస్ట్. ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో చిత్తూరు, కాకినాడ, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. అమ్మానాన్నది కష్టపడే మనస్తత్వం. తమ్ముడు ధీరజ్ ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. నేను వరంగల్‌లోని చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) ఆస్పత్రిలో జన్మించా. తమ్ముడు ధీరజ్ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటాడు. విద్యాభ్యాసం రాజమండ్రి, చిత్తూరు, నెల్లూరు, ఢిల్లీలో విద్యనభ్యసించా. రాజమండ్రిలో ఎల్కేజీ నుంచి రెండో తరగతి, నెల్లూరులో మూడు, నాలుగో తరగతి.. ఆ తర్వాత చిత్తూరులోని గుడ్ షెపర్డ్ హైస్కూల్లో ఐదు నుంచి 12వ తరగతి (సీబీఎస్ఈ) వరకు చదివాను. నెల్లూరులో ఇంటర్ విద్యనభ్యసించా. ఢిల్లీ ఐఐటీ కంప్యూటర్ సైన్స్ చదివా. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. రెండో పర్యాయంలో ఐపీఎస్ ర్యాంక్ సాధించా. యాసిడ్ దాడి ఘటన ప్రభావం చూపించింది నేను చదువుకునే రోజుల్లో వరంగల్‌లో యాసిడ్ దాడి ఘటన జరిగింది. అప్పుడు నేను సివిల్స్‌కు ప్రిపేర్ కావాలనే ఆలోచనలో ఉన్నా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రభావం చూపించింది కూడా. నన్నే కాదు ఎంతో మంది అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సంఘటన మొదట్లో ఆడపిల్లలను బయటికి పంపాలంటేనే కుటుంబ సభ్యులు బెంబేలెత్తారు. ఆనాటి పోలీసుల చర్య రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో కొండంత విశ్వాసం నింపింది. మెల్లమెల్లగా ఈ ఘటన నుంచి కోలుకున్నా. ఐఐటీ నా కల ఎలాగైనా ఐఐటీ సాధించాలనే పట్టుదల నాలో ఉండేది. హైదరాబాద్‌లోని రామయ్య ఐఐటీ కోచింగ్ సెంటర్లో చేరాలనుకున్నా. అప్పటికే సీట్లు అయిపోవడంతో కుదరలేదు. అప్పుడు మేము చిత్తూరులో ఉన్నాం. పక్కనే ఉన్న నెల్లూరు పట్టణంలోని పేరున్న ఓ కోచింగ్ సెంటర్లో చేరేందుకు వెళ్లా. అక్కడ ఓ ఫ్యాకల్టీ నన్ను నిరుత్సాహానికి గురి చేశారు. ‘అబ్బాయిలకు మాత్రమే ఐఐటీలు సూటవుతాయి.. ఇంజినీరింగ్, సైన్స్ సబ్జెక్టుల్లో వాళ్లు మాత్రమే రాణిస్తారు. అమ్మాయిలు ఐఐటీలో సెట్ కాలేరు. వెళ్లి చక్కగా డిగ్రీ చదువుకో.’ అని ఆ లెక్చరర్ అనడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నా. నేను ఎదుర్కొన్న మొదటి వివక్ష అదే. ఎలాగైనా ఆ లెక్చరర్ అభిప్రాయం తప్పని నిరూపించాలనే కసితో కోచింగ్ తీసుకున్నా. కుటుంబ సభ్యులు కొండంత ధైర్యాన్ని ఇవ్వడంతో పట్టుదలతో ఐఐటీ సీటు సాధించా. ఆ తర్వాత ఆ లెక్చరర్ ఒకసారి కలిస్తే బాగుండేదనిపించింది. నాన్న సూచనలతో సివిల్స్ వైపు.. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరా. ఆ తర్వాత సైంటిస్ట్ కావాలనుకున్నా. నాన్న సూచనలతో సివిల్స్ వైపు మళ్లా. ఐఐటీ పూర్తి కాగానే హైదరాబాద్‌లోని ఆర్సీరెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేరా. మొదటి ప్రయత్నంలో సక్సెస్ సాధించలేకపోయా. వెరవకుండా పట్టుదలతో రెండో ప్రయత్నంలో ఐపీఎస్ ర్యాంక్ సాధించా. ఓ జ్ఞాపకం నేను చిత్తూరులో ఐదో తరగతి చదువుతున్నప్పుడనుకుంటా.. అప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకంగా మిగిలింది. మా టీచర్ హోంవర్క్ ఇచ్చారు. నాతోపాటు చాలామంది విద్యార్థులు చేయలేదు. టీచర్ నాకు తప్ప అందరికీ పనిష్మెంట్ ఇచ్చారు. ఓ విద్యార్థి లేచి ఆమెకు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించాడు. అప్పుడు టీచర్ ఆమెలా ఒకసారి నువ్వు క్లాస్ ఫస్ట్ రా.. ఇంక నీకెప్పుడు పనిష్మెంట్ ఇవ్వను అన్నారు. అది నాకు ఇప్పటికీ గుర్తుండి పోయింది. లాంగ్ టెన్నిస్.. స్విమ్మింగ్ నాకు లాంగ్ టెన్నిస్, స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. విద్యార్థి రోజులతోపాటు ఐపీఎస్ ట్రైనింగ్‌లో చాలా మెడల్స్ సాధించా. వాటితోపాటు కవితలు, కర్ణాటక సంగీతమంటే ప్రాణం. వీణ కూడా నేర్చుకున్నా. ఐఐటీ చదివే రోజుల్లో కల్చరల్ ఈవెంట్లలో ఉత్సాహంగా పాల్గొనేదాణ్ని. చిన్నప్పుడే మ్యాథ్స్ఒలింపియాడ్ వంటి ప్రతిభా పాటవ పోటీల్లో పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించా. వెజ్‌కే ప్రాధాన్యం నాకు వెజిటబుల్ ఆహారమంటేనే ఇష్టం. రైస్ ఇష్టముండదు.. కూరగాయలే తింటా. మొక్కజొన్న కంకి అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్లినప్పుడు రోడ్డ పక్కన కాలుçస్తుంటే.. ఆగి మరి కొంటా. సీజనల్‌గా వచ్చే పండ్లు తింటా. సహజ పద్ధతుల్లో పండించే పండ్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తా. హిల్ స్టేషన్లు సరదా నాకు కాలుష్యం లేని యూకే, లండన్, స్కాట్లాండ్ అంటే ఇష్టం. దేశంలో హిల్ స్టేషన్లంటే కూడా. డార్జిలింగ్, ఉత్తరాఖండ్, కశ్మీర్, గుర్గావ్ వంటి పలు ప్రాంతాల్లో తరచూ పర్యటించా. ప్రతి వేసవిలో ఎటైనా టూర్ వేసేవాళ్లం. వరుస ఎన్నికల నేపథ్యంలో ఈసారి కుదరలేదు. ‘ఫ్రెండ్లీ’ చాట్.. నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో నిత్యం చాట్ చేస్తారు. ఐఐటీ ఫ్రెండ్స్ అందరూ స్థిరపడ్డారు. చాలా మంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఒక చోట కలవడం కుదరని పరిస్థితి. త్వరలో యూకేలో గెట్ టుగెదర్ పెట్టాలనే యోచనలో ఉన్నాం. సెట్ అవుతుందో చూడాలి మరి. ఓ ప్రాణాన్ని బతికించడం సంతృప్తినిచ్చింది అప్పుడు నేను రంగారెడ్డి జిల్లాలో ఏఎస్పీగా ఉన్నా. సీఎం బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తుండగా వికారాబాద్ రూట్లో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ఓ వాహనం ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న వ్యక్తి చనిపోయాడని అక్కడున్న వారు భావించి 108 వాహనానికి కాల్ చేస్తున్నారు. నేను పోలీస్ వాహనం దిగి అక్కడికి వెళ్లా. ఆ వ్యక్తి ఛాతి పైకి, కిందికి వస్తున్నట్లు గమనించా. నా వాహనంలోనే వికారాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాం. అతడు బతకడంతో నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. జాబ్ డిటెయిల్స్ ఐపీఎస్ అయ్యాక మొదటగా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నల్లగొండలో పనిచేశా. ఆ తర్వాత తాండూరు ఏఎస్పీగా విధులు నిర్వర్తించా. అనంతరం నిజామాబాద్ ఓఎస్డీగా నియామకమయ్యా. ప్రస్తుతం మెదక్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. -
న్యాయం జరిగేలా చూడాలి
మెదక్ మున్సిపాలిటీ : ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ చందనాదీప్తి అధికారులను ఆదేశించారు.సోమవారం మెదక్‌లోని జిల్లా పోలీసుకార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మనోహరబాద్ మండలం కొండాపూర్ గ్రామానికిచెందిన జల్లి రామకృష్ణ తాను ప్రేమించుకొని 2018 మే24న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నామని, దీంతో మా కుటుంబ పెద్దలు నా భర్తను చంపేస్తామని బెదిరిస్తున్నారని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ గ్రామానికిచెందిన దాసరి హైమావతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అలాగే తన భర్త పరమేష్ ప్రతిరోజు మద్యం తాగివచ్చి కొడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మెదక్ మండలం అవుసుపల్లి గ్రామం బొల్లారం తండాకు చెందిన బానోత్‌రాణి ఫిర్యాదు చేసింది. మా సొంత వ్యవసాయ భూమిని గొల్ల కంచన్‌పల్లి నర్సింలు అనే తనకు తెలియకుండా ట్రాక్టర్‌తో దున్నాడని, ఈ విషయంలో అతన్ని ప్రశ్నించగా గ్రామ పెద్ద సమక్షంలో విచారణ చేస్తుండగా నా కొడుకులను నర్సింలు,యాదయ్య, మహేష్ అనే వ్యక్తులు దాడిచేసి గాయపర్చారని, న్యాయం చేయాలంటూ శివ్వంపేట మండలం దంతాన్పల్లి గ్రామానికి చెందిన గొల్ల పెంటయ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చట్టపరమైన విషయంలో న్యాయం జరగకుంటే ఫిర్యాదుదారులు తిరిగి తనను సంప్రదించవచ్చన్నారు. -
అమ్మాయిలూ.. కారంపొడి తీసుకెళ్లండి..!
తాండూరు (రంగారెడ్డి జిల్లా): పోకిరీల నుంచి తనను రక్షించుకునేందుకు ఆడపిల్లలు బయటకు వెళ్లేముందు వెంట కారంపొడిని తీసుకువెళ్లాలని తాండూరు ఏఎస్పీ చందనదీప్తి సూచించారు. పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్యూఐ నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేష్‌చారి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ కార్యక్రమానికి ఏఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో అమ్మాయిలు, మహిళలు బయటకు వెళ్లేముందు కారంపొడి లాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే మహిళలు,విద్యార్థినిలు వేధింపులకు పాల్పడే వారి నుంచి పోలీసులు వచ్చేలోపు రక్షించుకునే వీలుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. వేధింపులకు పాల్పడే వారికి మొదటిసారైతే కౌన్సెలింగ్ చేస్తామని.. రెండోసారి పట్టుపడితే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు. కళాశాలలు,పాఠశాలలు, ఉద్యోగాలకు వెళ్లే అమ్మాయిలు, మహిళలను తమ సొంత అమ్మ, చెల్లిగా భావించాలని చెప్పారు. మహిళల వేధింపుల విషయంలో చట్టాలు కఠినంగా ఉన్నాయని, అనవసరమైన విషయాల్లో తలదూర్చి జీవితాలు నాశనం చేసుకోవద్దని యువకులకు సూచించారు. ప్రభుత్వం ఈవ్‌టీజింగ్ నిర్మూలనకు 'షీ'టీమ్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. పోకిరిలు వేధిస్తున్న విషయాన్ని ధైర్యంగా 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయని చెప్పారు. కళాశాల చైర్మన్ ఎం.రమేష్ మాట్లాడుతూ సమస్య ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.