సాక్షి, హైదరాబాద్:
ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సఫలీకృతం కాకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ మందుల షాపుల బంద్‌కు పిలుపునిస్తామని ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పేర్కొంది. ఆన్‌లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోటిలోని తమ కార్యాలయంలో ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ చంద్రగుప్తా, ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.శ్రీరాములు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు ప్రజలకు తీవ్ర నష్టం చేస్తాయని, దీనివల్ల నిషేధిత మందుల విక్రయాలు తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. పైగా నిద్ర మాత్రలు కూడా ఎక్కువగా విక్రయాలు అయ్యే అవకాశం ఉందని, అర్హత కలిగిన డాక్టర్‌ని సంప్రదించకుండా మందులను వాడటం జాతికే నష్టమన్నారు.
ప్రస్తుతం ఆన్‌లైన్ లో మందుల విక్రయాలను ఆపోలో ఆపేసిందని, కేవలం మెడ్‌ప్లస్ మాత్రమే విక్రయిస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా మందుల వ్యాపారులు ఉండగా, వారిపై ఆధారపడిన వారు మరో 1.20 కోట్ల మంది ఉన్నారన్నారు. వీళ్లందరూ నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని చెప్పారు. జాతీయ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని, చర్చలు సఫలమవుతాయని ఆశిస్తున్నామన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే మందుల షాపులు 3 రోజులు, ఆ పైన వారం రోజుల బంద్‌కు వెనుకాడమని స్పష్టం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 40వేలకు పైగా మందుల షాపులు ఉన్నాయని, హైదరాబాద్ నగరంలోనే 6వేలకు పైగా ఫార్మసీ షాపులున్నట్టు చెప్పారు. బుధవారం జరిగిన మందుల షాపుల బంద్ విజయవంతమైందన్నారు. అక్టోబర్ 14న నిర్వహించిన బంద్‌కు నెలరోజుల ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చినట్టు ప్రతినిధులు చెప్పారు.