
వేలూరు : కుటుంబకలహాలతో ఇద్దరు పిల్లలను డ్యామ్‌లో తోసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో కలకలం సృష్టించింది. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా పిచ్చనూరు కేకే నగర్‌కు చెందిన జీవా(42) కాయగూరల వ్యాపారి. ఇతని భార్య హేమావతి. వీరికి గజలక్ష్మి(12) అనే కుమార్తె, రాజేష్(7) అనే కుమారుడు ఉన్నారు. మూడు రోజుల క్రితం జీవా, హేమావతి గొడవ పడ్డారు. దీంతో హేమావతి పుట్టింటికి వెళ్లింది. జీవా మాత్రం ఇద్దరు పిల్లలతో ఇంట్లోనే ఉన్నాడు.
బుధవారం ఉదయం జీవ పిల్లలను తీసుకొని పాఠశాలకు బైకులో వెళ్లాడు. అయితే సాయంత్రం వరకు వారు ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన బంధువులు పాఠశాలకు వెళ్లి విచారించగా పాఠశాలకు రాలేదని చెప్పారు. ఈ క్రమంలో గురువారం ఉదయం స్థానికులు గుడియాత్తం మోర్ధానా డ్యామ్ వద్ద బైక్, విద్యార్థుల పుస్తకాల బ్యాగు ఉన్నట్లు గుర్తించారు. పాఠశాల బ్యాగులో ఉన్న గుర్తింపు కార్డుల చిరునామా ప్రకారం జీవా బంధువులకు సమాచారం అందజేశారు. బంధువులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మోర్ధానా డ్యామ్ వద్దకు వెళ్లి గాలించారు. మద్యాహ్నం 2 గంటల సమయంలో మృతదేహాలు నీటిపై తేలడంతో మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టానికి తరలించారు. కుటుంబ కలహాలతో జీవా ఇద్దరు పిల్లలను డ్యామ్‌లో తోసి అనంతరం అతను ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు తెలిపారు.