cheque bounce cases
-
దేశంలో పెరిగిపోతున్న చెక్ బౌన్స్ కేసులు, కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులు దేశంలో భారీగా పెరిగిపోతుండడంపై దీనిని కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో నేరస్తులపై కఠిన చర్యలకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం, చెక్ జారీ చేసిన అకౌంట్ నుంచే డబ్బు డెబిట్ కావాల్సి ఉంది. అయితే ఈ నిబంధనలను సవరించాలన్న సూచనలు వస్తున్నాయి. అత్యున్నత స్థాయి వర్గాలు ఈ మేరకు తెలిపిన సమాచారం ప్రకారం, ఇటీవల ఈ సమస్యపై ఆర్థిక శాఖ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణుల నుంచి పలు ప్రతిపాదనలు, సూచనలు అందాయి. వీటిలో ప్రధానమైనవి చూస్తే... ► చెక్కు జారీ చేసిన వ్యక్తి ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించి అకౌంట్లో నిధులు తక్కువగా ఉన్నట్లయితే అతని లేదా ఆమె మరొక ఖాతా నుండి చెక్ అమౌంట్ డెబిట్ చేయాలన్న ప్రతిపాదన ఇందులో ఒకటి. ► అలాగే నేరస్తులు కొత్త ఖాతాలను తెరవడాన్ని నిషేధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సూచనలు అందాయి. ► చెక్ బౌన్స్‌ను రుణ డిఫాల్ట్‌గా పరిగణించడం, నేరస్తుని స్కోర్‌ను అవసరమైనమేర డౌన్‌గ్రేడ్ చేయడం కోసం ఈ సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు నివేదించడం కూడా ప్రతిపాదనలో ఉంది. ఈ సూచనలను ఆమోదించే ముందు తగిన చట్టపరమైన సలహాలు తీసుకోవడం జరుగుతుందని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆయా చర్యలు, బ్యాంకింగ్ టెక్నాలజీ అభివృద్ధి ద్వారా చెక్ బౌన్స్ కేసులను సమర్థవంతంగా తగ్గించవచ్చన్నది నిపుణుల సూచన. దేశ వ్యాప్తంగా దాదాపు 35 లక్షల చెక్ బౌన్స్ కేసులు పెండింగులో ఉన్నాయి. -
మాల్యా కేసు మరోసారి వాయిదా
హైదరాబాద్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణను ఎర్రమంజిల్ కోర్టు వాయిదా వేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ జీఆర్ కిచ్చిన 50 లక్షల విలువచేసే రెండు చెల్లని చెక్కుల కేసును మంగళవారం విచారించిన స్పెషల్ కోర్టు మాజిస్ట్రేట్ ఎం కృష్ణారావు కేసు తదుపరి విరాణను సెప్టెంబర్ 22కి వాయిదా వేశారు. అలాగే జీఎంఆర్ కు చెందిన లీగల్ టీం మాల్యా కొత్త చిరునామాను ఈ రోజు కోర్టు ముందుంచింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ సీనియర్ అధికారి రఘునందన్ పై జారీ నాన్ బెయిలబుల్ వారెంట్ ను హౌకోర్టులో రీకాల్ చేసుకున్నారు. అయితే ఈ రీకాల్ చెల్లదని చెప్పిన కోర్టు ఇదే కోర్టు ఆవరణలో హాజరు కావాలని స్పష్టం చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. దీంతో రఘునాథన్ వ్యతిరేకంగా జారీ చేసిన వారంట్ ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న కారణంగా శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. కాగా బ్యాంకులకే కాకుండా మాల్యా జీఎంఆర్ సంస్థకూ టోకరా వేశాడు. శంషాబాదు ఎయిర్ పోర్టులో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల రాకపోకలకు సంబంధించి విజయ్ మాల్యా సంస్థ జీఎంఆర్ బకాయిల చెల్లింపుల పేరిట ఇచ్చిన రెండు చెక్కులు బౌన్సయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ హైదరాబాదు ఎర్రమంజిల్‌లోని ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన కోర్టు కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ సీనియర్ అధికారి రఘునాథన్ ఏప్రిల్ 20 న దోషిగా తేల్చిల్చింది. కానీ విజయ్ మాల్యా గైర్హాజరుతో మాల్యా పరోక్షంలో శిక్షను ఖరారు చేయలేమని చెప్పిన సంగతి తెలిసిందే. -
చెక్కు బౌన్స్ కేసులపై ఆర్డినెన్స్
చెక్కును సమర్పించిన బ్యాంక్ న్యాయపరిధిలోనే కేసుకు వెసులుబాటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్ఐ యాక్ట్ సవరణ దిశలో అడుగు 18 లక్షల మందికి ఊరట... న్యూఢిల్లీ: చెల్లింపులకు సంబంధించి, చెక్కును దాఖలుచేసిన బ్యాంక్ న్యాయ పరిధిలోనే ఫిర్యాదుదారు క్రిమినల్ కేసు దాఖలు చేయడానికి వీలుగా ఒక కీలక ఆర్డినెన్స్ జారీకి కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులను ఎదుర్కొంటున్న దాదాపు 18 లక్షల మందికి ఈ ఆర్డినెన్స్ ఊరట కలిగించే అంశం. నేపథ్యం... నెగోషియబుల్ ఇన్స్ట్రమెంట్ (ఎన్ఐ) యాక్ట్ ప్రకారం... జారీ అయిన చెక్కు బ్యాంక్ పరిధిలోనే ‘బౌన్స్’ కేసు దాఖలు చేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్ఐ యాక్ట్ సవరణ దిశలో కేంద్రం తొలిచర్యగా తాజా ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ ఆర్డినెన్స్ (మూడవసారి జారీచేసిన) తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఇది 14వ ఆర్డినెన్స్. ముఖ్యాంశాలు... చెల్లింపులు (క్లియరెన్స్) కోసం చెక్కు దాఖలు చేసిన బ్యాంకు న్యాయపరిధిలోనే ‘బౌన్స్’ కేసు దాఖలు చేయడానికి ఫిర్యాదుదారులకు వీలు కల్పి స్తూ కేంద్రం రూపొందించిన ఎన్ఐ యాక్ట్ సవరణ బిల్లు, 2015కు మే 13న లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడలేదు. దీనితో తాజా ఆర్డినెన్స్ అవసరమైంది. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా వేరువేరుచోట్ల మూడు చెక్ బౌన్సు కేసులు ఉంటే వాటిని ఒకే చోటకు తీసుకువచ్చి, సంయుక్తంగా విచారించడానికి సైతం తాజా ఆర్డినెన్స్ వీలు కల్పిస్తున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ విలేకరులకు తెలిపారు. ఎన్ఐ యాక్ట్‌కు సంబంధించి సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన సందర్భంగా జరిగిన చర్చలో తన సొంత బీజేపీ ఎంపీల నుంచే ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని కఠిన ప్రశ్నలను ఎదుర్కొనాల్సి వచ్చింది. సామాన్యుడిని వేధించడానికి కొన్ని కార్పొరేట్ సంస్థలు ‘ఈ తరహా చట్ట సవరణలను’ వినియోగించుకునే వీలుందని బీజేపీ ఎంపీలు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే చెక్కును జారీ చేసిన న్యాయపరిధిలోనే ‘బౌన్స్’ కేసు దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు డిఫాల్టర్లకు అయాచిత రక్షణ కల్పిస్తుందని, దీనివల్ల ఫిర్యాదుదారు అనవసర వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నట్లు ‘సవరణ బిల్లుకు సంబంధించి స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్’ వివరించింది. వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉండడం వల్ల, చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక, ఆర్థిక సంస్థలు సహా సంబంధిత వర్గాలు కోరినట్లు పేర్కొంది.