చెక్కు బౌన్స్ కేసులపై ఆర్డినెన్స్
చెక్కును సమర్పించిన బ్యాంక్ న్యాయపరిధిలోనే కేసుకు వెసులుబాటు
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో
ఎన్‌ఐ యాక్ట్ సవరణ దిశలో అడుగు
18 లక్షల మందికి ఊరట...
న్యూఢిల్లీ: చెల్లింపులకు సంబంధించి, చెక్కును దాఖలుచేసిన బ్యాంక్ న్యాయ పరిధిలోనే ఫిర్యాదుదారు క్రిమినల్ కేసు దాఖలు చేయడానికి వీలుగా ఒక కీలక ఆర్డినెన్స్ జారీకి కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులను ఎదుర్కొంటున్న దాదాపు 18 లక్షల మందికి ఈ ఆర్డినెన్స్ ఊరట కలిగించే అంశం.
నేపథ్యం...
నెగోషియబుల్ ఇన్‌స్ట్రమెంట్ (ఎన్‌ఐ) యాక్ట్ ప్రకారం... జారీ అయిన చెక్కు బ్యాంక్ పరిధిలోనే ‘బౌన్స్’ కేసు దాఖలు చేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐ యాక్ట్ సవరణ దిశలో కేంద్రం తొలిచర్యగా తాజా ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ ఆర్డినెన్స్ (మూడవసారి జారీచేసిన) తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఇది 14వ ఆర్డినెన్స్.
ముఖ్యాంశాలు...
చెల్లింపులు (క్లియరెన్స్) కోసం చెక్కు దాఖలు చేసిన బ్యాంకు న్యాయపరిధిలోనే ‘బౌన్స్’ కేసు దాఖలు చేయడానికి ఫిర్యాదుదారులకు వీలు కల్పి స్తూ కేంద్రం రూపొందించిన ఎన్‌ఐ యాక్ట్ సవరణ బిల్లు, 2015కు మే 13న లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడలేదు. దీనితో తాజా ఆర్డినెన్స్ అవసరమైంది.
ఒక వ్యక్తికి వ్యతిరేకంగా వేరువేరుచోట్ల మూడు చెక్ బౌన్సు కేసులు ఉంటే వాటిని ఒకే చోటకు తీసుకువచ్చి, సంయుక్తంగా విచారించడానికి సైతం తాజా ఆర్డినెన్స్ వీలు కల్పిస్తున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ విలేకరులకు తెలిపారు.
ఎన్‌ఐ యాక్ట్‌కు సంబంధించి సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన సందర్భంగా జరిగిన చర్చలో తన సొంత బీజేపీ ఎంపీల నుంచే ఎన్‌డీఏ ప్రభుత్వం కొన్ని కఠిన ప్రశ్నలను ఎదుర్కొనాల్సి వచ్చింది. సామాన్యుడిని వేధించడానికి కొన్ని కార్పొరేట్ సంస్థలు ‘ఈ తరహా చట్ట సవరణలను’ వినియోగించుకునే వీలుందని బీజేపీ ఎంపీలు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే చెక్కును జారీ చేసిన న్యాయపరిధిలోనే ‘బౌన్స్’ కేసు దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు డిఫాల్టర్లకు అయాచిత రక్షణ కల్పిస్తుందని, దీనివల్ల ఫిర్యాదుదారు అనవసర వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నట్లు ‘సవరణ బిల్లుకు సంబంధించి స్టేట్‌మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్’ వివరించింది. వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉండడం వల్ల, చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక, ఆర్థిక సంస్థలు సహా సంబంధిత వర్గాలు కోరినట్లు పేర్కొంది.