దొంగలకు చుక్కలు చూపించిన స్ప్రే
క్వజులు-నటల్(ద.ఆ): ఓ స్టోర్‌లో ఎవరూ లేని సమయంలో చోరీ చేద్దామని వచ్చిన దుండగులు ఒక్కసారిగా పరుగులు పెడుతూ పారిపోయారు. ఈ సంఘటన దక్షిణ అమెరికాలోని క్వజులు-నటల్లోని బోతాస్ హిల్స్‌లో ఉన్న షుగర్ లోఫ్ సెంటర్లో చోటు చేసుకుంది. వివరాలు.. గత నెలలో వరుసగా జరిగిన చోరీలలో షుగర్ లోఫ్ సెంటర్లో ఓ టీవీ, మూడు కంప్యూటర్లను దుండగులు ఎత్తుకు పోయారు. దీంతో స్టోర్ యజమాని మోర్నే బోత్మా ఓ సెక్యురిటీ ఏజెన్సీని ఆశ్రయించింది. వారు చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్‌ను స్టోర్‌లో బిగించారు.
అయితే చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్ గురించి తెలియకుండా స్టోర్‌లో చోరీ చేయడానికి ముగ్గురు దుండగులు ప్రవేశించారు. ముందుగా డోర్ చైన్‌ను కట్ చేయడానికి ప్రయత్నించి విఫలం అవ్వడంతో చివరకు గ్లాస్ డోర్‌ను పగలగొట్టి స్టోర్‌లోకి వచ్చారు. దుండగుల్లో ఒకరు టీవీని చోరీ చేయడానికి ప్రయత్నించగా, చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్ ఆక్టివ్ అయ్యింది. అంతే చిల్లీ పెప్పర్ స్ప్రే అవ్వడంతో పాటూ అలారమ్ కూడా రావడంతో దుండగులు షాక్‌కు గురయ్యారు. ఏం జరుగుతుందో అని వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే బయటకు వెళ్లిన వారిలో ఒకరు మళ్లీ స్టోర్‌లోకి రావడానికి ప్రయత్నించాడు. కానీ స్టోర్ నిండా పెప్పర్ స్ప్రే అవ్వడంతో చేసేదేమీలేక ఒట్టిచేతులతోనే ఇంటి ముఖం పట్టాడు. స్టోర్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియోను పోలీసులు విడుదల చేశారు.
'ఇంతకు ముందు సీసీకెమెరాలు బిగించినా దుండగులు మాస్క్‌లు ధరించి చోరీలు చేశారు. నిజంగా చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్ అద్భుత ఫలితాన్నిచ్చింది' అని స్టోర్ యజమాని మోర్నే బోత్మా తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగుల కోసం గాలింపుముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు.