సాక్షి, బనశంకరి : ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతి చేతిలో ఓ వ్యక్తి మోసపోయిన ఘటన నగరంలో వెలుగుచూసింది. పేస్‌బుక్‌లో పరిచయమైన యువతితో నగరానికి చెందిన ఆనందరావ్ అనే వ్యక్తి చాట్ చేస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. ఈ స్నేహం కాస్తా వాట్సాప్ దాకా వెళ్లింది. సదరు యువతి ఇంగ్లాండ్ నుంచి బెంగళూరుకు వస్తున్నట్లు ఆనందరావ్‌కు మెసేజ్ చేసింది. కొద్దిసేపటి అనంతరం తాను ఢిల్లీ చేరుకున్నానని, విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ. లక్షన్నర ఇస్తే తనను వదిలిపెడతామని చెబుతున్నారని ఆనందరావ్‌తో అబద్దం చెప్పింది. ప్రియురాలు ఇబ్బందుల్లో ఉందని ఆనందరావు ఆమె అకౌంట్ కు రూ.లక్షా 5 వేల నగదు జమచేశాడు. నగదు ఖాతాకు జమ అయిన వెంటనే యువతి తన మొబైల్ స్విచ్చాఫ్ చేసుకుని అదృశ్యమైంది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన ఆనందరావ్ సదరు యువతిపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.