Cheating Boyfriend
-
పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు: సన్నీలియోన్
‘ఓ వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు’ అన్నారు బాలీవుడ్ నటి సన్నీలియోన్ . హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోని పలు చిత్రాల్లో ప్రత్యేక పాటలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. ‘కరెంట్ తీగ’(2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ ‘పీఎస్వీ గరుడవేగ’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె ‘రంగీలా’, ‘వీరమదేవి’, ‘కొటేషన్ గ్యాంగ్’, ‘షీరో’, ‘కోకా కోలా’, ‘యుఐ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా ‘స్ల్పీట్స్విల్లా’ అనే ఓ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు సన్ని. తాజాగా ఈ షోలో ఆమె మాట్లాడుతూ–‘‘కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తిని చాలా ప్రేమించాను. తన కూడా నన్ను ప్రేమించాడు. మా ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత ఏదో తప్పు జరుగుతోందని, అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనని నా మనసుకు అనిపించింది. దీంతో ‘నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా?’ అని ప్రశ్నిస్తే లేదన్నాడు. మరో రెండు నెలల్లో మా పెళ్లిని ప్లాన్ చేసుకున్నాం. హవాయి దీవుల్లో గ్రాండ్‌గా, జీవితాంతం గుర్తుండిపోయేలా వివాహం జరగాలని ప్లాన్ చేసుకున్నాం. ఇందుకోసం అన్నీ బుక్ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశాను. పైగా పెళ్లి షాపింగ్ కూడా అయిపోయింది. ఇలాంటి సమయంలో తను అలా చెప్పడంతో నా మనసు ముక్కలైంది.. ఎంతో బాధపడ్డాను. ఆ తర్వాత భగవంతుడు నా జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చాడు. డానియల్ వెబర్‌ను పరిచయం చేశాడు. నా తల్లితండ్రులు చనిపోయినప్పుడు తను ఎంతో అండగా నిలిచాడు. మా ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి (2011) చేసుకున్నాం. ఎప్పటికీ నా భర్త చేయి వదలను’’ అన్నారు. -
ఒకరితో పెళ్లి.. ఇంకొకరితో..
జయపురం : మన పురాణాల ప్రకారం స్త్రీని దేవతలా కొలిచే పుణ్యభూమి మనది, ఆడదంటే ఆదిపరాశక్తి అని నమ్మే కర్మభూమి మనది. అందుకే మన దేశంలో ఉత్తమ ఇల్లాలు అంటే కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభలా ఉండాలి అంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు భారత సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నాయి. సనాతన సాంప్రదాయాలకు నిలయమైన మనదేశంలో పాశ్చాత్య దేశాల సాంస్కృతి విస్తరిస్తోంది. సంప్రదాయం ప్రకారం అగ్ని సాక్షిగా జరిగే వివాహాన్ని కొందరు అవహేళన చేస్తున్నారు. వేదమంత్రాల మధ్య కట్టిన తాళిని ఎగతాళి చేస్తున్నారు. కొన్నిచోట్ల కట్టుకున్న భర్తే కాలయముడవుతుంటే ఈ విషయంలో తామేమి తక్కువ కాదనట్టు మహిళలు కూడా వ్యవహరిస్తున్నారు. ఒకరితో తాళి కట్టించుకుని అతడితో రెండు రోజులు గడిపి, ప్రేమించిన మరో వ్యక్తి చేయిపట్టుకొని అతడితో ఐదు దినాలు ఉండి, ఇంకొక వ్యక్తితో ఓ మహిళ జంప్ అయింది. ఇటువంటి సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం.. కథల్లో చదువుతూ ఉంటాం... కానీ కొరాపుట్‌లో ఇటువంటి సంఘటనే జరిగి ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. మన భారతీయ సాంప్రదాయంలో వివాహం అతి పవిత్రమైనది. తాళి కట్టిన భర్తతో నూరేళ్లు కలిసి ఉండి అటు పుట్టింటికి ఇటు మెట్టినింటికి పేరుతెచ్చేది వివాహిత. అందుకే మనం వివాహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. ఒక సారి మెడలో మూడు ముళ్లు పడితే ఆ బంధాన్ని తుంచేందుకు ఏ స్త్రీ సాహసించదు. అంతే కాదు తాళి బొట్టును ప్రాణం కన్నా మిన్నగా భావిస్తారు. తాళిబొట్టును ఎగతాళి చేసే మహిళలను సమాజం గౌరవించదు సరికదా ఆమెను అపవిత్రాలుగా పరిగణిస్తుంది. అటువంటిది ఒక మహిళ పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకొని అత్తవారి ఇంటిలో అడుగుపెట్టి తాళికట్టిన భర్తతో రెండు రోజులు గడిపింది. తర్వాత తాను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసి అతడి వెంట మరో ఏడగులు వేసింది. ఇతడితో కేవలం ఐదు రోజులు గడిపిన ఆమె మరో వ్యక్తితో జంప్ అయినట్టు కొరాపుట్ జిల్లాలో చర్చనీయమైంది. దీంతో పోలీసుల సమక్షంలో ఆమె మెడలో పూల దండ వేసి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన రెండవ భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక యువకుని సైకిల్ ఎక్కి వెళ్లిపోయినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? ఆమె మనసులో ఏముంది అనేది మాత్రం తెలియడంలేదు. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఎఫ్బీలో పరిచయం.. వాట్సాప్‌లో మోసం
సాక్షి, బనశంకరి : ఆన్లైన్లో పరిచయమైన యువతి చేతిలో ఓ వ్యక్తి మోసపోయిన ఘటన నగరంలో వెలుగుచూసింది. పేస్‌బుక్‌లో పరిచయమైన యువతితో నగరానికి చెందిన ఆనందరావ్ అనే వ్యక్తి చాట్ చేస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. ఈ స్నేహం కాస్తా వాట్సాప్ దాకా వెళ్లింది. సదరు యువతి ఇంగ్లాండ్ నుంచి బెంగళూరుకు వస్తున్నట్లు ఆనందరావ్కు మెసేజ్ చేసింది. కొద్దిసేపటి అనంతరం తాను ఢిల్లీ చేరుకున్నానని, విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ. లక్షన్నర ఇస్తే తనను వదిలిపెడతామని చెబుతున్నారని ఆనందరావ్తో అబద్దం చెప్పింది. ప్రియురాలు ఇబ్బందుల్లో ఉందని ఆనందరావు ఆమె అకౌంట్ కు రూ.లక్షా 5 వేల నగదు జమచేశాడు. నగదు ఖాతాకు జమ అయిన వెంటనే యువతి తన మొబైల్ స్విచ్చాఫ్ చేసుకుని అదృశ్యమైంది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన ఆనందరావ్ సదరు యువతిపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ప్రే‘ముంచాడు’!
► ప్రేమించి మోసపోయిన యువతి ► ప్రియుడి ఇంటి వద్ద బంధువులతో కలసి ఆందోళన ► తనకేమీ తెలియదంటున్న ప్రియుడు పూసపాటిరేగ: వరసకు బావ అవుతాడు.. ప్రేమగా నాలుగు మాటలు చెబితే పరవశించిపోయింది. ప్రేమించానంటే.. నమ్మి వెంట నడిచింది. సర్వమూ అర్పించింది. ఇలా వీరి ప్రేమకథ ఐదేళ్లపాటు సాగింది. పెళ్లి మాట ఆమె ఎప్పుడు అడిగినా.. ఇదిగో అదిగో అంటూ కాసేపు, ఉద్యోగమొచ్చాక చేసుకుంటానని మరోసారి తప్పించుకువచ్చాడు. చివరికి ఉద్యోగం వచ్చిన తర్వాత అతను ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి.. బావ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. మరికొన్ని గంటల్లో అతను వేరే పెళ్లికి సిద్ధం కావడంతో చేసేదిలేక శనివారం పోలీసులను ఆశ్రయించింది. మండలంలోని రెల్లివలసలో జరిగిన ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి మండలం చిట్టివలసకు చెందిన యువతి వాళ్లె నాగమణి, పూసపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన చందక రమణ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాగమణికి రమణ వరసకు బావ అవుతాడు. ‘ఉద్యోగం రాగానే నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఆర్మీలో ఉద్యోగం కోసం రూ.లక్ష కట్టాలి. ఉంటే సర్దుబాటు చేయు..’ అని అతను కోరడంతో ఆ మొత్తాన్ని ఆమె సమకూర్చింది. ఈ ఐదేళ్ల కాలంలో వీరు శారీరకంగానూ ఒక్కటయ్యారు. అయితే, ఇప్పుడు ఆమెను కాదని రమణ వేరే సంబంధం కుదుర్చుకున్నాడు. వేరే యువతితో శనివారం అతనికి వివాహం జరగనుందని తెలియడంతో.. నాగమణి బంధువులతో కలసి రెల్లివలస చేరుకుంది. ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. దీంతో సుమారు రెండుగంటలపాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంత జరిగినా ప్రియుడు రమణ మాత్రం బయటకు రాలేదు. దీంతో నాగమణి పూసపాటిరేగ పోలీసులను ఆశ్రయించింది. ఇదే విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న చందక రమణ విలేకరులతో మాట్లాడుతూ.. డబ్బుల కోసమే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపాడు. శారీరకంగా కలవడం అవాస్తవమని, తాను ఎటువంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.