Chetan maini
-
ఈయనే లేకుంటే భారత్‌లో ఎలక్ట్రిక్ కారు పుట్టేదా? ఎవరీ చేతన్ మైని..
కేవలం డీజిల్, పెట్రోల్ కార్లను మాత్రమే వినియోగిస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం వచ్చిన ఆలోచన ఆటోమోటివ్ పరిశ్రమలో విప్లవాత్మకమైన ప్రయాణానికి నాంది పలికింది. ఈ ప్రయాణంలోనే 'రేవా' (Reva) పుట్టుకొచ్చింది. ఈ కారు ఎలా వచ్చింది, భారతదేశంలో ఎలక్ట్రిక్ కారు ప్రారంభం కావడానికి కారకులు ఎవరనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫ్యూయెల్ కార్లను వాడుతున్న కాలంలో తన దూరదృష్టితో ఎలక్ట్రిక్ కారు తయారు చేయడానికి పూనుకున్న వ్యక్తి 'చేతన్ మైని' (Chetan Maini). పచ్చని భవిష్యత్ కోసం కలలు కంటూ.. ఎలక్ట్రిక్ కారు 'రేవా'కు పునాది వేశారు. ఇదే నేడు గణనీయమైన ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలకు మార్గదర్శం అయింది. సవాళ్లకు ఏ మాత్రం భయపడకుండా.. చేతన్ మైని ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇంధన వినియోగం తగ్గించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ కీలకమని తన నమ్మకానికి కట్టుబడి పనిచేశారు. అదే ఈ రోజు ప్రభుత్వం కూడా ఈవీల తయారీకి దోహదపడేలా చేస్తోంది. ఎవరీ 'చేతన్ మైని'? 1970 మార్చి 11న చేతన్ మైని బెంగళూరులో జన్మించారు. ఈయన తండ్రి సుదర్శన్ కె మైని. చేతన్ 1992లో మిచిగాన్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, 1993లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత ప్రపంచం 100 శాతం ఈవీ రంగం వైపు పరుగెడుతుందని భావించి, ఇందులో భారత్ కూడా ప్రధానంగా ఉండాలని ఆశించి, బెంగళూరులో ఒక బృందాన్ని నిర్మించి దానికి నాయకత్వం వహించి.. రెండు సంవత్సరాల్లో రేవా ఎలక్ట్రిక్ కారు ప్రారంభమైంది. రేవా మహీంద్రా గ్రూప్‌తో చేతులు కలిపిన తర్వాత, మహీంద్రా రేవా ఏర్పడింది. ఇందులో 'చేతన్' టెక్నాలజీ & స్ట్రాటజీ చీఫ్‌గా పనిచేశారు. మూడు సంవత్సరాల పాటు పనిచేసి కొత్త సాంకేతికతలను నిర్మించడంపై దృష్టి సారించారు. ఆ తరువాత మహీంద్రా ఈ20 వెహికల్ పుట్టుకొచ్చింది. ఆ సమయంలోనే ఈయన కంపెనీ సీఈఓగా పదవి చేపట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత కంపెనీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈయన 'సన్ మొబిలిటీ'ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా? అచంచలమైన సంకల్పంతో స్థిరమైన ఆవిష్కరణలలో అగ్రగామిగా భారతదేశాన్ని ప్రపంచ వేదికపైకి నడిపించగలదని మైనీ విశ్వసించారు. చేతన్ మైని దూరదృష్టి అపారమైనది, ఆయన ఆలోచనలను పరిశీలిస్తే.. అత్యున్నతమైన భవిష్యత్తు ఎలా సాధ్యమవుతుందని స్పష్టంగా అవగతమైపోతుంది. -
మహీంద్రా ఎలక్ట్రిక్ కారులో ప్రీమియం వెర్షన్
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఎలక్ట్రిక్ చిన్న కారు ఈ2ఓలో ప్రీమియం వేరియంట్‌ను గురువారం ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.5.72 లక్షలు(ఆన్ రోడ్ ధర, న్యూఢిల్లీ) అని మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈవో చేతన్ మైణి చెప్పారు. ఇంధన చార్జీలు నెలకు రూ.2,999 చొప్పున ఐదేళ్లు చెల్లించాల్సి ఉంటుందని, ఈ చార్జీలతో ఐదేళ్లలో ఈ కారు యజమాని 50,000 కి.మీ. దూరం ప్రయాణించవచ్చని వివరించారు. ఈ కారులో ఎలక్ట్రిక పవర్ స్టీరింగ్ ఉందని, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 120 కి.మీ. దూరం ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఈ కారులో ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, రియర్ కెమెరా, పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. ఈ కారును స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చని, బ్యాటరీ లెవల్స్, ఏసీ సిస్టమ్, దగ్గర్లోని చార్జింగ్ స్టేషన్లు తదితర సమాచారాన్ని పొందవచ్చని వివరించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణేల్లో ఇప్పటికే 300కు పైగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది చివరికల్లా మరో వంద చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.