శివాజీ అభిమానులనూ క్షమాపణ అరి్థస్తున్నా
శివాజీ విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన
మహారాష్ట్రలో వాద్వాన్ ఓడరేవు ప్రాజెక్టుకు శంకుస్థాపన
పాల్ఘార్: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఇటీవల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన పట్ల శివాజీని, శివాజీ అభిమానులను క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు.. శివాజీ అంటే కేవలం ఒక పేరు, ఒక పాలకుడు కాదని అన్నారు. ఆయన మనకు ఒక దైవం అని స్పష్టంచేశారు.
ఈ రోజు ఛత్రపతి పాదాల వద్ద తలవంచి క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. విగ్రహం కూలిపోవడం పట్ల శివాజీ అభిమానుల మనసులు గాయపడ్డాయని, వారందరినీ క్షమాపణ ఆర్థిస్తున్నానని అన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో రూ.76,000 కోట్లతో నిర్మించే వాద్వాన్ ఓడరేవు ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శుక్రవారం పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు.
మనం పాటించే విలువలను చాలా భిన్నమైనవని పేర్కొన్నారు. దైవంలాంటి ఛత్రపతి శివాజీ కంటే మనకు ఇంకేదీ గొప్ప కాదని స్పష్టంచేశారు. పదేళ్ల క్రితం బీజేపీ ప్రధానమంత్రి అభ్యరి్థగా తన పేరు ఖరారు కాగానే మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ను సందర్శించానని, శివాజీ సమాధి వద్ద ధ్యానం చేశానని మోదీ గుర్తుచేసుకున్నారు. మరాఠా వీరుడు వీర సావర్కార్‌ను కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా దూషిస్తున్నారని, అవమానిస్తున్నారని ఆరోపించారు. వారు ఆయనకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరని విమర్శించారు.
పదేళ్లలో చేపల ఉత్పత్తి రెట్టింపు
‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మన లక్ష్య సాధనలో ‘అభివృద్ధి చెందిన మహారాష్ట్ర’ ఒక కీలక భాగమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రగతి కోసం గత పదేళ్లుగా అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మహారాష్ట్ర శక్తిసామర్థ్యాలు, సంపదతో రాష్ట్ర ప్రజలే కాకుండా దేశమంతా ప్రయోజనం పొందాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
మత్స్యకారుల సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పూర్తి అంకితభావం, నిజాయితీతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. చేపల పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ ద్వారా వేలాది మంది మహిళల సాధికారతకు చేయూత అందించామని వివరించారు.
చేపల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా రికార్డుకెక్కిందని హర్షం వ్యక్తం చేశారు. 2014లో మన దేశంలో చేపల ఉత్పత్తి కేవలం 8 మిలియన్ టన్నులుగా ఉందని, ఇప్పుడు 17 మిలియన్ టన్నులకు చేరిందని వెల్లడించారు. పదేళ్లలో ఉత్పత్తి రెట్టింపు అయ్యిందన్నారు. రూ.76,000 కోట్లతో వాద్వాన్ పోర్టు నిర్మిస్తున్నామని, ఇది దేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్టు అవుతుందని చెప్పారు. అభివృద్ధి దిశగా భారతదేశ ప్రయాణంలో ఇదొక చరిత్రాత్మకమైన రోజు అని మోదీ వ్యాఖ్యానించారు. రూ.1,560 కోట్లతో నిర్మించే 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు సైతం ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.360 కోట్లతో రూపొందించిన వెస్సెల్ కమ్యూనికేషన్, సపోర్టు సిస్టమ్ ప్రారంభించారు. బానిసత్వపు సంకెళ్లు తెంచుకున్న ‘నూతన భారత్’కు దేశ శక్తిసామర్థ్యాలు ఏమిటో పూర్తిగా తెలుసని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment