China and Pakistan
-
చైనా, పాక్ తీరుని తిట్టిపోసిన భారత్! ఊరుకునేది లేదని వార్నింగ్
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)కి సంబంధించిన బహుళ బిలియన్ డాలర్ల కనెక్టివిటీ కారిడార్ ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు తాజాగా చైనా ఈ సీపెక్ ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తిగా ఉన్న మూడో దేశాన్ని భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీంతో భారత్ ఆగ్రహంతో పాక్, చైనా చర్యలను తీవ్రంగా ఖండించింది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద ఇటువంటి కార్యకలాపాలు స్వభావసిద్ధంగా 'చట్ట విరుద్ధం' అని నొక్కి చెప్పింది. ఇది ఆమోద యోగ్యం కాదని కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే భారత్ తదను గుణంగా వ్యవహరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గట్టిగా హెచ్చరించారు. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న ఈ భూభాగంలోని ఈ ప్రాజెక్టులను భారత్ దృఢంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. అంతేగాదు ఇవి నేరుగా భారత్ సార్వ భౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్యలని అన్నారు. వాస్తవానికి సీపెక్ అనేది చైనాకి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగం. ఈ సీపెక్ 2013లో ప్రారంభమైంది. ఇది పాకిస్తాన్ రోడ్డు, రైలు ఇంధన రవాణా అవస్థాపనను మెరుగుపరచడమే కాకుండా సముద్రపు నౌకాశ్రయం గ్వాదర్‌ను చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌తో కలుపుతుంది. ఐతే సీపెక్ చొరవలో భాగంగా ఈ బీఆర్ఐని ఆది నుంచి భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. (చదవండి: యూపీలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్!) -
‘రైతుల నిరసనల వెనుక పాక్, చైనా’
ముంభై: కేంద్ర మంత్రి రావుసాహెబ్ దన్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న రైతుల వెనుక చైనా, పాక్ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు జరుగుతుండగా ఈ విషయంలో పొరుగు దేశాల ప్రస్తావన రాజకీయంగా అలజడి సృష్టిస్తోంది. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మంత్రి బచ్చు కడు స్పందిస్తూ ‘‘ దేశ వ్యాప్తంగా రైతు ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు అన్నదాతలకు మద్దతు పలుకుతున్నారు. కానీ చైనా, పాక్ పేరు చెప్పి రైతులను అవమానించారు. ఇందుకు వాళ్లు దన్వే ఇంట్లోకి చొరబడి అతడిని కొట్టాలి. ఆయన వైఖరి ఇలాగే కొనసాగితే ఆయన డీఎన్ఏ పాకిస్తాన్ లేదా భారత్‌లో ఉందా అని చెక్ చేయాల్సి వస్తుంది’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దన్వే మాట్లాడుతూ... ‘ఇది రైతులు చేస్తోన్న ఆందోళన కాదు. దీని వెనక పాక్, చైనాల హస్తం ఉంది. దేశంలో ఏం జరిగినా వెంటనే ముస్లింలను ప్రేరేపిస్తారు. గతంలోనూ పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టార్ ఆఫ్ సిటిజన్స్ తీసుకువచ్చిన సమయంలో ముస్లింలను తప్పుదోవ పట్టించారు. ఎన్ఆర్సీ, సీఏఏ అమల్లోకి వస్తే ఆరు నెలల్లో ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారని ప్రచారం చేశారు. ఇప్పటివరకు ఎంత మంది ముస్లింలు దేశం నుంచి వెళ్లిపోయారో చెప్పాలి. ఆ సమయంలో విఫలమయ్యారు కాబట్టే మళ్లీ నూతన చట్టాల వల్ల నష్టం జరుగుతుందంటూ వారిని రెచ్చగొడుతున్నారు’’ అని పేర్కొన్నారు. కాగా కొన్ని వారాలుగా పంజాబ్ , హర్యానాలోని వేల మంది రైతులు దేశ రాజధాని సరిహద్దు ప్రాంతంతో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరులో అమల్లోకి వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల గురించి రైతుల ఆందోళనలు చల్లార్చేలా కేంద్రం గత కొన్ని వారాలుగా వ్యవసాయ సంఘ నాయకులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. రైతు నాయకులు చట్టాలను సవరించే ప్రభుత్వ ప్రతిపాదనను బుధవారం తిరస్కరించారని వెల్లడించారు. డిసెంబర్ 14 న దేశవ్యాప్త నిరసనకు దిగి జైపూర్-డిల్లీ , ఢిల్లీ-ఆగ్రా రహదారులను అడ్డుకుంటూ ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారని అన్నారు. -
చైనా, పాక్ వాయుసేనల సంయుక్త విన్యాసాలు
బీజింగ్: చైనా, పాకిస్తాన్ వాయుసేనలు తమ సంయుక్త విన్యాసాలను శుక్రవారం ప్రారంభించాయి. ఈ విన్యాసాల్లో ఇరు సేనలకు చెందిన తాజా యుద్ధ విమానాలు, ఏడబ్ల్యూఏసీఎస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాలుపంచుకుంటున్నాయి. చైనాకు చెందిన జే-11 ఫైటర్స్, జేహెచ్-7 ఫైటర్ బాంబర్లు, కేజే-200 ఏడబ్ల్యూఏసీఎస్ ఎయిర్‌క్రాఫ్ట్, క్షిపణులు రాడార్ దళాలు పాల్గొంటున్నాయని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి షెన్ జింకె చెప్పారు. ఈ విన్యాసాల్లో పాక్‌కు చెందిన జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్స్, షహీన్ 6 ఎయిర్‌క్రాఫ్ట్ పాల్గొంటాయని షెన్ తెలిపారు. చైనాలో ఈ కసరత్తు సెప్టెంబర్ 27వరకూ జరగనుంది. ప్రపంచ శ్రేణి ఎయిర్‌ఫోర్స్‌ను నిర్మించేందుకు విదేశీ సేనల నుంచి తాము నేర్చుకోవాల్సింది ఉందని, బహుళ టాస్క్‌లను ఎదుర్కొనేందుకు సామర్ధ్యం మెరుగుపరుచుకోవాలని షెన్ చెప్పారు. -
చైనా, పాక్‌తో యుద్ధానికి సిద్ధమవ్వాలి
-
చైనా, పాక్‌తో యుద్ధానికి సిద్ధమవ్వాలి
న్యూఢిల్లీ: భారత సైన్యం చైనా, పాకిస్తాన్లతో సమరానికి తప్పక సిద్ధం కావాల్సి ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం అన్నారు. భారత్‌ను దురాక్రమించేందుకు చైనా యత్నిస్తోందనీ, అటు పాకిస్తాన్‌తో రాజీ కుదిరే అవకాశమే కనిపించడం లేదని రావత్ పేర్కొన్నారు. ‘సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రావత్ మాట్లాడారు. ఇటీవల డోక్లాంలో భారత్, చైనా సైన్యాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన గురించి ఆయన ప్రస్తావిస్తూ ‘ఇలాంటి సమస్యలను తొందరగా ముగించొచ్చు. లేదా చైనాతో పాటు పాకిస్తాన్‌తో కూడా కలిపి యుద్ధం చేసేంతవరకు వెళ్లాల్సిరావొచ్చు’ అని అన్నారు. ఏదేమైనా ఆర్మీ సిద్ధంగా ఉండాలన్నారు. దేశం బయటి నుంచి వచ్చే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే త్రివిధ దళాల్లో ఆర్మీకి అధిక ప్రాధాన్యతను కొనసాగించాల్సిందేనన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు మంగళవారం భేటీ అయ్యి, ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను ప్రోత్సహించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.