సాక్షి, చెన్నై: ప్రేమించుకుని పెళ్లి కూడా నిశ్చయమైన తరువాత ప్రియురాలు అకస్మాత్తుగా మాట్లాడడం మానేయడంతో పుదుచ్చేరికి చెందిన న్యాయవాది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కనకచెట్టి కుళం ప్రాంతానికి చెందిన సురేష్ (31) న్యాయవాదిగా వృత్తిలో కొనసాగుతున్నాడు. పుదుచ్చేరి లా కళాశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా సురేష్ ప్రేమను అంగీకరించడంతో ఇరువురు చట్టాపట్టాలేసుకుని కొన్నాళ్లపాటు ప్రేమను కొనసాగించారు. తమ ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు కూడా అంగీకరించడంతో ఈ నెల 27న పెళ్లి చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఇదిలా ఉండగా సదరు యువతి సురేష్‌తో అకస్మాత్తుగా మాట్లాడడం మానివేసింది. ఎన్నిసార్లు సెల్‌ఫోన్‌లో సంప్రదించినా ఫోన్ తీయలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సురేష్ గురువారం రాత్రి ప్రియురాలికి వీడియో కాల్ చేసి, నువ్వు నాతో మాట్లాడడం మానివేసినందున ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబుతూ, ఆమె చూస్తుండగానే కుర్చీపై నిల్చుని తాడు బిగించుకుని సెల్‌ఫోన్ కట్ చేశాడు.
సరదాగా ఈ చేష్టలకు పాల్పడుతున్నాడని తేలిగ్గా తీసిపారేసిన సదరు యువతి, కొద్ది సేపటి తర్వాత అనుమానంతో సురేష్ ఇంటికి సమీపంలో నివసించే శివశక్తి అనే వ్యక్తికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. శివశక్తి వెంటనే సురేష్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఈ సమాచారం తెలపగా, ఆందోళన చెందుతూ తలుపుతట్టారు. అయితే ఎంతకూ తలుపులు తెరుచుకోకపోవడంతో పగులగొట్టి లోపలికి ప్రవేశించగా, సురేష్ ఉరికి వేలాడుతున్నాడు. వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈలోగా కడలూరులో ఉంటున్న సదరు యువతి కూడా పుదుచ్చేరికి చేరుకోగా, పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ప్రియురాలు మాట్లాడకపోవడమే ఆత్మహత్యకు కారణమా, మరేదైనా ఉందా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు
Comments
Please login to add a commentAdd a comment