మహీంద్రా ఎలక్ట్రిక్ కారులో ప్రీమియం వెర్షన్
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఎలక్ట్రిక్ చిన్న కారు ఈ2ఓలో ప్రీమియం వేరియంట్‌ను గురువారం ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.5.72 లక్షలు(ఆన్ రోడ్ ధర, న్యూఢిల్లీ) అని మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈవో చేతన్ మైణి చెప్పారు. ఇంధన చార్జీలు నెలకు రూ.2,999 చొప్పున ఐదేళ్లు చెల్లించాల్సి ఉంటుందని, ఈ చార్జీలతో ఐదేళ్లలో ఈ కారు యజమాని 50,000 కి.మీ. దూరం ప్రయాణించవచ్చని వివరించారు. ఈ కారులో ఎలక్ట్రిక పవర్ స్టీరింగ్ ఉందని, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 120 కి.మీ. దూరం ప్రయాణిస్తుందని పేర్కొన్నారు.
ఇంకా ఈ కారులో ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, రియర్ కెమెరా, పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. ఈ కారును స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చని, బ్యాటరీ లెవల్స్, ఏసీ సిస్టమ్, దగ్గర్లోని చార్జింగ్ స్టేషన్లు తదితర సమాచారాన్ని పొందవచ్చని వివరించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణేల్లో ఇప్పటికే 300కు పైగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది చివరికల్లా మరో వంద చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.