ఆత్మహత్యల నివారణకు హెల్ప్‌లైన్
హిమాయత్‌నగర్ : ఆత్మహత్య చేసుకునేవారి బాధను విని, ఆ ఆత్మహత్య బారి నుంచి వారిని కాపాడి బంగారు భవిష్యత్‌ను అందించేదుకు హెల్ప్ లైన్ కోసం 7207308383 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చేతన హాస్పిటల్ సెక్రియాటిస్ట్ డాక్టర్ పి.కె.ఎన్.చౌదరి తెలిపారు. శనివారం చేతన హాస్పిల్ ఆధ్వర్యంలో 'స్పాన్' (సూసైడ్ ప్రెవెన్షన్ యాక్షన్ నెట్వర్క్) అనే పేరుతో ఓ హెల్ప్ లైన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చౌదరి మాట్లాడుతూ.. తీవ్ర ఒత్తిడిలకు గురై ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు ఒక్కసారి ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే వారి బాధను అంతా టీమ్ సభ్యులు వింటారన్నారు.
ఆత్మహత్య చేసుకోదలచిన వ్యక్తి బాధను వింటే కొంతవరకు అతను ఉపశమనం పొంది ఆత్మహత్యపై మక్కువ పోతుందన్నారు. తద్వారా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. ఈ స్పాన్ అనే సంస్థ ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. ఎక్కడివారైనా ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే సంబంధిత ఏరియా ప్రతినిధులకు కనెక్ట్ చేసి వారి సమస్య పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.