రెండవ భర్తతో మహిళ
జయపురం : మన పురాణాల ప్రకారం స్త్రీని దేవతలా కొలిచే పుణ్యభూమి మనది, ఆడదంటే ఆదిపరాశక్తి అని నమ్మే కర్మభూమి మనది. అందుకే మన దేశంలో ఉత్తమ ఇల్లాలు అంటే కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభలా ఉండాలి అంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు భారత సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నాయి.
సనాతన సాంప్రదాయాలకు నిలయమైన మనదేశంలో పాశ్చాత్య దేశాల సాంస్కృతి విస్తరిస్తోంది. సంప్రదాయం ప్రకారం అగ్ని సాక్షిగా జరిగే వివాహాన్ని కొందరు అవహేళన చేస్తున్నారు. వేదమంత్రాల మధ్య కట్టిన తాళిని ఎగతాళి చేస్తున్నారు. కొన్నిచోట్ల కట్టుకున్న భర్తే కాలయముడవుతుంటే ఈ విషయంలో తామేమి తక్కువ కాదనట్టు మహిళలు కూడా వ్యవహరిస్తున్నారు.
ఒకరితో తాళి కట్టించుకుని అతడితో రెండు రోజులు గడిపి, ప్రేమించిన మరో వ్యక్తి చేయిపట్టుకొని అతడితో ఐదు దినాలు ఉండి, ఇంకొక వ్యక్తితో ఓ మహిళ జంప్ అయింది. ఇటువంటి సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం.. కథల్లో చదువుతూ ఉంటాం... కానీ కొరాపుట్‌లో ఇటువంటి సంఘటనే జరిగి ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.
మన భారతీయ సాంప్రదాయంలో వివాహం అతి పవిత్రమైనది. తాళి కట్టిన భర్తతో నూరేళ్లు కలిసి ఉండి అటు పుట్టింటికి ఇటు మెట్టినింటికి పేరుతెచ్చేది వివాహిత. అందుకే మనం వివాహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. ఒక సారి మెడలో మూడు ముళ్లు పడితే ఆ బంధాన్ని తుంచేందుకు ఏ స్త్రీ సాహసించదు.
అంతే కాదు తాళి బొట్టును ప్రాణం కన్నా మిన్నగా భావిస్తారు. తాళిబొట్టును ఎగతాళి చేసే మహిళలను సమాజం గౌరవించదు సరికదా ఆమెను అపవిత్రాలుగా పరిగణిస్తుంది. అటువంటిది ఒక మహిళ పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకొని అత్తవారి ఇంటిలో అడుగుపెట్టి తాళికట్టిన భర్తతో రెండు రోజులు గడిపింది.
తర్వాత తాను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసి అతడి వెంట మరో ఏడగులు వేసింది. ఇతడితో కేవలం ఐదు రోజులు గడిపిన ఆమె మరో వ్యక్తితో జంప్ అయినట్టు కొరాపుట్ జిల్లాలో చర్చనీయమైంది.
దీంతో పోలీసుల సమక్షంలో ఆమె మెడలో పూల దండ వేసి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన రెండవ భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక యువకుని సైకిల్ ఎక్కి వెళ్లిపోయినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు.
అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? ఆమె మనసులో ఏముంది అనేది మాత్రం తెలియడంలేదు. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment