పోలీస్‌స్టేషన్‌లో ప్రియుడిని పెళ్లి చేసుకుంటున్న శ్యామలేశ్వరి
ప్రేమబంధం ముందు వివాహ బంధం వెలవెలబోయింది. కట్నకానుకలు ఇచ్చి సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసిన తల్లిదండ్రుల మాటను ఆ యువతి కాదంది. వివాహమైన రెండు రోజులకే తన ప్రేమ వ్యవహారం భర్తతో చెప్పింది.
దీంతో అవాక్కయిన భర్త కూడా రెండు రోజుల పెళ్లి బంధానికి స్వస్తి చెప్పి ఆమెకు స్వేచ్ఛ కల్పించాడు. పెళ్లి బంధం తెంచుకున్న ఆ యువతి పోలీసుల సమక్షంలో ప్రియుడిని వివాహమాడింది.
జయపురం: ఫేస్‌బుక్‌లో పరిచయమై ప్రేమలో పడిన ఓ యువతి..తల్లిదండ్రులు చూసిన యువకుడిని పెళ్లి చేసుకుని రెండురోజులకే ఆ వివాహానికి స్వస్తి చెప్పింది. తరువాత ఫేస్‌బుక్ ప్రియుడితో పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఉదంతం కొరాపుట్ జిల్లా నందపూర్ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.
వివరాలు ఇలా ఉన్నాయి. నందపూర్ సమితిలోని పాడువ పోలీస్‌స్టేషన్ పరిధి బింజిలపుట్ గ్రామానికి చెందిన సురేష్ పట్నాయక్ కుమార్తె శ్యామలేశ్వరి పట్నాయక్‌ను పొట్టంగి సమితిలోని మొహొకుమార్ గ్రామానికి గౌరంగ పట్నాయక్ కుమారుడు భవానీ శంకర పట్నాయక్‌కు ఇచ్చి ఈ నెల 2వ తేదీన వివాహం జరిపించారు.
భర్తతో అత్తవారింటికి చేరిన శ్యామలేశ్వరి రెండు రోజులు అత్తవారింటిలో ఉండి తనకు ఈ వివాహం ఇష్టం లేదని తేల్చిచెప్పింది. తాను మరో యువకుడిని ప్రేమిస్తున్నానని భర్తకు తెలిపింది.
ఈ మాటతో కంగుతిన్న భర్త భవానీ శంకర పటాయక్ వెంటనే అత్త మామలను పిలిపించి శ్యామలేశ్వరి తనకు చెప్పిన విషయం విన్నవించి మీ కుమార్తెను తీసుకుపొమ్మని స్పష్టం చేశాడు.
కుమార్తె కూడా తనకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని తల్లి దండ్రులకు తెలపడంతో మరో మార్గం లేక వారు ఆమెను, ఆమెతో పంపిన కట్న కానుకలను తీసుకుని ఇంటికి వెళ్లి పోయారు. ఇంటికి చేరిన తరువాత శ్యామలేశ్వరి తన పూర్వ ప్రియుడు మనోతోష్‌ను వివాహమాడతానని తల్లిదండ్రులతో చెప్పింది.
మరోమార్గం లేక వారు అంగీకరించారు. ప్రియుడు మనోతోష్‌తో కలిసి నందపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వివాహం చేసుకుంటామని ఆమె తల్లిదండ్రులతో చెప్పి వెళ్లింది. ఇద్దరు మేజర్లు కాబట్టి వారికి నందపూర్ పోలీసులు గురువారం దండలు మార్చి వివాహం జరిపించారు.
ఈ వివాహ కార్యక్రమంలో సబ్‌డివిజనల్ పోలీసు అధికారి తపన కుమార్ మహానంద, నందపూర్ పోలీసు అధికారి చంద్రశేఖర శబర, సబ్‌ఇన్‌స్పెక్టర్ జలంధర శెట్టి, ఏఎస్‌ఐ దీపక్ కుమార్ నాయక్‌ల తో పాటు పోలీసు సిబ్బంది, పెద్దలు పా ల్గొన్నారు. పెళ్లి అయిన రెండు రోజులకే భర్తను విడిచి ప్రియుడిని పెళ్లి చేసుకున్న విషయమై ప్రజలు విస్తతంగా చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment