Chemists
-
కోర్టుల ముందుకు కెమిస్ట్ ల రగడ
న్యూఢిల్లీ : రిటైల్ మందుల దుకాణాలకు, ఆన్ లైన్ ఫార్మసీలకు మధ్య రగడ ప్రస్తుతం కోర్టుల గడప తొక్కనుంది. ఆన్ లైన్ ఫార్మసీలు కొనసాగిస్తున్న అక్రమ మందుల అమ్మకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ..ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్(ఏఐఓసీడీ) దేశంలోని పది హైకోర్టులను ఆశ్రయించనుంది. అయితే ఈ యుద్ధానికి తాము కూడా సై అంటున్నట్టు ఆన్ లైన్ దుకాణాల వైఖరి కనిపిస్తోంది. ఆన్ లైన్ లో మందుల అమ్మకాలు నిరసిస్తూ రిటైల్ దుకాణాలు దేశవ్యాప్తంగా నిరవధిక బంద్ కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ఫార్మసీలు భారత్ లో అక్రమంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని, ప్రజల ఆరోగ్యంపై నష్టం వాటిల్లే ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర డ్రగ్ అథారిటీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఏఐఓసీడీ జనరల్ సెక్రటరీ సురేష్ గుప్తా ఆరోపించారు. ప్రస్తుతమున్న డ్రగ్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్(1940) ఆన్ లైన్ ఫార్మసీలు మందుల అమ్మకానికి అనుమతించదని ఆయన అన్నారు. చట్టాలను కొట్టిపారేసి ఆన్ లైన్ మందుల దుకాణాలు మెడిసిన్లను విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. చట్టాలు అనుమతించకుండా అమ్మకాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి స్పందన లేకుండా చోద్యం చూస్తున్నట్టు ఉన్నాయన్నారు. ఇది పేషెంట్ల ఆరోగ్యానికి హానికరం కలిగించడంతో పాటు... ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు పెరిగిపోతాయని, నిషేధిత మందులు కూడా జోరుగా అమ్మకాలు జరిగే ప్రమాదముందని వెల్లడించారు. 10 రాష్ట్రాల హైకోర్టులను తాము ఆశ్రయిస్తామని, ఈ సమస్యపై పరిష్కారం కోసం కోర్టులోనే పోరాడతామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంద్రప్రదేశ్ హైకోర్టులలో త్వరలోనే పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు తెలిపారు. మరోవైపు తాము చట్టాలకు అనుగుణంగానే అమ్మకాలు నిర్వహిస్తున్నామని ఆన్ లైన్ ఫార్మసీలు చెబుతున్నాయి. -
చనిపోతుంటే ఏమౌతుంది?
మానవ శరీర నిర్మాణం ఒక్కోసారి సైన్స్‌కు కూడ అందనట్టుగా కనిపిస్తుంది. అద్భుతమైన, ఆశ్చర్యమైన ఎన్నో విషయాలను తెలుపుతుంది. ఎన్ని పరిశోధనలు జరిపినా ఇంకా ఏదో కొత్త అంశం వెలుగులోకి వస్తూనే ఉంటుంది. అయితే శరీరంలో అతి ముఖ్యమైన భాగంగా, ఆలోచనా శక్తినిచ్చే మెదడు నిర్మాణం, పనిచేసే తీరు చూస్తే నిజంగా ఓ అద్భుతమే అనిపిస్తుంది. అటువంటి బ్రెయిన్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ అంతుపట్టదనుకుంటాం. కానీ చనిపోయే సందర్భాల్లోనూ... భయంకరమైన సన్నివేశాన్ని ఎదుర్కొన్నప్పుడు మెదడు పనిచేసే తీరు ఎలా ఉంటుందో ఇప్పుడు అమెరికన్ కెమికల్ సొసైటీ విడుదల చేసిన వీడియో చెప్తోంది. భయానక సన్నివేశాలున్న చిత్రాలు చూసినప్పుడు... రియల్ లైఫ్ లో భయంకరమైన సంఘటనను దర్శించినప్పుడు.. ముందుగా ఎంతో భయపడిపోతారు. ఆ తర్వాత ఆ సందర్శాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తారు. లేదంటే దానికి దూరంగా అక్కడినుంచీ పారిపోతారు. అటువంటి భయాన్నిమెదడులోని భాగమైన థలామస్ నియంత్రిస్తుంటుందట. మెదడు కణాల్లోని క్లస్టర్ ద్వారా ఈ ఫీలింగ్ ను నియంత్రించవచ్చునని వీడియోలోని వివరాలద్వారా తెలుస్తోంది. మెదడులోని థలామస్ ప్రాంతం ఎంతో సున్నితంగా ఉంటుంది. మానసిక, శారీరక ఉద్రిక్తతలకు సెన్సార్ లా పనిచేస్తుంటుంది. ఇక్కడి పెరియాక్వడక్టల్ గ్రే ప్రాంతానికి ఏదైనా సిగ్నల్స్ చేరుకున్నపుడు ఇది ఓ స్విచ్ లా పనిచేస్తుంటుందని వీడియో చెప్తోంది. ఒత్తిడి, భయంకరమైన సందర్భాల్లో మెదడులోని అడ్రినల్ గ్రంథులు స్పందించి అడ్రినాలిన్ ను బయటకు తోస్తాయి. ఈ చర్యవల్ల ఉలికిపాటు కలిగి.. బ్రెయిన్ లో తక్షణ స్పందన ప్రారంభమౌతుంది. దీంతో గుండె కొట్టుకోవడంలో స్పీడ్ పెరుగుతుంది. ఆలోచనలు చురుకుగా వస్తాయి. ఈ క్రమంలో భారీ మొత్తంలో శక్తి బయటకు వస్తుంది. ఇది ఆయా సందర్భాలను ఎదుర్కొనేలా, తట్టుకునేలా చేస్తుంది. ఇటువంటి సమయాల్లో ఒత్తిడి తీవ్రంగా ఉంటే... మెదడు మొద్దుబారిపోతుంటుంది. జరగబోయే హానిని అంచనా వేసి ఆ పరిస్థితినుంచీ తప్పించే ప్రయత్నం చేస్తుంది. దీంతో మీపై జరగబోయే దాడిని గుర్తించడం, హంతకులనుంచీ దూరంగా వెళ్ళేందుకు మనకు తెలియకుండానే ప్రయత్నం చేస్తుంటాం. ఇటువంటి సమయంలో మనకు తెలియకుండానే అరుపులు, కేకలు వేస్తుంటాం. ఈ సౌండ్ ఎమిగ్దాల అనే భాగం ద్వారా మెదడును అలెర్ట్ చేస్తుంది. సాధారణ సమయంలో మాట్లాడే మాటలు చెవులనుంచీ మెదడుకు చేరుతాయి. కానీ ఇటువంటి ఒత్తిడి సందర్భంలో 'ఎమిగ్దాల' మెదడుయొక్క ఎమర్జన్సీ సెంటర్ లా పనిచేస్తుంది. ఈ సయంలో స్వభావసిద్ధంగా వచ్చే అరుపులు ఎదుటివారిని కూడ భయపెట్టి.. వారు ప్రతిస్పందించడానికి కారణంగా మారతాయి. కేవలం సన్నివేశాన్ని చూసినప్పటికన్నా... గాయపడినప్పుడు నోసిసెప్టార్ గా పిలిచే న్యూరాన్లు మెదడుకు వెంటనే సందేశాన్ని పంపుతాయి. అంతేకాదు అటువంటి గాయాన్ని తగ్గించడంలో కూడ మళ్ళీ మెదడు ప్రభావం ఎంతగానో ఉంటుంది. ఇదంతా థలామస్ ద్వారా జరుగుతుంది. ''సో నౌ యు ఆర్ డెడ్ ఆన్ ద ఫ్లోర్'' అంటూ కెమికల్ సొసైటీ విడుదల చేసిన వీడియో ఎన్నో విషయాలను చెప్తోంది. క్లినికల్లీ చనిపోయారని మీరు భావిస్తున్నపుడు.. మెదడుకు భారీగా గాయం తగిలినట్లు ఊహించినప్పటికీ మెదడు మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. మనిషి స్పృహతో మెదడుకు సంబంధం ఉండదని, చివరి క్షణం వరకూ పనిచేస్తూనే ఉంటుందని ఇటీవలి అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అయితే కొందరు ఇటువంటి అనుభవాలను మృత్యువుకు సమీపంగా వెళ్ళినట్లుగా నమ్ముతారని, కొందరు చనిపోవడం తమకు తెలిసినట్లుగా చెప్తారని అమెరికన్ కెమికల్ సొసైటీ వీడియో వివరిస్తోంది. చెడు జ్ఞాపకాలను చెరిపేసే పసుపు.. సాధారణంగా కూరల్లో వాడే మసాలాలు... ముఖ్యంగా పసుపు... మెదడులోని చెడు జ్ఞాపకాలను చెరిపేసేందుకు ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇండియాలో పూర్వ కాలంనుంచీ ఓ ఔషధంగా కూడ వాడే పసుపు భయాన్ని దరిచేరనివ్వకుండా చేయడమే కాక... మెదడులో స్థిరపడిన దాన్ని కూడ తరిమి కొడుతుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే మానసిక వ్యాధులతో బాధపడే వారికి చికిత్స అందించేందుకు పసుపు సహాయపడుతుందని భావిస్తున్నారు. న్యూయార్క్ సిటీ విశ్వవిద్యాలయం సైకాలజిస్టులు.. ఎలుకలపై చేసిన ప్రయోగం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు. ప్రొఫెసర్ గ్లెన్ ఛాఫే జరిపిన ఈ అధ్యయనం ద్వారా.. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ సహా... ఇతర మానసిక రుగ్మతలతో బాధపడే వారికి ఇచ్చే ఆహారంలో పసుపు వాడకం కూడ ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. -
వారం రోజుల బంద్‌కూ వెనకాడం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో మందుల విక్రయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సఫలీకృతం కాకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ మందుల షాపుల బంద్‌కు పిలుపునిస్తామని ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పేర్కొంది. ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోటిలోని తమ కార్యాలయంలో ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ చంద్రగుప్తా, ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.శ్రీరాములు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆన్లైన్లో మందుల విక్రయాలు ప్రజలకు తీవ్ర నష్టం చేస్తాయని, దీనివల్ల నిషేధిత మందుల విక్రయాలు తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. పైగా నిద్ర మాత్రలు కూడా ఎక్కువగా విక్రయాలు అయ్యే అవకాశం ఉందని, అర్హత కలిగిన డాక్టర్ని సంప్రదించకుండా మందులను వాడటం జాతికే నష్టమన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ లో మందుల విక్రయాలను ఆపోలో ఆపేసిందని, కేవలం మెడ్‌ప్లస్ మాత్రమే విక్రయిస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా మందుల వ్యాపారులు ఉండగా, వారిపై ఆధారపడిన వారు మరో 1.20 కోట్ల మంది ఉన్నారన్నారు. వీళ్లందరూ నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని చెప్పారు. జాతీయ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని, చర్చలు సఫలమవుతాయని ఆశిస్తున్నామన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే మందుల షాపులు 3 రోజులు, ఆ పైన వారం రోజుల బంద్‌కు వెనుకాడమని స్పష్టం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 40వేలకు పైగా మందుల షాపులు ఉన్నాయని, హైదరాబాద్ నగరంలోనే 6వేలకు పైగా ఫార్మసీ షాపులున్నట్టు చెప్పారు. బుధవారం జరిగిన మందుల షాపుల బంద్ విజయవంతమైందన్నారు. అక్టోబర్ 14న నిర్వహించిన బంద్‌కు నెలరోజుల ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చినట్టు ప్రతినిధులు చెప్పారు.