అమ్మాయిలూ.. కారంపొడి తీసుకెళ్లండి..!
తాండూరు (రంగారెడ్డి జిల్లా): పోకిరీల నుంచి తనను రక్షించుకునేందుకు ఆడపిల్లలు బయటకు వెళ్లేముందు వెంట కారంపొడిని తీసుకువెళ్లాలని తాండూరు ఏఎస్పీ చందనదీప్తి సూచించారు. పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌యూఐ నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకటేష్‌చారి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ కార్యక్రమానికి ఏఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో అమ్మాయిలు, మహిళలు బయటకు వెళ్లేముందు కారంపొడి లాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే మహిళలు,విద్యార్థినిలు వేధింపులకు పాల్పడే వారి నుంచి పోలీసులు వచ్చేలోపు రక్షించుకునే వీలుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. వేధింపులకు పాల్పడే వారికి మొదటిసారైతే కౌన్సెలింగ్ చేస్తామని.. రెండోసారి పట్టుపడితే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు.
కళాశాలలు,పాఠశాలలు, ఉద్యోగాలకు వెళ్లే అమ్మాయిలు, మహిళలను తమ సొంత అమ్మ, చెల్లిగా భావించాలని చెప్పారు. మహిళల వేధింపుల విషయంలో చట్టాలు కఠినంగా ఉన్నాయని, అనవసరమైన విషయాల్లో తలదూర్చి జీవితాలు నాశనం చేసుకోవద్దని యువకులకు సూచించారు. ప్రభుత్వం ఈవ్‌టీజింగ్ నిర్మూలనకు 'షీ'టీమ్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. పోకిరిలు వేధిస్తున్న విషయాన్ని ధైర్యంగా 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయని చెప్పారు. కళాశాల చైర్మన్ ఎం.రమేష్ మాట్లాడుతూ సమస్య ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.