రాలుతున్న ఆశలు
సాక్షి, చిన్నంబావి: జిల్లాలో మామిడిరైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఏటా పెట్టుబడి పెరుగుతోందని, దిగుబడి పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పుల కారణంగా మామిడిచెట్లు కనీసం 30శాతం పూతకు కూడా నోచుకోవడంలేదని వాపోతున్నారు. ఫలితంగా దిగుబడి లేదని, పూర్తిగా ఈ తోటలపైనే ఆధారపడిన తమ కుటుంబాలు అప్పులపాలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు మొత్తం 11వేల 800 ఎకరాలలో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా పాన్గల్ మండలంలో, ఆ తర్వాత వరుసగా చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో సాగు చేస్తున్నారు.
గత ఏడాది సకాలంలో పూత రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరకొరగా పండిన పంట చేతికందే సమయంలో అకాలవర్షాలు, వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే చేతికందిన అరకొర పంటకు మార్కెట్లో ధర లేక పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఉన్నాయని, చివరికి అప్పులే మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ మార్పులే కారణం
మామిడిపూత మొదలు నుంచి కాయలు కోసే వరకు పంట దిగుబడి వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. డిసెంబరు చివరివారం జనవరిలో తగినంత పూత రావాలి. ఈసారి మండలంలో ఆ పరిస్థితి లేదు. కాస్తో కూస్తో వచ్చిన పూత ప్రస్తుత వాతావరణానికి రాలిపోతుంది. పలుచోట్ల చెట్లకు అసలుపూత రాలేదు. ఇందుకు ప్రధాన కారణం గత నెలలో కురిసిన వర్షాలు, చలిగాలులు, ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడమేనని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు.
ఎకరానికి ఐదు టన్నులు
ప్రస్తుత ప్రతికూల వాతవరణం మామిడి దిగుబడి పై ప్రభావం చూపనుంది. పరిస్థితులు అనుకూ లిస్తే ఎకరానికి ఐదు టన్నుల దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. కానీ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో చెట్లకు పూత రాలేదని వాపోతున్నారు. అందువల్లే 40శాతం దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎకరాకు రూ.40వేల ఖర్చు
ఒక్కసారి పెట్టుబడి పెడితే క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందన్న ధీమాతో అనేక మంది రైతులు మామిడి సాగులోకి దిగుతున్నారు. ఏటా రూ.30 నుంచి రూ.40వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. అయితే కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది పూత రాకపోవడంతో ఇప్పటికే పలుమార్లు రసాయనిక ఎరువులు వాడారు. అయినా ఫలితంలేదని అంటున్నారు.
జాడలేని గుత్తేదారులు
జిల్లాలో పండించే మామిడికి మంచి డిమాండ్ ఉండటంతో హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు తరలించి విక్రయిస్తుంటారు. రైతులకు సగటున టన్నుకు రూ.10వేల నుంచి రూ.12వేల వరకు ధర పలుకుతుంది. ప్రతిసారి డిసెంబర్, జనవరి నెలలో చెట్లకు వచ్చిన పూతను బట్టి గుత్తేదారులు తోటలను కౌలుకు తీసుకునేవారు. ముందస్తుగా రైతులతో ఒప్పందం చేసుకుంటారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కారణంగా ఒక్క కౌలుదారుడు కూడా ముందుకురావడంలేదని రైతులు చెబుతున్నారు.
మూడేళ్లుగా ఇలాగే..
మామిడి రైతులకు మూడేళ్లుగా వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. జూన్ నుంచి నవంబర్ వరకు పంటలకు సరైన మోతాదులో ఎరువులు వేయడం, తగిన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. కానీ రైతులు కౌలుదారులకు అప్పగించడంతో వారు రసాయనిక ఎరువులను వాడి దిగుబడి పెంచుకుంటారు. దీంతో ఒకే ఏడాది పంట వస్తుంది. ఆ తర్వాత దిగుబడి రాదు. అలాగే ఈ వాతావరణానికి తట్టుకునే వంగడాలను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. – వెంకటేశ్వర్లు ఉద్యానవన శాఖ అధికారి
పూత నిలవడం లేదు..
ఈ ఏడాది చెట్లకు పూత నిలవడం లేదు. దీంతో కాయలు పట్టలేదు. గతేడాది కంటే ఈ ఏడాది దారుణంగా పూత రాలిపోతోంది. పోయిన ఏడాది పండ్లు విక్రయిస్తే పెట్టుబడి వచ్చింది. ఈసారి మాత్రం అప్పులే మిగిలేలా ఉన్నాయి. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోతే కోలుకోలేని ఇబ్బందే.
– వెంకటస్వామి, రైతు, పాన్గల్