'విశ్వాసం కల్పించే నాయకుడు కావాలి'
దిగ్విజయ్‌కు కాంగ్రెస్ నేతల నివేదన
సాక్షి, హైదరాబాద్: పార్టీలో అన్ని వర్గాలను సమన్వయపరుస్తూ, క్షేత్రస్థాయి శ్రేణుల్లో విశ్వాసం కల్పించే నాయకత్వం కావాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అధిష్టానానికి స్పష్టం చేశారు. బలహీన నాయకత్వం వల్లే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు నివేదించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై గురువారం పార్టీకి చెందిన నాలుగు బృందాల భేటీ జరిగింది.
ఇందులో దిగ్విజయ్‌తో పాటు ఏఐసీసీ నేత రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, ఉత్తమ్‌తో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఎన్నో ఇబ్బందులకు ఓర్చి తెలంగాణ ఇచ్చినా ఆ సానుకూలతతో ప్రజల నుంచి ఓట్లు రాబట్టుకోవడానికి అవసరమైన నాయకత్వం రాష్ట్రంలో లేకుండా పోయిందని కొందరు నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఏ రోజుకారోజు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోగలిగే నాయకుడు కావాలి. తెలంగాణలో ఇప్పుడున్న నాయకులంతా 70 ఏళ్లకు దగ్గరగా ఉన్నవాళ్లే. ప్రజల్లోకి దూసుకుపోగలిగే నాయకుడైతేనే శ్రేణుల్లో విశ్వాసం పెరుగుతుంది.
అందుకోసం పార్టీలోని అన్నివర్గాలను సమన్వయం చేసుకుంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే నాయకుడు కావాలి. యువ నాయకత్వానికి పార్టీని అప్పగిస్తే తాత్కాలికంగా కొంతకాలం గ్రూపు రాజకీయాలతో ఇబ్బందులు రావొచ్చు. కానీ దీర్ఘకాలికంగా పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెరుగుతుంది..’’ అని దిగ్విజయ్ సింగ్‌కు నాయకులు నివేదించారు. తెలంగాణవ్యాప్తంగా విస్తృత అభిప్రాయాలను సేకరిస్తున్నప్పుడు మహిళా నేతలపై వివక్ష చూపారని కొందరు మహిళా కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. కాగా.. ఒక కుటుంబంలో ఒక్కరికే పదవి అని చెప్పి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంట్లో ఇద్దరికి ఎలా పదవులను ఇచ్చారని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేత జ్ఞానసుందర్ ప్రశ్నించారు. టీపీసీసీలో పొన్నాల, ఉత్తమ్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారేమిటని ప్రశ్నిస్తే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
కాంగ్రెస్‌లో క్రమశిక్షణకే ప్రాధాన్యం
పార్టీలో క్రమశిక్షణపై కఠినంగా ఉంటామని కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి, పార్టీ అధ్యక్షునికి వ్యతిరేకంగా ఎంతటివారు మాట్లాడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వందలాది హామీల్లో ఏ ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆరే స్వయంగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కాగా, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలపై అన్ని వర్గాల అభిప్రాయాలను ఫిబ్రవరి నెలాఖరు వరకు తీసుకుంటామని దిగ్విజయ్‌సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ అభిప్రాయాలను క్రోడీకరించి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అందిస్తామన్నారు.