నాడు ఘనం .. నేడు కనం..!
చిన్నశంకరంపేట : సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వే మార్గంలో ఉన్న మిర్జాపల్లి రైల్వే స్టేషన్‌ది ఒకప్పుడు ఘనమైనే చరిత్రే. కానీ నేడు రైల్వే అధికారులు మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌పై చిన్నచూపు చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ మార్గంలో వెళ్లే రైలు ఏదైనా ఇక్కడ ఆగాల్సిందే. అజ్మీర్, అజంత, జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడ హాల్టింగ్ ఉండేది. సికింద్రాబాద్-నిజామాబాద్ రైలు మార్గంలో బొల్లారం, కామరెడ్డి రైల్వే స్టేషన్లకు ఉన్న ప్రాధాన్యం మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌కు ఉండేది. కానీ నేడు ఈ మార్గంలో వెళుతున్న రైళ్లలో హాల్టింగ్ లేనివే ఎక్కువ.
ఒకప్పుడు ఇక్కడ హాల్టింగ్ ఉన్న అజంత, జైపూర్, అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సైతం ఇక్కడ ఆగడంలేదు. మరో వైపు సాయినగర్ (షిర్డీ), అమరావతి, ఒకా, నాందేడ్, ఇండోర్, నర్సాపూర్, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లు వెళుతున్నా ఇక్కడ హాల్టింగ్ లేదు. ప్రస్తుతం చెప్పుకోదగిన ఎక్స్‌ప్రెస్ దేవగిరి (ముంబాయి), కృష్ణా (తిరుపతి), బాసర ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్యన నడిచే పాస్ట్ పాసింజర్లతో పాటు నిజామాబాద్-మిర్జాపల్లి లోకల్, సికింద్రాబాద్-మిర్జాపల్లి లోకల్ రైళ్లు మాత్రమే ఉన్నాయి. మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నార్సింగి జాతీయ రహదారికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు చిన్నశంకరంపేట, శేరిపల్లి, మడూర్ పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు స్పందించి గతంలో ఉన్న ప్రాధాన్యతను మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌కు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
అదనపు ప్లాట్ఫారం అవసరం..
మిర్జాపల్లి రైల్వేస్టేషన్లో అదనపు ప్లాట్ఫారం లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మిర్జాపల్లి రైల్వే స్టేషన్లో మూడు ట్రాక్‌లు ఉన్నాయి. అవసరమైతే మూడు రైళ్లు కూడా స్టేషన్లో ఏకకాలంలో హాల్టింగ్ చేసే ఏర్పాటు ఉంది. కానీ ప్రయాణికులు బోగీలోకి వెళ్లేందుకు అవసరమైన అదనపు ప్లాట్ఫారం లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఒకే సమయంలో రెండు రైళ్లు స్టేషన్లో క్రాసింగ్ అవుతున్న సమయంలో రెండో లైన్‌పైకి వచ్చే రైలు బోగిలోకి వెళ్లేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇక లగేజి ఉన్న వాళ్ల అవస్థలు చెప్పనలవికాదు. రైల్వే నిబంధనల ప్రకారం రైల్వే ట్రాక్‌ను దాటడం నేరం. కానీ ఇక్కడ అన్నీ తెలిసీ రైల్వే అధికారులు ప్రయాణికులు ట్రాక్ దాటేలా చేస్తున్నారు.
మరో సారి వినతి పత్రం అందిస్తాం...
మిర్జాపల్లిలో గతంలో హాల్టింగ్ ఉన్న అజంత, జైపూర్, అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని వినతి పత్రం అందించాం. అలాగే రైల్వే స్టేషన్లో అదనపు ప్లాట్ ఫారం ఏర్పాటు చేయాలని కోరామని చిన్నశంకరంపేట ఎంపీపీ అధ్యక్షురాలు కృపావతి, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మిర్జాపల్లి సర్పంచ్ నర్సమ్మ, ఉపసర్పంచ్ మనోజ్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ద్వారా ఈనెల 5న అక్కన్నపేటకు వస్తున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి సమస్య తీసుకవెళతామన్నారు.