మరాఠా నేలపై ఆరని బావుటా
కొత్త కోణం
‘మీరు సిపాయి అయినా, సైనికాధికారి అయినా గ్రామస్తులకూ, రైతులకూ భారం కాకూడదు. గడ్డిపోచ కూడా వారి నుంచి గుంజుకోకూడదు. మీ అవస రాలకు రాజ భాండాగారం నుంచి నిధులు పంపిస్తున్నాం. ఎటువంటి అవస రాలున్నా ఆ డబ్బునే వాడండి. ఆహారంతోపాటు కూరగాయలు, వంట సామగ్రి, వంటచెరకు, చివరకు పశుగ్రాసం కూడా డబ్బులు చెల్లించే తీసు కోవాలి. బలవంతంగా లాక్కోగూడదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే రైతాంగం మనల్నందర్నీ దూషిస్తుంది. అర్థం చేసుకోండి. రైతాంగం, సామాన్య ప్రజలెవ్వరూ కూడా మన వల్ల ఇబ్బందులు పడకూడదు’.
మే 19, 1673న భవానీశంకర్ అనే సైనికాధికారికి ఛత్రపతి శివాజీ మహరాజ్ రాసిన లేఖలోని అంశాలివి. శివాజీ... ఈ పేరు వినగానే పౌరుషాగ్ని గుర్తుకొచ్చి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీర శివాజీ అనే నినాదం మన చెవుల్లో మార్మోగుతున్నట్టుంటుంది. ఆయన సాహసం, వీరత్వం, ధీరత్వం, సమయ స్ఫూర్తి, యుద్ధతంత్రం పుస్తకాల నిండా మనకు కనిపించేవే. ఆయన గెరిల్లా యుద్ధ తంత్రం చరిత్రలో మరపురాని ఘట్టం.
వక్రీకరించిన చరిత్ర
కానీ, ఆయన పాలనాదక్షత, ప్రజల పట్ల ఆయన చూపిన ప్రేమ, ఆర్థికా భివృద్ధికి వేసిన మార్గం, సామాజిక రంగంలో అందించిన సమాన గౌరవం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆయనను ఒక మతానికి వ్యతిరేకిగా, మరొక మతానికి రక్షకుడిగా పరిమితం చేసే అసత్యాలు ఎక్కువగా ప్రచార మయ్యాయి. వీర శివాజీ ధీరత్వాన్ని వెన్నంటి ఉన్న మరో పార్శ్వం, భారత ప్రజల మనోఫలకం మీద పడిన బలవంతపు ముద్ర–హిందూత్వం. అది ఎంతమాత్రం నిజం కాదని చరిత్రకారులు రుజువు చేశారు. ఆయన పాలన లోని ఎన్నో విషయాలు నేటికీ అనుసరణీయమనిపిస్తుంది. పైన పేర్కొన్న లేఖ అందులో భాగమే.
ఫిబ్రవరి 19, 1630న పుణేకు సమీపంలోని శివనేరు దుర్గంలో శివాజీ జన్మించాడు. తల్లిదండ్రులు జిజియాబాయి, షాహాజ్రాజ్ బోంస్లే. దాదాజీ కొండదేవ్ ద్వారా శివాజీ అన్ని విధాలా శిక్షణను పొందాడు. ఒక జాగీరుగా పుణేను శివాజీకి తండ్రి అప్పగించారు. చిన్నప్పటి నుంచే పేదలు నివసించే ప్రాంతాలను పరిశీలించడం శివాజీ జీవితంలో భాగమయింది. పాలకులైన సుల్తాన్‌లే కాకుండా, పటేళ్లు, దేశ్‌ముఖ్‌లు, జమీందార్లు, గ్రామీణ ప్రజలపై; ప్రత్యేకించి రైతులపై జరిపే దౌర్జన్యాలంటే శివాజీకి మొదటి నుంచి ఏవగింపే. ఆయన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన తరువాత రైతుల పరిస్థి తులను మార్చడానికి కంకణబద్ధుడయ్యాడు. అందుకు పాలనాపరమైన మార్పులను తీసుకొచ్చాడు.
ఆ రోజుల్లో రాజుల పేరుతో సామంతులు, ఇతర పెత్తందార్లు సాగించే దోపిడీకి అంతులేదు. రాజుల ప్రభావం ప్రత్యక్షంగా ప్రజలమీద చాలా తక్కువ. ఏ రాజు వచ్చినా గ్రామాల పరిస్థితుల్లో మార్పు వచ్చేది కాదు. ఆనాడు గ్రామీణ వ్యవస్థ స్వయం పోషకంగా ఉండేది. కానీ గ్రామీణ పాలనా వ్యవస్థ దుర్మార్గంగా ఉండేది. ప్రతి గ్రామాన్ని పాటిల్, కులకర్ణితో కలసి పన్నెండు మంది వివిధ హోదాల్లో నడిపించేవారు. రైతుల నుంచి ఈ అధికార వ్యవస్థ అందినంత దండుకొని, రాజుకు కొంత కప్పం రూపంలో చెల్లించే వారు. రైతుల బాధలు చెప్పుకుందామన్నా వినేవాళ్లు లేరు. తీర్చే వారు అంత కన్నా లేరు. రాజులు రావచ్చు, పోవచ్చు. కానీ కులకర్ణిలు దేశ్‌ముఖ్‌లు అలాగే ఉండేవారు.
ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ ఈ దీన గాథలను మార్చాలని సంకల్పించారు. అప్పటిదాకా అడ్డూ అదుపూ లేకుండా విచ్చలవిడిగా రైతులను పీడనకు, హింసకు గురిచేసిన వాళ్లను కట్టడి చేశాడు. వారంతా రైతులకు సేవకులుగా ఉండాలనీ, నెత్తినెక్కి అధికారం చలాయించ కూడదనీ ఆదేశాలిచ్చాడు. భారతదేశంలో వేలయేళ్లుగా కొనసాగిన వ్యవ సాయ విధానాలను సమూలంగా మార్చి, రైత్వారీ విధానాన్ని శివాజీ ప్రవేశ పెట్టాడు. అప్పటి వరకు రైతుల మీద అడ్డూ అదుపూ లేని పన్నుల విధానాన్ని రద్దు చేసి, పంటలోని ఐదు భాగాల్లో రెండవ వంతు ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని ప్రకటించాడు. అంతకు ముందు ఇది మూడు వంతులుండేది. ఒక్కొక్క చోట ఎంతివ్వాలన్న లెక్క సైతం ఉండేది కాదు. నిర్ణయం చేయడమే కాదు, రైత్వారీ విధానాన్ని పటిష్టంగా అమలు చేసిన ఘనత శివాజీకే దక్కు తుంది. ఇది రైతుల్లో విశ్వాసాన్ని పెంచింది. జమీందార్ల కోరలు తీసేసింది. పన్నులను క్రమపద్ధతిలో వసూలు చేయడం తప్ప దౌర్జన్యాలు చేసే వీలు లేని వ్యవస్థను శివాజీ నెలకొల్పారు. ప్రజలమీద దౌర్జన్యాలు జరిగితే తనకు వెంటనే తెలిసే విధంగా గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు శివాజీ.
ఆయన రైతు బాంధవుడు
దీంతో పాటు పడావుగా ఉన్న భూములను సాగులోనికి తీసుకొచ్చే ప్రయత్నం మహత్తరమైనది. ఎవరైనా కొత్తగా వ్యవసాయం చేయాలను కుంటే వారికి ఎడ్లతోపాటు వ్యవసాయ పనిముట్లను ఉచితంగా అందించే వారు. వాటితో పాటు విత్తనాలు ఇతర అవసరాలకు నగదు అప్పుగా ఇచ్చి ఆదుకునేవారు. నాలుగు సంవత్సరాల తరువాతే బాకీ తీర్చే ప్రక్రియ మొదల య్యేది. వందలాది ఎకరాలను ఇనాంగా ఇచ్చే సంప్రదాయాన్ని శివాజీ రద్దు చేశాడు. కరువు పరిస్థితులు ఏర్పడితే పన్నులు ఉండేవి కావు. అంతేకాకుండా కరువు సహాయక చర్యలను చేపట్టేవారు. భూములను సర్వే చేయించి హద్దు లను నిర్ణయించడంతో పాటు నిర్ణీత స్థాయిలోనే భూములు కలిగి ఉండే విధా నానికి అంకురార్పణ చేశారు. గ్రామంలో జరిగే నేరాలను గతంలో లాగా పెత్తందార్లు విచారించే పద్ధతికి స్వస్తి పలికి ప్రత్యేక న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొత్తగా గ్రామాలను నిర్మించడంతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వలస రావడానికి ఇష్టపడితే వారికి వ్యవసాయ భూమి ఇచ్చి ప్రోత్సహించేవారు. ఈ విధానాల వల్ల శివాజీ పాలనలో వ్యవసాయా భివృద్ధి ఎంతో వేగంగా జరిగింది.
రెగ్యులర్‌గా ఉండే సైనికులతో పాటు రైతులు కూడా ఆరు నెలలు సైన్యంలో పనిచేసేవారు. గతంలో లాగా దోపిడీలలో వచ్చిన సొమ్మును సైని కులకు పంచడం కాకుండా వేతనాలు ఇవ్వడం ద్వారా శివాజీ తన సైనిక బలగాన్ని బాధ్యాతయుతమైన మార్గంలో నిర్మించాడు. ఇటు గ్రామాలనూ, అటు రాజ్యాన్నీ కాపాడుకునే తత్వం రైతుల్లో కల్పించాడు. అందువల్లనే సాధారణ సైన్యం చేసే తప్పులు జరిగేవి కావు. యుద్ధాల సమయంలో గ్రామాల మీద పడి మహిళలపై అత్యాచారాలు జరపడం కూడా నిషిద్ధం.
అంతకు ముందు గ్రామాల్లో మహిళలకు రక్షణ లేదు. పెత్తందార్లు తలు చుకుంటే ఏ మహిళనైనా లొంగదీసుకునేవారు. శివాజీ అటువంటి పెత్తం దార్లను శిక్షించినట్టు ఆధారాలున్నాయి. రాంజా గ్రామం పాటిల్ కథ చాలా పుస్తకాల్లో ప్రచురితమైంది. ఆ గ్రామాధికారి పాటిల్ పట్టపగలు ఒక పేదరైతు కూతురిని ఎత్తుకుపోయి అత్యాచారం జరిపాడు. అవమాన భారంతో ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఊరు ఊరంతా కన్నీటి సంద్రమౌ తుంది. ఈ విషయం శివాజీకి తెలిసిన వెంటనే సైనికులను పంపి, పాటిల్‌ను అదుపులోనికి తీసుకున్నాడు. ఆ అధికారి కాళ్లూ చేతులూ నరికి వేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే శిక్ష అమలైంది. సైన్యాధిపతులు తప్పు చేసినా కూడా శివాజీ వదిలి పెట్టలేదు.
1678లో సైన్యాధిపతి శకూజీ గైక్వాడ్ నాయకత్వంలో చేలావది దుర్గం మీద దండెత్తి ఆక్రమించుకున్నారు. అప్పటి వరకు ఆ దుర్గం అధిపతిగా ఉన్న సావిత్రీబాయి దేశాయ్ చాలా రోజులు యుద్ధం చేసి ఓడిపోయింది. విజయ గర్వంతో శకూజీ గైక్వాడ్ సావిత్రీ బాయి దేశాయ్‌పై అత్యాచారం జరిపాడు. ఇది తెలిసిన శివాజీ సైన్యాధ్యక్షుడని కూడా చూడకుండా గైక్వాడ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. ఈ రెండు సంఘటనలు మహిళల రక్షణకు శివాజీ ఎంచుకున్న మార్గాన్ని వెల్లడిస్తాయి. ఈ సంఘటనలు నాటి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయి.
దేశవాళీ కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందడానికి శివాజీ ఎన్నో మార్పులు ప్రవేశపెట్టాడు. అందులో ఆక్ట్రాయ్ తరహా పన్ను ఒకటి. 1671 డిసెంబర్ 6న కుదాల్ సర్ సుబేదార్ నరహరి ఆనందరావుకు శివాజీ ఒక లేఖ రాస్తూ ‘బయటి నుంచి వచ్చే వస్తువుల మీద పన్ను భారీగా ఉండాలి, లేనట్లయితే బయటి వాళ్లు స్థానిక వ్యాపారాన్ని గంపగుత్తగా తన్ను కుపోతారు.’ అని సూచించాడు. ఈ నిర్ణయం శివాజీ పాలనలో స్థానిక వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. అప్పటికి కొనసాగు తున్న బానిస వ్యాపారానికి కూడా స్వస్తి పలికాడు. డచ్ నుంచి వచ్చే వ్యాపా రులు ఇక్కడి నుంచి పురుషులను, స్త్రీలను కొనుగోలు చేసి తీసుకుపోయే వ్యవస్థను శివాజీ రద్దు చేశాడు.
మహమ్మదీయులకు ఉన్నత స్థానాలు
శివాజీనీ హిందూ రాజుగా చిత్రించడమే కాకుండా, ముస్లిం వ్యతిరేకిగా చూపే ప్రయత్నం జరిగింది. జరుగుతున్నది. నిజానికి అదే హిందూ వ్యవస్థ మొదట శివాజీని అవమానపరిచింది. ఆయనకు పట్టాభిషేకం చేయడానికి కూడా స్థానిక పూజారి వర్గం నిరాకరించింది. అప్పుడు కాశీ నుంచి గాగాభట్టు అనే పూజారిని రప్పించి పట్టాభిషేకం జరిపించారు. శివాజీ సైన్యంలో ఎంతో మంది ముస్లిం సైన్యాధికారులున్నట్టు వాస్తవాలు చెపుతున్నాయి. ఇందులో 13 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇబ్రహీంఖాన్ అనే ముస్లింని శివాజీ తన ఆయుధాగారానికి అధిపతిగా నియమించుకున్నాడు. దౌలత్ ఖాన్‌కు నౌకాదళాధిపతి లాంటి కీలక బాధ్యతనప్పగించాడు. అందువల్ల శివాజీకి ముస్లిం వ్యతిరేకత అంటగట్టడం సరికాదు. శివాజీ హిందూ మతాన్ని విశ్వసించిన మాటనిజమే. కానీ మిగతా మతాలను ద్వేషించలేదు. ఆ«ధునిక సామాజిక న్యాయ పోరాటానికి పునాదులు వేసిన ఫూలే లాంటి వాళ్లు శివాజీని ‘కుల్వాడి భూషణ్’ అని పొగిడారు. అంటే కర్షక మకుటం అని అర్థం. శివాజీ వారసత్వం ఈ దేశ సామాజిక విప్లవాలకు ఊతమిచ్చింది. ఆయన ముని మనమడు ఛత్రపతి సాహు మహరాజ్ 1902లో మొదటి సారిగా భారతదేశంలో రిజర్వేషన్లు ప్రారంభించి శివాజీ మార్గాన్ని కొనసాగిం చడం మనం అందరం గుర్తుచేసుకోవాలి.
(ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ జయంతి)
- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213