Chief Minister siddharamayya
-
బీజేపీది అనవసర రాద్ధాంతం : సీఎం
భూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్న బీజేపీ డిమాండ్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. బీజేపీ పేర్కొంటున్న మంత్రులపై వచ్చిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ రుజువు కాలేదని అన్నారు. అందువల్ల వారిని మంత్రి వర్గం నుంచి తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఉప ముఖ్యమంత్రులు ఆర్.అశోక్, కేఎస్ ఈశ్వరప్ప, మంత్రి సోమణ్ణలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయని, అంతేకాక ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయని తెలిపారు. ఆ సమయంలో వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోని బీజేపీ ఇప్పుడు తమనెందుకు ప్రశ్నిస్తోందో సమాధానం చెప్పాలని అన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం
లింగసూగూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో మరుగున పడిన అన్ని సాగునీటి పథకాలను తన అధికార వ్యవధిలో పూర్తి చేస్తామని, ఇందుకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఆదివారం ఆయన తాలూకాలోని మస్కి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని వూట్లాడారు. ప్రస్తుత బడ్జెట్లో నీటిపారుదల రంగానికి రూ.9,813 కోట్లు మంజూరు చేశామన్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలో కృష్ణా, కావేరి, గోదావరి బేసిన్లపరిధిలో అన్ని సాగునీటి పథకాల పనులను అమలు చేయడం ద్వారా రైతులు సమృద్ధిగా పంటలు పండించేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. కర్ణాటక రాష్ట్రాన్ని ఆకలి రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతో అన్న భాగ్య పథకాన్ని ప్రారంభించామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 98.36 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, అదే విధంగా క్షీరభాగ్య పథకం అమలు చేస్తున్నామన్నారు. సింధనూరు- లింగసూగూరు రాష్ట్ర రహదారి నిర్మాణానికి గతంలో టెండర్ ప్రక్రియకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నేరుగా ప్రభుత్వం ద్వారానే ఈ రహదారి పనులను చేపట్టనుందని తెలిపారు. ఈ సందర్భంగా మస్కి ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్ మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రులు ెహ చ్‌సీ.మహదేవప్ప, శివరాజ్‌తంగడగి, కాంగ్రెస్ జిల్లాధ్యక్షులు ఏ.వసంతకుమార్, ఎమ్మెల్యేలు హంపనగౌడ బాదర్లి, హంపయ్య నాయక్, నాగరాజ్, మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ తదితరులు పాల్గొన్నారు. -
విజేతలెవరో?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజేతలెవరో శనివారం తేలనుంది. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. జేడీఎస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ. కుమారస్వామి, మాజీ మంత్రి ఎన్. చలువరాయ స్వామి శాసన సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలో కుమారస్వామి సతీమణి అనిత, కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి డీకే. శివకుమార్ తమ్ముడు సురేశ్‌ల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొంది. శాసన సభ ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం పరిధిలోని చన్నపట్టణ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయిన అనితా కుమారస్వామి తొలుత పోటీకి నిరాకరించినా, కుటుంబ సభ్యుల ఒత్తిడితో బరిలోకి దిగాల్సి వచ్చింది. బీజేపీ ఇక్కడ బాహాటంగానే ఆమెకు ప్రచారం చేసింది. జేడీఎస్‌కు గట్టి పట్టు ఉన్న ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా సత్తా చాటాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కృత నిశ్చయంతో ఉన్నప్పటికీ, పార్టీలోని అంతర్గత కలహాలు ఎక్కడ కొంప ముంచుతాయేమోననే ఆందోళన కూడా ఆయనలో లేకపోలేదు. దీనికి తోడు జేడీఎస్‌కు ప్రాబల్యమున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటింగ్ బాగా జరగడం, కాంగ్రెస్ ఆధిపత్య ప్రాంతాల్లో స్వల్పంగా ఉండడం పార్టీ నాయకులను కలవరానికి గురి చేస్తోంది. మండ్య నియోజక వర్గంలో సినీ గ్లామర్ ద్వారా గట్టెక్కాలని కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ, అభ్యర్థి రమ్య పెంపుడు తండ్రి నామినేషన్ దాఖలు రోజున మరణించడం పార్టీలో విషాదాన్ని నింపింది. ఒకానొక దశలో పోటీకి రమ్య విముఖత వ్యక్తం చేసినప్పటికీ, అప్పటికే పుణ్య కాలం పూర్తయినందున కాంగ్రెస్ నాయకులు ఆమెను బతిమాలుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు రంగంలో దిగినప్పటికీ చురుకుగా, ఉత్సాహంగా ప్రచారం చేయలేక పోయారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, నటుడు అంబరీశ్ ప్రచార భారాన్ని నెత్తిన వేసుకున్నప్పటికీ, అక్కడ కూడా కాంగ్రెస్‌లోని గ్రూపులు పార్టీకి చెరుపు చేస్తాయేమోనని నాయకులు సందేహంతో ఉన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలే కావడం, ఈ స్వల్ప కాలంలోనే అనేక ప్రజాకర్షక పథకాలను ప్రవేశ పెట్టడంతో విజయం ఖాయమనే ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెలువడుతాయి.