కొత్తకోటలో రూ. కోటి..లూటీ!
సాక్షి, కొత్తకోట : అందమైన సోఫాలు, మంచాలు, డైనింగ్ టేబుళ్లు, డ్రెస్సింగ్ టేబుల్స్, ఎల్ఈడీ టీవీలు, ప్రీజ్లు, వాషింగ్ మిషన్స్, మొబైల్ ఫోన్స్, మిక్సీలు, స్టీల్ ఫర్నీచర్, వుడెన్ ఫర్నిచర్, ఎలక్ట్రీకల్, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులు సగం ధరకే కావాలా.. ఇంకెందుకు ఆలస్యం రండి కొత్తకోటకు అంటూ విస్తృత ప్రచారం జరిగింది.
ముందు డబ్బు చెల్లించి వారం తర్వాత వచ్చిన బుక్ చేసిన వస్తువు తీసుకెళ్లండి. అంటూ నమ్మబలికారు. సుమారు కోటి రూపాయలకు పైగా పోగుచేసి ఓ వ్యాపారి పరారైన సంఘటన మంగళవారం కొత్తకోటలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెలితే.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏ.రాజన్ అనే వ్యక్తి గత నెల 19వ తేదీన కొత్తకోటలోని కర్నూల్ రోడ్డులో ఓ అందమైన భవంతిలో సత్య హోమ్ నీడ్స్ పేరిట షోరూంను ప్రారంభించాడు. మొదట వాయిదాల పద్ధతిలో ఫర్నీచర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకోవచ్చని ప్రచారం చేశాడు. ఈ క్రమంలోనే షోరూంలో కొన్ని అందమైన సోఫాసెట్లు, మంచాలు, డైనింగ్ టేబుల్స్, ఎలక్టికల్ వస్తువులు ఉంచాడు.
వాటిపై ఎంఆర్పీ ధరలు సూచిస్తూ.. షాప్ ప్రారంభం సందర్బంగా వాటిని సగం ధరలకే ఇస్తున్నట్లు నమ్మబలికాడు. దీంతో మొదట్లో కొందరికి సగం ధరలకే వాటిని అందజేశాడు. ఈ విషయం ఆ నోట.. ఈ నోట పడటంతో జనం వాటిని కొనుక్కునేందుకు క్యూ కట్టారు. కాగా మొదట వస్తువులో సగం డబ్బులు ముందుగా.. చెల్లించిన వారికి వారం, పది రోజుల తరువాత వస్తువు తెచ్చి ఇస్తానంటూ రశీదులు ఇచ్చాడు.
దీంతో వ్యాపారి మాటలు నమ్మిన జనం సుమారు 200లకు పైగా ఒక్కక్కరూ రూ. 2 వేల నుంచి రూ 2 లక్షల వరకు చెల్లించి రశీదులు తీసుకున్నారు. వీరిలో కొందరు పోలీసులు కూడా ఉండటం విశేషం. కాగా ఈ నెల ఒక్క ఆదివారం రోజే రూ. 50 లక్షలకు పైగా జనం డబ్బులు కట్టినట్లు తెలుస్తోంది.
విచారించిన ఎస్ఐ
వందల కొద్దీ జనం డబ్బులు కడుతున్నట్లు తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రవికాంత్‌రావు తన సిబ్బందితో కలిసి ఈ నెల 2న సాయంత్రం సత్య హోం నీడ్స్ వద్దకు వెళ్లి షాపు యజమానిని విచారించారు. పోలీసులు షాపు వద్దకు వచ్చి విచారించండంతో బాధితులు ఒక్క సారిగా షాపు వద్ద గుమిగూడారు.
దీంతో షాపు యజమానిపై అనుమానం వచ్చి తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు పట్టుపట్టారు. దీంతో విలువైన వస్తువులు సగం ధరలకు ఎక్కడా లభించవని.. ఇలాంటి వాటిని నమ్మకూడదని.. కట్టిన డబ్బులు మీకు ఇప్పిస్తానని ఎస్ఐ రవికాంత్‌రావు జనంతో చెప్పారు. అప్పటికప్పుడే కౌంటర్లో ఉన్న డబ్బును అక్కడే ఉన్న కొంత మందికి ఇప్పించినట్లు తెలిసింది.
ఉడాయించిన వ్యాపారి
ఎస్ఐ రవికాంత్‌రావు వ్యాపారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించి పంపించాడు. దీంతో అప్రమత్తమైన వ్యాపారి సోమవారం నుంచి కనిపించకుండా పోయారు. బాధితులు మంగళవారం ఉదయం షాప్‌కు వెళ్లగా లేకపోవడంతో పరారైనట్లు గుర్తించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వ్యాపారిని మీరు తీసుకువచ్చి విచారించడం వల్లే అతను పరారయ్యాడని ఎస్ఐతో గొడవకు దిగారు. దీంతో నేను అతన్ని తీసుకురాకుంటే ఇంకేంతో మంది మోసపోయోవారని.. డబ్బులు కట్టిన వారు పిర్యాదు చేస్తే విచారణ చేసి డబ్బులు ఇప్పిస్తామని బాధితులకు సర్దిచెప్పారు అయినా వినిపించుపించుకోకుండా ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకుంటాం
బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకుండా వ్యాపారిని స్టేషన్లో ఉంచుకోలేము. వ్యాపారి వద్ద నుంచి అతనికి సంబంధించిన ఆధారాలు అన్ని సేకరించాం. ఎంత డబ్బు కట్టారన్నది ఇంకా లెక్కకట్టలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. వ్యాపారి ఎక్కడున్నా సరే పట్టుకుని డబ్బులు రికవరీ చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్‌రావు, సీఐ, కొత్తకోట
జనం మోసపోయారు
సగం రేట్లకే వస్తువులు ఇస్తున్నామంటూ ఓ వ్యాపారి ప్రచారం చేయడంతో జనం ఎగబడి డబ్బులు కడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. షాపు వద్దకు వెళ్లి విచారణ చేశాను. అప్పుడే కొందరికి డబ్బులు కూడా ఇప్పించాను. అక్కడే ఉంటే వ్యాపారిపై జనం తిరగబడతారని స్టేషనకు తీసుకువచ్చి విచారణ చేసి అతడి ఆధార్ కార్డు, పాన్‌కార్డు, బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నాను. బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ చేయించాను.
– రవి కాంత్రావు, ఎస్ఐ, కొత్తకోట
రూ. 70 వేలు కట్టాను
ఎల్టీడీ టీవీ, దివానా, సోఫాసెట్ కోసం రూ.70 వేలు కట్టాను. వ్యాపారి 10 రోజుల్లో ఇస్తానని రశీదు ఇచ్చాడు. మాకు తెలిసిన వారికి వస్తువులు ఇచ్చినందుకే నేను నమ్మి డబ్బు కట్టాను. ఎస్ఐ షాపు వద్దకు వచ్చి విచారణ చేయడం వల్లే వ్యాపారి పరారయ్యాడు. పోలీసులు వ్యాపారి పరారు కాకుండా చూస్తే బాగుండె.
– రాములు, బాధితుడు, కొత్తకోట
రూ.22 వేలు కట్టాను
ఇంట్లో ఉండే హోం నీడ్స్ కోసం రూ. 22 వేలు కట్టాను. అంతకుమందు మా పక్కింటి వారికి సగం రేట్లకే వస్తువులు ఇచ్చారు. పక్కింటి వారు చెప్పడం వల్లే నేను కట్టాను. నాతో పాటు మాకు తెలిసిన వారు కూడా రూ. 30 వేల వరకు కట్టారు. పోలీసులు తొందరగా అతన్ని పట్టుకొని మా డబ్బులు మాకు ఇప్పించాలి. – శివలీల, బాధితురాలు, కొత్తకోట