childrean died
-
సరదా.. విషాదమాయె!
ఆ నలుగురు విద్యార్థులు వేసవి సెలవుల్లో తమకు నచ్చిన ఆటలు ఆడారు.. సమీపంలోని చెరువులో సరదాగా చేపలుపడదామని వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి వారిలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో బాలుడిని స్థానికులు గమనించి రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. మృతుల్లో అన్న, చెల్లెలు ఉండటం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కందనూలు (నాగర్‌కర్నూల్): బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌కు చెందిన బొక్కి శైలజ (12), మండల స్వాతి (9), అనిల్ (10), గణేష్ సమీపంలోని సూరయ్యకుంట చెరువులో చేపలు పట్టేందుకు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్లారు. ఈ క్రమంలోనే గణేష్ తప్పా మిగతా ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడటం గ్రామస్తులను కలచివేసింది. అనంతరం ముగ్గురి మృతదేహాలను స్థానికులు గాలించి వెలికితీశారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఇదే గ్రామానికి చెందిన మండల అంజనమ్మ, చంద్రయ్య దంపతులకు ఇద్దరు సంతానం. అందులో అనిల్, స్వాతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. తమకున్న ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలు కావడంతో తల్లిదండ్రుల రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు. ఇక బొక్కి చెన్నమ్మ నాగయ్య, దంపతుల నాలుగో సంతా నమే శైలజ. ఈ బాలిక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు మృతి చెందడంతో తల్లి దండ్రులు గుండెలవిసేలా రోదించారు. బాధిత కుటుంబాలను సర్పంచ్ వంగా సుదర్శన్‌గౌడ్ పరామర్శించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ లక్ష్మీనర్సింహ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు -
సిద్దిపేటలో విషాదం
సాక్షి, సిద్దిపేట : పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. కోమటి చెరువులో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈత కొట్టడానికి మంగళవారం చెరువుకు వెళ్లిన చిన్నారులు లక్ష్మణ్(10), గణేష్(15)లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తుదిశ్వాస విడిచారు. అప్పటి వరకు ఆడుతూ తమ ముందే తిరిగిన పిల్లలు విగత జీవులుగా మారడంతో ఆ చిన్నారుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
భార్యతో గొడవ.. ముగ్గురి బలవన్మరణం
వేలూరు : కుటుంబకలహాలతో ఇద్దరు పిల్లలను డ్యామ్‌లో తోసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో కలకలం సృష్టించింది. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా పిచ్చనూరు కేకే నగర్‌కు చెందిన జీవా(42) కాయగూరల వ్యాపారి. ఇతని భార్య హేమావతి. వీరికి గజలక్ష్మి(12) అనే కుమార్తె, రాజేష్(7) అనే కుమారుడు ఉన్నారు. మూడు రోజుల క్రితం జీవా, హేమావతి గొడవ పడ్డారు. దీంతో హేమావతి పుట్టింటికి వెళ్లింది. జీవా మాత్రం ఇద్దరు పిల్లలతో ఇంట్లోనే ఉన్నాడు. బుధవారం ఉదయం జీవ పిల్లలను తీసుకొని పాఠశాలకు బైకులో వెళ్లాడు. అయితే సాయంత్రం వరకు వారు ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన బంధువులు పాఠశాలకు వెళ్లి విచారించగా పాఠశాలకు రాలేదని చెప్పారు. ఈ క్రమంలో గురువారం ఉదయం స్థానికులు గుడియాత్తం మోర్ధానా డ్యామ్ వద్ద బైక్, విద్యార్థుల పుస్తకాల బ్యాగు ఉన్నట్లు గుర్తించారు. పాఠశాల బ్యాగులో ఉన్న గుర్తింపు కార్డుల చిరునామా ప్రకారం జీవా బంధువులకు సమాచారం అందజేశారు. బంధువులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మోర్ధానా డ్యామ్ వద్దకు వెళ్లి గాలించారు. మద్యాహ్నం 2 గంటల సమయంలో మృతదేహాలు నీటిపై తేలడంతో మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టానికి తరలించారు. కుటుంబ కలహాలతో జీవా ఇద్దరు పిల్లలను డ్యామ్‌లో తోసి అనంతరం అతను ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. -
ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి
వాంకిడి: ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ప్రమాదవశాత్తూ ఇంకుడుగుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన నగేష్(1) మంగళవారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి ఇంటి పక్కనున్న ఇంకుడుగుంతలో పడిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే బాలుడు మరణించాడు.